దేశంలో ఉల్లి దొంగలు : 350 కిలోలు ఎత్తుకెళ్లారని పోలీస్ స్టేషన్ కి రైతు

  • Published By: venkaiahnaidu ,Published On : December 4, 2019 / 09:30 AM IST
దేశంలో ఉల్లి దొంగలు : 350 కిలోలు ఎత్తుకెళ్లారని పోలీస్ స్టేషన్ కి రైతు

దేశంలో ఇప్పుడు ఉల్లి దొంగలు పడ్డారు. ఖరీదైనదిగా మారి దేశ ప్రజల్లో కళ్లల్లో కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లిని దొంగలు ఎత్తుకెళ్తున్నారు. తమిళనాడులో వెలుగు చూసిన ఉల్లి దొంగల ఉదంతం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

తమిళనాడులోని పెరంబలూర్ జిల్లాలోని కూత్తనూర్ గ్రామంలో ముత్తుక్రిష్ణన్ అనే రైతు జీవిస్తున్నాడు. అతను ఉల్లి పంటలు వేసి జీవనం సాగిస్తున్నాడు. అయితే తన మూడు ఎకరాల పొలంలో ఉల్లి పంట సాగుచేసేందుకు 350 కేజీల చిన్న ఉల్లిపాయలను 6 చిన్న గోతాల్లో ఉంచి పొలం దగ్గర ఉంచాడు. అయితే ఆ ప్రాంతాంలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నందున నాలుగైదు రోజులుగా ఆయన పొలం వైపు వెళ్లలేదు. అయితే బుధవారం(నవంబర్-4,2019)పొలం వెళ్లి చూసిన ముత్తు క్రిష్ణన్ షాక్ అయ్యాడు.

350 కేజీల చిన్న ఉల్లిపాయలు దొంగలు ఎత్తుకెళ్లారని తెలిసి ఏం చేయాలో అర్థం కాక నేరుగా దగ్గర్లోని పడలూర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లెయింట్ ఇచ్చాడు. ఉల్లిపాయలు ఉంచిన ప్లేస్ కూత్తనూర్-అలత్తూర్ మెయిన్ రోడ్ కి 50 మీటర్ల దూరంలోనే ఉందని,మినీ లోడ్ వాహనంతో వచ్చిన దొంగలు ఈ ఉల్లిపాయలను ఎత్తుకెళ్లి ఉండవచ్చిని అనుమానం వ్యక్తం చేశారు అధికారులు. నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఆయన తెలిపారు. దొంగలు ఎత్తుకెళ్లిన ఉల్లిపాయల విలువ మార్కెట్లో రూ.45వేలకు పైనే ఉంటుందని రైతు ముత్తుక్రిష్ణన్ తెలిపారు. ఒక్క తమిళనాడులోనే మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో కూడా ఉల్లి దొంగలు తిరుగుతున్నారు.