అవినీతి పరులే నోరెళ్లబెట్టే అవినీతి…అవినీతి అనకొండకు వందల కోట్లు స్వాహా

  • Published By: bheemraj ,Published On : August 18, 2020 / 06:28 PM IST
అవినీతి పరులే నోరెళ్లబెట్టే అవినీతి…అవినీతి అనకొండకు వందల కోట్లు స్వాహా

ఎవరైనా దౌర్జన్యంగా భూములు లాక్కుంటే, కబ్జాలకు పాల్పడితే, ప్రభుత్వ భూములను బడా బాబులు హస్తగతం చేసుకుంటే… న్యాయం చేయాలని, భూములను కాపాడాలని మండల స్థాయిలో ఉన్న రెవెన్యూ అధికారి ఎమ్మార్వో దగ్గరికి వెళ్తాము. కానీ కాపాడాల్పిన ఆయనే కాజేస్తే దిక్కు ఎవరు? ఇంక ఎవరికి చెప్పుకోవాలి?

అతనో అవినీతి అనకొండ…వందల కోట్ల అవినీతికి పాల్పడ్డాడు. ప్రజల భూములను అధికారులకు గిఫ్టు కింద ఇచ్చాడు. ఒకరి పట్టాను మరొకరికి ఇచ్చాడు. అవినీతి పరులే నోరెళ్లబెట్టే అవినీతి చేశాడు. ప్రజల భూములను రక్షించాల్సిన ఓ ఎమ్మార్వో భక్షిస్తున్నాడు. ప్రజల భూములు, ప్రభుత్వ భూములను అప్పనంగా కాజేస్తున్నాడు. కొంతమందితో కుమ్మక్కై అందినకాడికి దోచుకుంటున్నాడు.

అతని అవినీతికి హద్దులు లేవు. వందల కోట్ల అవినీతికి పాల్పడ్డాడు. తాను ఎమ్మార్వో అయిందే అవినీతి చేసేందుకు అన్నచందంగా తయరయ్యాడు. తానొక ప్రభుత్వ ఉద్యోగినన్న సంగతి మరిచిపోయి కబ్జాదారుడిగా మారాడు. అందినకాడికి దోచుకుంటున్నాడు.

ఏసీబీ చరిత్రలోనే అత్యంత భారీ మొత్తం లంచం
మేడ్చల్ జిల్లా కీసర తహసీల్దార్ నాగరాజు అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తవ్విన కొద్ది అతని అక్రమాలు బయటికొస్తున్నాయి. ఏసీబీ చరిత్రలోనే అత్యంత భారీ మొత్తం లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కీసర తహసీల్దార్‌ నాగరాజు అవినీతి భాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతోంది.

తాజాగా మరో భూ ఆక్రమాల స్కామ్ బయటపడింది. 94 ఎకరాల భూమిలో 1981 నుంచి 94 ఎకరాల్లో దళితులు కౌలు రైతులుగా ఉంటున్నారు. ఈ భూమిని తమకు అమలు పరిచాలని దళితులు ఎన్నో సార్లు వేడుకున్నారు. 2006 నుంచి పట్టాదారులకు, కౌలు దారులకు కోర్టులో ఈ వివాదం నడుస్తోంది.

కేసు నడుస్తున్నప్పుడు కోర్టును ధిక్కరించి తహసీల్దార్ నాగరాజు రియల్టర్స్ తో కుమ్మక్కై 25 ఎకరాల భూమికి వారికి పాస్ బుక్స్ ఇచ్చారని రైతులు ఆరోపిస్తున్నారు. రైతులకు తెలియకుండా 25 ఎకరాల భూమిని ఇతరులకు పట్టా చేశారు. కోర్టులో కేసు నడుస్తుండగా పట్టా చేశాడని దళిత రైతులు ఆరోపిస్తున్నారు. 2018లో భూ పరిస్థితిని విచారించాలని కోర్టు జాయింట్ కలెక్టర్ ను ఆదేశించింది. అయితే అంతకముందే పాస్ పుస్తకాలు ఎలా ఇచ్చారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాన్ని అడిగితే పై కోర్టుకు వెళ్లాలని ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు.

100 కోట్లకు పైగా ఆస్తులు
ఏసీబీ చరిత్రలోనే అత్యంత భారీ మొత్తం లంచం తీసుకుంటూ పట్టుబడ్డ లంచావతారం కీసర తహసీల్దార్‌ నాగరాజు అవినీతి భాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. శనివారం (ఆగస్టు 15,2020) తహసీల్దార్‌ కార్యాలయం, నాగరాజు ఇల్లు, బంధువుల ఇళ్ళల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. వందల కోట్ల విలువైన భూమి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

నాగరాజుతో పాటు మరో ముగ్గురిని 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌కు తరలించారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కీసర మండలంలోని రాంపల్లి దయారా గ్రామంలో సర్వే నంబర్‌ 614, ఇతర నంబర్లలో కలిపి మొత్తం 19 ఎకరాల 39 గుంటల స్థలానికి సంబంధించి అనుకూలంగా పత్రాలు ఇచ్చేందుకు శ్రీనాథ్‌, అంజిరెడ్డి నుంచి తాసిల్దార్‌ నాగరాజు రూ.2 కోట్లు లంచం డిమాండ్‌ చేశాడు.

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ నాగరాజు
కాప్రాలోని అరుల్‌కాలనీలో అంజిరెడ్డికి తెలిసిన వారి ఇంట్లో నాగరాజు లంచం తీసుకోబోతున్నాడనే సమాచారంతో ఏసీబీ అధికారులు మాటువేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. శనివారం అల్వాల్‌లోని తాసిల్దార్‌ నాగరాజు ఇల్లు, అతడి బంధువుల ఇండ్లు, కీసర తాసిల్దార్‌ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు.

రూ.36 లక్షల నగదు, అరకిలో బంగారు ఆభరణాలు, లాకర్‌ కీ, పలు భూపత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ ఆస్తుల విలువ రూ.వందల కోట్లకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు.

భూసెటిల్‌మెంట్‌ కోసం రూ.2 కోట్లకు డీల్‌
మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కీసర మండలం రాంపల్లి దయారాలో భూవివాదం సెటిల్‌మెంట్‌ కోసం నాగరాజు రూ.2 కోట్లకు డీల్‌ కుదుర్చుకున్నట్టు తేల్చారు. ఇందులో కీలక వ్యక్తికి కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డితో సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు. కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు.

భూవివాదం సెటిల్‌మెంట్‌ కోసం తాసిల్దార్‌ నాగరాజు శుక్రవారం రూ.కోటి 10 లక్షల తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు.. లంచం ఇస్తున్న ఉప్పల్‌లోని సత్య డెవలపర్స్‌కు చెందిన చౌవ్ల శ్రీనాథ్‌యాదవ్‌, రాంపల్లి దయారా గ్రామానికి చెందిన కందాడి అంజిరెడ్డి, రాంపల్లి వీఆర్‌ఏ బొంగు సాయిరాజ్‌ను అరెస్టుచేసిన విషయం తెలిసిందే. వీరిని శనివారం ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపర్చి రెండువారాల జ్యుడిషియల్‌ రిమాండ్‌కు తరలించారు.

ఎంపీ రేవంత్ రెడ్డి పాత్ర ఉందా?
ఈ లంచం కేసులో కీలకవ్యక్తిగా ఉన్న రాంపల్లి దయారాకు చెందిన అంజిరెడ్డి ఇంట్లో మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డికి సంబంధించిన పలు అధికారిక పత్రాలను ఏసీబీ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. రేవంత్‌రెడ్డి.. ఎంపీలాడ్స్‌ సంబంధించిన పలు పత్రాలు, పలు వివాదాస్పద భూములపై రేవంత్‌రెడ్డి ఆర్టీఐ కింద చేసిన దరఖాస్తులు ఇందులో ఉన్నాయి.

అంజిరెడ్డికి రేవంత్‌తో సన్నిహిత సంబంధాలు ఉండి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ దిశగానూ అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం.

పాస్‌బుక్ ఇవ్వలేదు :మాజీ పోలీస్‌ అధికారి

మరోవైపు పాస్‌బుక్ ఇవ్వకుండా నాగరాజు ఇబ్బంది పెడుతున్నాడని ఓ మాజీ పోలీస్‌ అధికారి మీడియాకు తెలిపారు.ఈ వివాదం నడస్తుండగానే రియాల్టర్‌ శ్రీనాథ్‌ ఈ భూమిని పట్టాదారుల వద్ద కొనుగోలు చేశాడు.దీంతో రైతులు స్థానిక నాయకుడు అంజిరెడ్డిని ఆశ్రయించారు. పట్టాదారులు, రైతులు, రియాల్టర్లు మాట్లాడుకుని కౌలు రైతులకు కొంత నగదు ఇచ్చారు. రైతులు కబ్జానుంచి జరిగేందుకు అంగీకరించారు.

ఈ క్రమంలోనే కోర్ట్‌ ఆఫ్‌ వర్డ్‌లో ఉన్న భూమిలో 19 ఎకరాల 39 గుంటల స్థలానికి సంబంధించి రియల్టర్‌ శ్రీనాథ్‌కు అనుకూలంగా పత్రాలు ఇచ్చేందుకు తాసిల్దార్‌ నాగరాజు రూ.2 కోట్లకు బేరం కుదుర్చుకున్నాడు.

ఏడేళ్లుగా సాగుతున్న వివాదం
మేడ్చల్‌ జిల్లా కీసర మండలం రాంపల్లి దయారా రెవెన్యూ గ్రామంలోని సర్వేనంబర్‌ 604 నుంచి 614 వరకు సుమారు 52 ఎకరాల భూమి గాలిబ్‌జన్‌, వారి కుటుంబసభ్యుల (వీరిలో చాలామంది మైనర్లుగా ఉండటంతో కోర్ట్‌ ఆఫ్‌ వర్డ్‌గా పేర్కొంటూ) పేరుమీద ఉన్నది. గాలిబ్‌జన్‌ పూర్వీకులు దాదాపు 80 ఏండ్ల కిందటే రాంపల్లి దయారాకు చెందిన 20-25 మంది రైతులకు దాదాపు 28 ఎకరాలు కౌలుకు ఇచ్చారు.

సాగుచేసుకుంటున్న రైతుల పేర్లు ఉమ్మడి రాష్ట్రంలోనే కబ్జాకాలంలోకి ఎక్కాయి. కోర్ట్‌ ఆఫ్‌ వర్డ్‌గా ఉన్న భూమిని తమకు అప్పగించాలని గాలిబ్‌జన్‌ కుటుంబసభ్యులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కౌలు చేసుకుంటున్న తమకే హక్కులు దక్కాలని రైతులు కోర్టుకు విన్నవించారు. కోర్ట్‌ ఆఫ్‌ వర్డ్‌గా ఉన్న భూమి గాలిబ్‌జన్‌ కుటుంబసభ్యులదేనని కోర్టు ఆదేశించింది. రైతులు మళ్లీ కౌంటర్‌ పిటిషన్లు దాఖలుచేయడంతో వివాదం నడుస్తున్నది.

2005-06లో అప్పటి రెవెన్యూ అధికారులు విచారణ జరిపి కోర్ట్‌ ఆఫ్‌ వర్డ్‌ (వారసులు మైనర్లుగా ఉన్నప్పుడు ఆ భూములను కోర్ట్‌ ఆఫ్‌ వర్డ్‌ కింద ప్రభుత్వ కస్టడీలో ఉంచుతారు) కింద విడుదల చేశారు. ప్రభుత్వం చేపట్టిన ధరణి వెబ్‌సైట్‌ ప్రక్రియలో భాగంగా అసలు పట్టాదారుల పేర్లు వెలుగులోకి వచ్చాయి.

నాగరాజు అవినీతి చరిత్ర
2018 ఏప్రిల్‌ 25 నుంచి కీసర తాసిల్దార్‌గా పనిచేస్తున్న నాగరాజుపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. శామీర్‌పేట ఆర్‌ఐగా పనిచేస్తుండగానే నాగరాజు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. రంగారెడ్డి జిల్లా హయాత్‌నగర్‌ మండల డిప్యూటీ తాసిల్దార్‌గా పనిచేస్తున్నప్పుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. కూకట్‌పల్లి తాసిల్దార్‌గా ఉన్నప్పుడు హైటెక్స్‌ సిటీకి దగ్గరలోని ఓ భూవివాదంలో అన్నీతానై వ్యవహరించాడనే ఆరోపణలున్నాయి. కలెక్టర్‌ డాక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు.. నాగరాజును అనేక దఫాలుగా మందలించినా ఆయన తీరు మార్చుకోలేదని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. చీర్యాల చెరువు పూడ్చివేయడంలో నాగరాజు కీలకంగా వ్యవహరించాడు.