విశాఖ రైల్వేజోన్‌పై తుది నిర్ణయానికి కాలపరిమితి లేదు

విశాఖ రైల్వేజోన్‌పై తుది నిర్ణయానికి కాలపరిమితి లేదు

Visakhapatnam Railway Zone : విశాఖ రైల్వేజోన్‌పై తుది నిర్ణయానికి కాలపరిమితి లేదని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటు కోసం ఓఎస్డీ స్థాయి అధికారి పని చేస్తున్నారని, ఆ నివేదికపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. డీపీఆర్‌పై రైల్వే బోర్డు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. విశాఖ రైల్వే జోన్‌పై బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ సమాధానం చెప్పారు.

విశాఖ రైల్వే జోన్ విషయంలో మరోసారి రాష్ట్రానికి మొండిచేయి ఎదురైంది. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్‌ ఏర్పాటయ్యే అవకాశాలు ఇప్పట్లో కనిపించడం లేదు. తాజా బడ్జెట్‌లో దీని కోసం నిధులేమీ కేటాయించలేదు. బడ్జెట్ లో కనీసం విశాఖ జోన్‌ ప్రస్తావన కూడా చేయకపోవడంపై ఉత్తరాంద్ర ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు. విశాఖకు రైల్వే జోన్ డిమాండ్ పుట్టి 50 ఏళ్లు దాటింది. రెండు దశాబ్ధాలుగా పోరాటం కొసాగుతూనే ఉంది.

రాష్ట్ర విభజన తరువాత విశాఖ జోన్ వచ్చినట్టే అని అంతా సంబర పడ్డారు. కానీ రాష్ట్ర విభజన నాటి హామీ కాగితాలకే పరిమితమైంది. రెండేళ్ల క్రితం అదీ ఎన్నికలు ముందు ప్రధాని మోడీ విశాఖ వచ్చి రైల్వే జోన్ ఇచ్చేశామని చెప్పారు. ప్రజలందరు సంబరాలు జరుపుకున్నారు. కానీ కేంద్రం ఇప్పటి వరకు ఆ ప్రస్తావన తీసుకురావడం లేదు.

నిధులు విడుదల చేయడం లేదు. బడ్జెట్లు దాటుతున్నాయి తప్పా.. కేంద్రం నిధులు విదల్చడం లేదు.. కనీసం బడ్జెట్ లో ఆ ప్రస్తావన తీసుకురావడం లేదు. గత బడ్జెట్ లో రైల్వే జోన్ కి అంటూ ఒక రెండు కోట్లు నిధులు కేటాయించారు. ఈసారి అదీ లేకుండా పోయింది.