భర్త స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని నిప్పంటించుకుని భార్య ఆత్మహత్య

  • Published By: naveen ,Published On : May 31, 2020 / 07:01 AM IST
భర్త స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని నిప్పంటించుకుని భార్య ఆత్మహత్య

దేశ రాజధాని ఢిల్లీలో విషాదం చోటు చేసుకుంది. భర్త స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదనే వేదనతో భార్య నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. ఢిల్లీలోని మైదాన్ గర్హి ప్రాంతానికి చెందిన జ్యోతి మిష్రా(29) తనకు స్మార్ట్ ఫోన్ కొనివ్వాలని భర్త ప్రమోద్ మిష్రాను కోరింది. లాక్ డౌన్ కారణంగా పిల్లలకు ఇంట్లోనే ఆన్ లైన్ క్లాసులు జరుగుతున్నాయి, వారి కోసం స్మార్ట్ ఫోన్ కొనాలని భర్తను అడిగింది. అయితే ఇప్పుడు ఫోన్ కొనేదిలేదని చెప్పిన భర్త లాక్ డౌన్ తర్వాత కొంటానని తేల్చి చెప్పాడు. దీంతో ఆగ్రహం చెందిన భార్య భర్తతో గొడవ పడింది. ఆ తర్వాత మే 27న ఉదయం 8 గంటల సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది.

భార్య చేసిన పనితో షాక్ తిన్న భర్త వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కాగా, 90శాతం కాలిన గాయాలు కావడంతో అప్పటికే ఆమె చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. మృతురాలికి ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు(6,4). రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

4ఏళ్ల రెండో కొడుక్కి కూడా ఫోన్ కొనివ్వాలని డిమాండ్:
కాగా ఆన్ లైన్ క్లాసుల కోసం ప్రమోద్ మిష్రా ఇటీవలే తన పెద్ద కొడుక్కి కొత్త ఫోన్ కొనిచ్చాడు. ఇప్పుడు రెండో వాడికి కూడా ఆన్ లైన్ క్లాసులు స్టార్ట్ అయ్యాయి. వాడిక్కూడా స్మార్ట్ ఫోన్ కొనాలని జ్యోతి మిష్రా భర్తతో గొడవపడింది. ఈ క్రమంలో ఆవేశంలో కిరోసిన్ పోసుకుని నిప్పంటిచుకుంది. ప్రమోద్, జ్యోతి దంపతుల స్వస్థలం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సుల్తాన్ పూర్. ఉపాధి కోసం ఢిల్లీ వచ్చి నివాసం ఉంటున్నారు. స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదనే చిన్న కారణానికే జ్యోతి ఆత్మహత్య చేసుకోవడం స్థానికులను షాక్ కి గురి చేసింది.