No Wear Mask:మాస్క్ లేదని సీఆర్పీఎఫ్ జవాన్‌కి సంకెళ్లు వేసిన పోలీసులు

కరోనా వైరస్ నివారణ జాగ్రత్తలు పాటించ లేదని, మాస్క్ వేసుకోలేదనే కారణంతో సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీసు ఫోర్సు(సీఆర్‌పీఎఫ్‌) కి చెందిన జవాన్ ని కర్నాటక పోలీసులు అదుపులోకి తీసుకోవడం, చేతుల

No Wear Mask:మాస్క్ లేదని సీఆర్పీఎఫ్ జవాన్‌కి సంకెళ్లు వేసిన పోలీసులు

No Wear Mask:కరోనా వైరస్ నివారణ జాగ్రత్తలు పాటించ లేదని, మాస్క్ వేసుకోలేదనే కారణంతో సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీసు ఫోర్సు(సీఆర్‌పీఎఫ్‌) కి చెందిన జవాన్ ని కర్నాటక పోలీసులు అదుపులోకి తీసుకోవడం, చేతులకు సంకెళ్లు వేసి పోలీస్ స్టేషన్ లో నేలపై కూర్చోబెట్టడం దుమారం రేపుతోంది. కర్నాటక పోలీసులు వర్సెస్ సీఆర్పీఎఫ్ గా మారింది. కర్నాటక పోలీసుల తీరుపై సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు తీవ్రంగా మండిపడుతున్నారు. కర్నాటక పోలీసుల తీరుని తప్పుపట్టారు. బాధిత పోలీసులపై చర్యలు తీసుకోవాలని కర్నాటక డీజీపీకి లేఖ రాశారు.

తమ జవాన్‌పై కర్నాటక పోలీసులు లాఠీలతో దాడికి పాల్పడ్డారని, బేడీలు వేసి, పోలీసు స్టేషన్‌ దాకా నడిపించుకుంటూ తీసుకెళ్లారని సీఆర్‌పీఎఫ్‌ ఉన్నతాధికారులు ఆరోపించారు. బాధిత జవాన్‌కు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం(ఏప్రిల్ 27,2020) కర్ణాటక డీజీపీ ప్రవీణ్‌ సూద్‌కు లేఖ రాశారు.

అసలేం జరిగింది?  
సీఆర్‌పీఎఫ్‌కు చెందిన కోబ్రా దళంలో సచిన్‌ సావంత్‌ జవాన్‌గా పనిచేస్తున్నాడు. అతడు గెరిల్లా యుద్ధంలో నిపుణుడు. యాంటీ మావోయిస్టు ఆపరేషన్లలో పాల్గొంటాడు. అతడి స్వస్థలం కర్ణాటకలోని బెళగావిలోని ఎగ్జాంబా గ్రామం. ప్రస్తుతం సెలవులో ఉన్నాడు. ఏప్రిల్ 23న సావంత్‌ తన ఇంటి ముందు బైక్‌ను క్లీన్‌ చేస్తుండగా పోలీసులు అటుగా వచ్చారు. లాక్‌డౌన్‌ అమల్లో ఉంది, ఇంట్లో ఉండకుండా బయట ఎందుకు ఉన్నావంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా మాస్కు ఎందుకు ధరించలేదని నిలదీశారు. సావంత్‌ కూడా గట్టిగా బదులిచ్చాడు. దీంతో పోలీసులు ఆగ్రహంతో అతడిపై దాడికి పాల్పడ్డారు. చేతికి బేడీలు వేశారు. పోలీసు స్టేషన్‌కు తరలించారు. లాకప్‌లో గొలుసులతో బంధించారు. అతడిపై కేసు నమోదు చేశారు. ఈ దృశ్యాలన్నీ స్థానికుడొకరు తన సెల్‌ఫోన్‌లో బంధించాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వ్యవహారం కాస్తా సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులకు చేరింది. వారు వెంటనే స్పందించారు. పోలీసుల తీరుని తప్పు పట్టిన సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

బీట్ కానిస్టేబుళ్లతో దురుసుగా ప్రవర్తించిన జవాన్:
సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు రాసిన లేఖపై కర్నాటక పోలీసులు స్పందించారు. జవాన్ బీట్ కానిస్టేబుళ్లతో దురుసుగా ప్రవర్తించాడని చెప్పారు. లాక్ డౌన్ విధులు పాటించాలని కోరగా నోటికొచ్చినట్లు మాట్లాడాడని చెప్పారు. నేనూ పోలీస్ నే, నేను రూల్స్ పాటించను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని వాగ్వాదానికి దిగాడని వెల్లడించారు. అంతేకాదు బీట్ కానిస్టేబుళ్లపై దాడి కూడా చేశాడని చెప్పారు. దీంతో జవాన్ ని అరెస్ట్ చేయాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం అతడు జుడిషియల్ కస్టడీలో ఉన్నట్టు చెప్పారు. అయితే జవాన్ వీధిలోకి రాలేదు, కేవలం ఇంటి బయట ఉన్నాడు, అందుకే మాస్క్ వేసుకోలేదని సీఆర్పీఎఫ్ అధికారులు చెప్పారు.

బెయిల్ కు అప్లయ్ చేసుకున్న జవాన్:
జవాన్ సచిన్ సావంత్ బెయిల్ కి దరఖాస్తు చేసుకున్నాడు. ఏప్రిల్ 28న కోర్టు ముందుకి విచారణకు రానుంది. ఈ విచారణకు సీఆర్పీఎఫ్ అధికారులు హాజరుకానున్నారు. పోలీసుల తీరుని తప్పుపట్టిన సీఆర్పీఎఫ్ అధికారులు, తమ జవాన్ కి న్యాయం జరిగేలా చూడాలని కర్నాటక డీజీపీని కోరారు. రెండు దళాల మధ్య ఇలాంటి వాతావరణం మంచిది కాదన్నారు. మొత్తంగా సీఆర్‌పీఎఫ్), కర్ణాటక పోలీసుల మధ్య లాక్‌డౌన్‌ పెద్ద చిచ్చే రాజేసింది. చూడాలి ఈ వ్యవహారం ఎంత దూరం వరకు వెళ్తుందో.