వైఎస్ఆర్ నవశకం: రేపటి నుంచే ప్రారంభం.. ప్రతి పథకం మీ గడపకే!

  • Published By: vamsi ,Published On : November 19, 2019 / 03:20 AM IST
వైఎస్ఆర్ నవశకం: రేపటి నుంచే ప్రారంభం.. ప్రతి పథకం మీ గడపకే!

వైఎస్ఆర్ నవశకం కార్యక్రమాన్ని రేపటి(20 నవంబర్ 2019) నుంచి ప్రారంభిస్తుంది ప్రభుత్వం. ప్రతి ఇంటి గడప వద్దకు పాలన అనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్‌ఆర్ నవశకం ప్రవేశ పెట్టింది. నవశకం నియమావళిని ఖచ్చితంగా అమలు చేసి లబ్ధిదారులను ఎంపిక చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఇప్పటికే ప్రభుత్వం దిశానిర్ధేశం చేసింది.

గ్రామ పంచాయతీల వద్ద గ్రామసభలు నిర్వహించి ప్రజాప్రతినిధుల సమక్షంలో కార్డులను పంపిణీ చేయనున్నారు. వైఎస్‌ఆర్‌ నవశకంలో లబ్ధిదారుల ఎంపికలో భాగంగా నవంబర్ 20వ తేదీ నుంచి డిసెంబరు 20వ తేదీ వరకు గ్రామ, వార్డు వాలంటీర్లు సర్వే నిర్వహిస్తారు. ఐదు రకాలైన కార్డుల జారీ, ఏడు పథకాల అమలు నవశకం ముఖ్య ఉద్దేశం. ఇందు కోసం ప్రభుత్వ మార్గదర్శకాలను అమలు చేయనున్నారు.

సన్న బియ్యం, వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక, ఆరోగ్యశ్రీ, జగనన్న విద్యా దీవెన, విద్యా వసతి కార్యక్రమాల్లో కార్డులను ప్రత్యేకంగా అందజేసేందుకు వాలంటీర్లు సర్వే చేస్తారు. అలాగే వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసా, కాపు నేస్తం, నేతన్న భరోసా, గీతన్న నేస్తం, అమ్మఒడి, వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకంలో అర్హుల ఎంపిక, అనర్హుల పేర్లను నివేదికగా వాలంటీర్లు అందజేస్తారు.

వాలంటీర్లు లేని చోట్ల పొరుగున ఉన్న గ్రామ, వార్డు వాలంటీర్లను ఇన్‌ఛార్జులుగా నియమించి వారితో సర్వే చేయిస్తారు. అది పూర్తయిన తర్వాత డిసెంబరు 1న డేటాను కంప్యూటరీకరిస్తారు. అర్హులతో పాటు అనర్హుల జాబితాను డిసెంబరు 2 నుంచి 7వ తేదీల్లో ప్రకటిస్తారన్నారు. 11, 12 తేదీల్లో ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించి 15-18 తేదీల్లో గ్రామ సభలు నిర్వహించి 19న ఫైనల్ లిస్ట్‌ని ప్రకటిస్తారు.

అమ్మఒడి పథకంలో దరఖాస్తు చేసుకునే పిల్లల తల్లులకు విధిగా ఆధార్‌ కార్డు ఉండాలని, ఛైల్డ్‌ ఇన్ఫోలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. దర్జీలు, రజక, నాయీ బ్రాహ్మణులకు ఆర్థిక సహకారం అందజేసేలా బీసీ సంక్షేమ శాఖ ద్వారా కార్యక్రమాలు చేస్తున్నందున దరఖాస్తు చేసుకోవచ్చు. వైఎస్‌ఆర్‌ కాపు నేస్తంలో 45 సంవత్సరాలు నిండిన ఎస్‌హెచ్‌జీ మహిళలకు ఆర్థిక సాయం అందజేస్తారు.