ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో చోరీ

ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో చోరీ

Gold and Cash Robbery in Old MLA Quarters Hyderabad : హైదరాబాద్, హైదర్ గూడ లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో భారీ చోరీ జరిగింది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేకి కేటాయించిన నివాసం నుంచి దుండగులు లక్షల విలువైన బంగారు ఆభరణాలుతో పాటు నగదు ఎత్తుకెళ్లారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని ఎస్ఎస్-3 లోని ప్లాట్ నెంబరు305ను మల్కాజ్ గిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు కేటాయించారు.

ప్రస్తుతం ఈ ప్లాట్ లో హనుమంతరావు స్నేహితుడు బోధన్ కు చెందిన అమర్ నాధ్ బాబు ఉంటున్నాడు. సంక్రాంతి పండుగకు కుటుంబంలోని వారంతా బోధన్ వెళ్లారు. తిరిగి 23వ తేదీన హైదరాబాద్ లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్సలోని నివాసానికి వచ్చారు. ఇంట్లో బీరువా తెరిచి చూడగా అందులోని 14.6 తులాల బంగారు నగలు, రూ.10 వేల నగదు కనిపించలేదు.

ఈవిషయం అసెంబ్లీ కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన నుంచి సరైన సహయం అందక పోవటంతో బుధవారం రాత్రి నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆబిడ్స్ ఏసీపీ వెంకట రెడ్డి, నారాయణగూడ సీఐ రమేష్ కుమార్ లు ఘటనా స్ధలానికి వచ్చి పరిశీలించారు. పదుల సంఖ్యలో పోలీసులు సెక్యూరిటీ ఉండే క్వార్టర్స్ లో చోరీ జరగటం పలు అనుమానాలకు తావిస్తోంది.

వేసిన తాళాలు వేసినట్లే ఉండటం, బీరువాలోని వస్తువులు మాయంకావటం చూస్తుంటే ఇది ఇంటి దొంగల పనే అయి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అమర్ నాధ్ బాబు వద్ద పనిచేసే డ్రైవర్ ఫోన్ స్విచ్చాఫ్ రావటంతో పోలీసులు డ్రైవర్ పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇంట్లో పనిమనషిని పోలీసులు విచారిస్తున్నారు.