కారు దొరికింది..ప్రాణాలు దక్కలేదు

  • Published By: chvmurthy ,Published On : October 19, 2019 / 09:40 AM IST
కారు దొరికింది..ప్రాణాలు దక్కలేదు

సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలం చాకిరాల వద్ద శుక్రవారం రాత్రి నాగార్జున సాగర్ ఎడమ కాలువలో పడిపోయిన  స్కార్పియో వాహనాన్ని ఎన్టీఆర్ఎఫ్ బృందాలు  శనివారం బయటకు తీశాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు మరణించారు. గతరాత్రి నుంచి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ శనివారం మధ్యాహ్నానికి గానీ స్కార్పియోను బయటకు తీయలేక పోయారు.  

హైదరాబాద్‌లోని ఏఎస్ రావు నగర్‌లో ఉన్న అంకుర్ హాస్పిటల్‌లో పనిచేస్తున సిబ్బంది తమ తోటి ఉద్యోగి పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. హైదరాబాద్ నుంచి స్కార్పియో, ఇన్నోవా వాహనంలో వీరంతా బయలు దేరి వచ్చారు. ముందు వెళ్తున్న స్కార్పియో వాహనం అదుపు తప్పి సాగర్ ఎడమ  కాలువలోకి దూసుకు వెళ్లింది. వీరి వెనుక వస్తున్న  ఇన్నోవా వాహనంలోని వీరి స్నేహితులు వెంటనే ప్రమాదాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించినప్పటికీ వారిని ప్రాణాలతో కాపాడలేక పోయారు.  

కాలువ ఉధృతంగా ప్రవహిస్తుండటం, గతరాత్రి వాన కురియటంతో గాలింపు  చర్యలకు ఇబ్బంది ఏర్పడింది. ఈ ఘటనతో హైదరాబాద్ లో తీవ్ర విషాదం అలుముకుంది. గ్రామస్తుల సహకారంతో, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంయుక్తంగా ఎట్టకేలకు స్కార్పియోను బయటకు తీశారు.  అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. స్కార్పియో వాహనంలో కూర్చున్నవారు కూర్చున్నట్లు విగత జీవులుగా మారారు.