‘ఫోన్‌ ట్యాపింగ్‌పై దర్యాప్తు ఎందుకు జరుపకూడదు’… ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

  • Published By: bheemraj ,Published On : August 18, 2020 / 08:59 PM IST
‘ఫోన్‌ ట్యాపింగ్‌పై దర్యాప్తు ఎందుకు జరుపకూడదు’… ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఇళ్లపట్టాలు, మూడు రాజధానులపై స్టే విధించిన హైకోర్ట్.. తాజాగా ఫోన్‌ ట్యాపింగ్ ఆరోపణలపై ఎందుకు విచారణ జరుపకూడదో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.



ఏపీలో ముఖ్యుల ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయంటూ హైకోర్టులో దాఖలైన పిల్‌పై ఉన్నతన్యాయస్థానం విచారణ జరిపింది. ప్రభుత్వం తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఈ పిల్‌పై విచారించాలంటే ఆ సమాచారం ఏ సోర్సు నుంచి వచ్చిందనేది తెలియాలన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌పై ఆధారాలను సమర్పించాలన్నారు.

ఇవన్నీ ప్రభుత్వంపై కక్షతో చేసిన ఆరోపణల్లా ఉన్నాయన్నారు అడిషనల్ అడ్వకేట్ జనరల్. ఏఏజీ వాదనపై స్పందించిన న్యాయస్థానం ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించిన ఆధారాలు ఉంటే జతచేసి అఫిడవిట్‌ దాఖలు చేయాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాదికి సూచించింది.



అటు ఫోన్‌ ట్యాపింగ్‌పై దర్యాప్తు ఎందుకు జరపకూడదని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. కౌంటర్లు దాఖలు చేయాలని సర్వీస్‌ ప్రొవైడర్లకు నోటీసులు జారీ చేసింది. గురువారం లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.

అటు విశాఖ జిల్లా తిరుమలగిరి ట్రైబల్ పాఠశాల స్థలాన్ని ఇళ్ల పట్టాలుగా ఇస్తున్నారంటూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలకు సంబంధించిన స్థలాల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది.