గుండెలను పిండే విషాదం : అమ్మా నాన్న.. మా పెళ్లి కోసం అప్పు చేయొద్దు.. ఇద్దరమ్మాయిలు ఆత్మహత్య

హైదరాబాద్‌ హయత్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. గుండెలను పిండేసే ఘటన జరిగింది. ఇద్దరమ్మాయిలు తీసుకున్న నిర్ణయం అందరిని కంటతడి పెట్టిస్తోంది. అయ్యో పాపం..

  • Published By: veegamteam ,Published On : February 8, 2020 / 02:30 AM IST
గుండెలను పిండే విషాదం : అమ్మా నాన్న.. మా పెళ్లి కోసం అప్పు చేయొద్దు.. ఇద్దరమ్మాయిలు ఆత్మహత్య

హైదరాబాద్‌ హయత్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. గుండెలను పిండేసే ఘటన జరిగింది. ఇద్దరమ్మాయిలు తీసుకున్న నిర్ణయం అందరిని కంటతడి పెట్టిస్తోంది. అయ్యో పాపం..

హైదరాబాద్‌ హయత్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. గుండెలను పిండేసే ఘటన జరిగింది. ఇద్దరమ్మాయిలు తీసుకున్న నిర్ణయం అందరిని కంటతడి పెట్టిస్తోంది. అయ్యో పాపం.. అంటూ బోరున విలపిస్తున్నారు. రాఘవేంద్ర కాలనీలో ఇద్దరు యువతులు ఆత్మహత్య చేసుకున్నారు. మమత, గౌతమి ఇద్దరు స్నేహితురాళ్లు. మమత తల్లిదండ్రులు శుభకార్యం నిమిత్తం మహబూబ్‌ నగర్‌ కు వెళ్లగా మమత, ఆమె స్నేహితురాలు గౌతమి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మమత స్వస్థలం మహబూబ్‌నగర్‌ జిల్లా పోతునపల్లి గ్రామం. కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి స్థిర పడ్డారు. గౌతమి స్వస్థలం కర్నూలు జిల్లా మాధవరం మండలం వెలుగోడు. తల్లిదండ్రులకు భారంగా ఉన్నామని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్‌ నోట్‌ రాశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తల్లిదండ్రులు మా కోసం పడుతున్న కష్టాలు చూడలేకపోతున్నాం.. అప్పులు చేసి పెళ్లి చేయడం ఇష్టం లేదు.. కన్నవారికి భారం కాకూడదనే బాధతో వెళుతున్నాం.. మా చావుపై ఎలాంటి పుకార్లు సృష్టించకండి.. అంటూ ఇద్దరు స్నేహితురాళ్లు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన శుక్రవారం(ఫిబ్రవరి 06,2020) హయత్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది.

ఉపాధి కోసం హైదరాబాద్ కి:
మహబూబ్‌ నగర్‌ జిల్లా పోత్నపల్లి గ్రామానికి చెందిన రాయని రాములు కుటుంబంతో కలిసి నగరానికి వలస వచ్చి హయత్‌ నగర్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఏపీలోని కర్నూలు జిల్లా వెలుగోడు మండలం, మాధవరం గ్రామానికి చెందిన బాషం నారాయణ హయత్‌ నగర్‌ లోని శ్రీనివాస్‌ కాలనీలో నివాసం ఉంటున్నాడు. రాములు మేస్త్రీ పని, నారాయణ ఇంటి నిర్మాణ పనులు చేస్తుంటారు. గతంలో శ్రీనివాస్‌ నగర్‌ కాలనీలో పక్కపక్క ఇంట్లో ఉన్న సమయంలో రాములు కూతురు మమత (20), నారాయణ కూతురు గౌతమి (20) స్నేహితులయ్యారు. 

ఇంట్లో ఎవరూ లేని సమయంలో:
ఇద్దరూ ఇంటర్‌ వరకు చదువుకుని గతంలో ఓ ప్రైవేటు స్కూల్ లో పనిచేశారు. ప్రస్తుతం గౌతమి ప్రైవేటు స్కూల్ లో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తుండగా.. మమత ఇంటి దగ్గరే ఉంటోంది. తొమ్మిది నెలల క్రితం రాములు రాఘవేంద్రనగర్‌ కాలనీకి ఇల్లు మార్చడంతో గౌతమి తరచూ మమత ఇంటికి వస్తుపోతూ ఉండేది. ఇద్దరూ తరచూ కలుసుకుంటూ మంచి చెడులు మాట్లాడుకునేవారు. ఫిబ్రవరి 5న రాములు భార్య తిరుపతమ్మ, చిన్న కుమారుడితో కలిసి స్వగ్రామం పోత్నపల్లి సమీపంలోని కామారం గ్రామంలోని బంధువుల ఇంట్లో వివాహానికి వెళ్లారు. మమత మరో తమ్ముడు రఘుతో కలిసి ఇంటి దగ్గరే ఉంది.

శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు మమత ఇంటికి వచ్చింది. స్కూల్‌ కు వెళ్లిన రఘు సాయంత్రం నాలుగు గంటలకు ఇంటికిరాగా.. ఓవైపు తలుపులకు తాళం వేసి ఉండగా మరోవైపు లోపల నుంచి గడియపెట్టి ఉన్నది. ఇంటి బయట ఉన్న షర్ట్‌ లో ఉన్న తాళం చెవితో తలుపులు తీసి లోపలికి వెళ్లగా.. షాక్ తిన్నాడు. రేకులకు సపోర్ట్‌గా ఏర్పాటుచేసిన ఇనుప పైపునకు చీరతో మమత, గౌతమి ఉరేసుకొని కనిపించారు. వెంటనే రఘు భయంతో అరుచుకుంటూ బయటకు పరుగులు తీశాడు. స్థానికులు వచ్చి చూడగా.. అప్పటికే మమత, గౌతమి మృతి చెందారు. 

నా పెళ్లి మీకు భారం కావొద్దు..
నాన్న, నానమ్మా.. నా చావుతో మనశ్శాంతిగా ఉండండి. మమ్మల్ని ఎప్పుడు కూడా నాన్న, నానమ్మ పట్టించుకోలేదు. అమ్మ మమ్మల్ని పెంచేందుకు ఎంత ఇబ్బంది పడిందో చెప్పలేను. నాన్న నీవాళ్లతో నువ్వు సంతోషంగా ఉండు. అమ్మను బాధపెట్టకు. అత్తమ్మ, మామ, అక్క, బావను ఇబ్బంది పెట్టకండి. నా పెళ్లి మీకు భారం కావొద్దని శాశ్వతంగా వెళ్లిపోతున్నా. నా చావును చూడటానికి రాకండి ప్లీజ్‌.. అంటూ గౌతమి సూసైడ్‌ నోట్‌లో రాసింది.

నా పెళ్లి డబ్బు కోసం ఎవరి కాళ్లపై పడొద్దు:
నా చావుకు ఎవరూ కారణం కాదు. నేను చేసేది తప్పే. కానీ తప్పడం లేదు. అమ్మా నాన్న నన్ను క్షమించండి. నేను మీకు భారంగా ఉండటం ఇష్టం లేదు. మీరు అప్పుచేసి నా పెళ్లి చేయడం నచ్చలేదు. నా చావును నీచంగా చూడకండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దనే నా చదువును మధ్యలో ఆపేశా. తమ్ముడిని బాగా చదివించండి. అమ్మను, తమ్ముడిని బాగా చూసుకో. నా పెళ్లికి కావాల్సిన డబ్బు కోసం ఎవరి కాళ్లపై పడటం ఇష్టం లేదు. మా నిర్ణయంతో మీరు బాధపడకండి. పుకార్లను పట్టించుకోకండి. మీ పెంపకం తప్పు చేయదు నాన్న. మిస్‌ యూ ఆల్‌.. నేను ఇక వెళ్లిపోతున్నా” అని మమత సూసైడ్‌ నోట్‌లో రాసింది.

సూసైడ్ నోట్ లోని సారాంశం:
“మా ఇద్దరిని క్షమించండి… మేమిద్దరం చేసింది తప్పే. కానీ క్షమించండి.. మా కుటుంబానికి భారంగా ఉండడం ఇష్టం లేక ఇద్దరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం. ఎవ్వరు ఎవ్వరిని ప్రోత్సహించ లేదు. ఆత్మహత్య నేరం అని తెలుసు.. కానీ మాకు ఇదే కరెక్ట్ అనిపించింది. మా చావు వల్ల మా కుటుంబాల మధ్య ఎలాంటి గొడవలు రాకూడదని కోరుకుంటున్నాం. మా చావుని ఎలాంటి మిస్టరీగా చేయకండి. ఎలాంటి రూమర్స్ క్రియేట్ చేయకండి. మా వాళ్ళను ఇంకా బాధ పెట్టకండి. ఎవ్వరెన్ని చెప్పినా మా పెంపకం ఎప్పటికి తప్పు చేయదని నమ్మండి. కేవలం మీకు భారంగా ఉండడం ఇష్టం లేక ఈ నిర్ణయం తీసుకున్నాం. మా ఇద్దరి సమస్య ఒకటే కావడం వల్ల చనిపోవడనికి సిద్ధం అయ్యాం. ఇక సెలవు తీసుకుంటున్నాం…తెలిసీ తెలియక మీలో ఎవ్వరి మనసైన బాధ పెట్టి ఉంటే క్షమించండి.

మీ
గౌతమి.. మమత”.

మరి కొన్ని రోజుల్లో తనకు పెళ్లి చేయాలని ప్రయత్నాలు చేస్తున్న తల్లి.. అప్పు కోసం తిరగడం చూసి మమత తీవ్ర మనస్తాపానికి గురైంది. మరోపక్క తల్లి నుంచి తండ్రి విడిపోవడం ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో గౌతమి ఆందోళన చెందింది. ఈ ఇద్దరూ రెండు సూసైడ్ నోట్ లు రాసి ఒకే గదిలో ఆత్మహత్య చేసుకున్నారు. గౌతమి 5 పేజీలు, మమత 3 పేజీల సూసైట్ నోట్ లు రాశారు. ఈ ఘటన అందరిని కంట తడి పెట్టించింది. వారి సూసైడ్ నోట్ గుండెలను పిండేస్తోంది. ఆడ పిల్లలుగా పుట్టి, తల్లిదండ్రులకు భారం అయ్యామని ఆ ఇద్దరు ప్రాణ స్నేహితులు తీసుకున్న నిర్ణయం అందరిని బాధించింది. కుటుంబ సభ్యులే కాదు స్థానికులు కూడా కంట తడి పెట్టారు. స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. ఎంత పని చేశారమ్మా అని అంతా బోరున విలపించారు.

* హైదరాబాద్‌ హయత్‌నగర్‌లో విషాదం
* ఉరివేసుకొని ఇద్దరు యువతుల ఆత్మహత్య
* తల్లిదండ్రులకు భారంగా ఉన్నామని సూసైడ్‌ నోట్‌

* ఆత్మహత్య చేసుకున్న మమత, గౌతమి
* పెళ్లి కోసం అప్పుల పాలు కావొద్దని విన్నపం
* తమ చావు తర్వాత సంతోషంగా ఉండాలని సూసైడ్ నోట్
* అమ్మా నాన్న మమ్మల్ని క్షమించండి