వలసలు.. ప్లస్సా మైనస్సా? గ్రేటర్ విశాఖపై జెండా ఎగరేయాలని చూస్తున్న వైసీపీకి కొత్త సమస్యలు

  • Published By: naveen ,Published On : October 10, 2020 / 02:44 PM IST
వలసలు.. ప్లస్సా మైనస్సా? గ్రేటర్ విశాఖపై జెండా ఎగరేయాలని చూస్తున్న వైసీపీకి కొత్త సమస్యలు

visakha ysrcp : విశాఖ జిల్లా అంతటా వైసీపీదే బలం. ఇది పైకి కనిపిస్తున్న, వినిపిస్తున్న మాట. కానీ వాస్తవానికి 2019 ఎన్నికల్లో రూరల్ జిల్లా అంతటా వైసీపీ జెండా ఎగిరినా విశాఖ నగర నడిబొడ్డులోని నాలుగు నియోజకవర్గాల్లో మాత్రం టీడీపీ జెండా ఎగిరింది. అసలే విశాఖ నగరం పాలనా రాజధానిగా మారబోతోంది. దీంతో ఇప్పుడు అధికార పార్టీ విశాఖ నగరంపై దృష్టి పెట్టి ఆపరేషన్‌ ఆకర్ష్‌ మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే విశాఖ దక్షిణం ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్ ఏకంగా కుమారులతో కలిసి పార్టీ మారిపోయారు.

విశాఖలో వైసీపీకి కొత్త సమస్య:
దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత జీవీఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమకు బలం లేని విశాఖ నగరంలోని ఎమ్మెల్యేలను, చోటా మోటా నేతలను లాగేసే పనిలో అధికార వైసీపీ బిజీగా ఉందంటున్నారు. సరిగ్గా ఇక్కడే కొత్త సమస్య వచ్చి పడుతోందని టాక్‌. టీడీపీ నుంచి కొత్త నీరు వైసీపీలోకి వస్తుంది. కొత్త నీరు వస్తే పాత నీరు తలొంచుకోని దారివ్వాలి. లేదా కొత్త నీటిలో కలిసిపోవాలి. కానీ, ఈ రెండు జరిగేలా కనిపించడం లేదంటున్నారు.

అప్పుడు అవంతి, ఇప్పుడు వాసుపల్లి:
వైసీపీలోకి కొత్తగా టీడీపీ నేతలు, శ్రేణులు వస్తున్నాయి. దీంతో కొత్తగా వచ్చే వారికి, ఇప్పటికే పార్టీలో ఉన్న వారికి మధ్య విభేదాలు తలెత్తుతున్నాయన్నది టాక్. గతంలో భీమిలిలో టీడీపీ నుంచి కొత్త నీరు అవంతి శ్రీనివాస్‌తో పాటు వచ్చి చేరింది. అప్పుడు కూడా ఇదే సమస్య ఎదురైంది. ఆ తర్వాత విశాఖ తూర్పు నమన్వయకర్తను మార్చినప్పుడు కూడా సేమ్‌ సమస్య రిపీట్‌ అయ్యింది. దీనికి తోడు ఇప్పుడు ఏకంగా విశాఖ దక్షిణం ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌ కుమార్ తన కుమారులతో కలిసి వైసీపీ మద్దతుదారుడిగా మారారు.

తన అనుచరులకు టికెట్లు ఇప్పించుకున్న టీడీపీ ఎమ్మెల్యే:
ప్రతిరోజు వాసుపల్లి తన అభిమానులతో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇప్పటికే జీవీఎంసీ ఎన్నికల కోసం అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. దక్షిణంలో ఎమ్మెల్యే అనుయాయులుకు టీడీపీ నుంచి గతంలో కార్పొరేటర్ టికెట్లు ఇప్పించుకున్నారు. ఇప్పుడు ఆయన వైసీపీలో ఉన్నారు. గతంలో తమను అనేక విధాలుగా వేధించిన దక్షిణం ఎమ్మెల్యే రాకను అక్కడి వైసీపీ శ్రేణులు జీర్జించుకోలేక పోతున్నాయని అంటున్నారు. కానీ, అధిష్టానానికి దీని గురించి చెప్పుకోలేని పరిస్థితి. చేసేదేం లేక మౌనంగా ఉండిపోతున్నారట.

గణబాబు కూడా వస్తారని భయపడుతున్నారు:
అటు వాసుపల్లికి సహకరించడానికి మనసు అంగీకరించక, అధిష్టానం ఆదేశాలను పాటించలేక తమలో తామే మదనపడుతున్నారు దక్షిణ నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు. విశాఖ పశ్చిమం నుంచి కూడా ఎమ్మెల్యే గణబాబు వైసీపీ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం సాగుతోంది. అదే జరిగితే మరి రానున్న రోజులలో అక్కడ సమన్వయకర్తలకు, వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులకు కొత్త తలనొప్పి తప్పదంటున్నారు. కొత్త కార్యకర్తలు వచ్చినప్పుడు ఇబ్బంది ఉంటుందని, అధిష్టానం అన్ని విషయాలు చూసుకుంటుందని కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదని మంత్రి అవంతి భరోసా ఇస్తున్నారు.

వ్యతిరేకత వస్తే ఏం చేస్తారు?
అంతవరకు బాగానే ఉన్నా.. టీడీపీలో ఉండగా టికెట్లు ఆశించిన, పొందిన కార్యకర్తలు ఎలా ప్రతి స్పందిస్తారన్నదే ప్రశ్న. వారిని సర్ది చెప్పుకోవాల్సి వస్తుందా? లేక వైసీపీ పెద్దలకు నచ్చజెప్పి టికెట్లు ఇప్పిస్తారా అన్నది కూడా క్లారిటీ లేదంటున్నారు. ఒకవేళ ఇప్పుడొచ్చిన టీడీపీ వాళ్లకు టికెట్లు ఇస్తే.. ఎప్పటి నుంచో ఉన్న వైసీపీ కేడర్‌ నుంచి వ్యతిరేకత వస్తుంది. మరి ఈ అంశాలను ఎలా మ్యానేజ్‌ చేస్తారన్నది చూడాలి. ఈ పరిస్థితుల్లో గ్రేటర్ విశాఖపై జెండా ఎగరేయాలని భావిస్తున్న వైసీపీ లక్ష్యం నెరవేరుతుందా? కార్యకర్తల మధ్య సయోధ్య కుదురుతుందా? అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.