Village Volunteer: వాలంటీర్ వక్ర బుద్ధి: వృద్దురాలి పెన్షన్ కాజేసిన వైనం

వృద్ధురాలు ప్రభుత్వం నుంచి వచ్చే పింఛనుపైనే ఆధారపడింది. ఈక్రమంలో గత రెండు నెలలుగా వృద్ధురాలి వేలి ముద్రలు తీసుకున్న వాలంటీర్.. నగదును మాత్రం ఇవ్వలేదు.

Village Volunteer: వాలంటీర్ వక్ర బుద్ధి: వృద్దురాలి పెన్షన్ కాజేసిన వైనం

Gudipadu

Village Volunteer: ప్రభుత్వం నుంచి నేరుగా ప్రజలకు సేవలు అందే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ తప్పుదారి పడుతుంది. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య స్వచ్చంద సేవకులుగా ఉంటామంటూ ప్రతిజ్ఞ చేసిన కొందరు వాలంటీర్లు.. డబ్బు వ్యామోహంలో మోసాలకు పాల్పడుతున్నారు. అమాయక వృద్ధులకు ప్రభుత్వం నుంచి చేరాల్సిన పెన్షన్ డబ్బును సాంకేతిక కారణాలు చూపి కొందరు వాలంటీర్లు కాజేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం వృద్ధులకు ఇచ్చే అభయహస్తం పింఛనును.. గత రెండు నెలలుగా సంబంధిత వృద్ధురాలికి ఇవ్వకుండా వాలంటీర్ కాజేస్తున్న ఘటన కృష్ణాజిల్లా గుడిపాడులో వెలుగు చూసింది.

Also read: Mamata Banerjee: విచారణకు రావాలంటూ మమతా బెనర్జీకి ముంబై కోర్టు సమన్లు

గుడిపాడుకి చెందిన ఓ వృద్ధురాలికి ప్రభుత్వం నుంచి అభయ హస్తం పధకం కింద ప్రతినెలా పింఛను అందుతుంది. వృద్ధురాలు ప్రభుత్వం నుంచి వచ్చే పింఛనుపైనే ఆధారపడింది. ఈక్రమంలో గత రెండు నెలలుగా వృద్ధురాలి వేలి ముద్రలు తీసుకున్న వాలంటీర్.. నగదును మాత్రం ఇవ్వలేదు. బాధితురాలు పలుమార్లు ప్రశ్నించినా.. ప్రభుత్వం నుంచి ఇంకా డబ్బులు రాలేదంటూ వాలంటీర్ మాయమాటలు చెప్పాడు.

Also Read: Viral Video: వంకర టింకరగా ల్యాండ్ అవబోయిన విమానం, తృటిలో తప్పిన పెనుప్రమాదం

దీనిపై స్థానిక యువకులు కొందరు గ్రామ సచివాలయంలో ఆరా తీయగా.. వాలంటీర్ బాగోతం బయటపడింది. ఘటనపై గుడిపాడు విల్లేజ్ వెల్ఫేర్ అసిస్టెంట్ స్పందిస్తూ.. వాలంటీర్ ను మందలించి డబ్బును సదరు బాధితురాలికి అందించారు. మరోసారి ఇటువంటి ఘటనలకు పాల్పడితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి బాధ్యతల నుంచి తప్పించాల్సి వస్తుందని వెల్ఫేర్ అసిస్టెంట్ వాలంటీర్ ను హెచ్చరించారు.

Also Read: Brave Man: తగలబడుతున్న లారీని సురక్షిత ప్రాంతానికి తరలించిన వ్యక్తి