Gujarat Drugs Case : గుజరాత్ డ్రగ్స్ కేసులో కొత్త కోణం

గుజరాత్‌ డ్రగ్స్‌ కేసులో కొత్తకోణం వెలుగు చూసింది. భారత్‌లో ఉగ్రవాదాన్ని ఉసిగొల్పేందుకు పాకిస్తాన్‌ ఐఎస్‌ఐ, తాలిబన్లు కుట్ర పన్నాయి.

Gujarat Drugs Case : గుజరాత్ డ్రగ్స్ కేసులో కొత్త కోణం

Gujarat Mundra Port Drug Case

Gujarat Drugs Case : గుజరాత్‌ డ్రగ్స్‌ కేసులో కొత్తకోణం వెలుగు చూసింది. భారత్‌లో ఉగ్రవాదాన్ని ఉసిగొల్పేందుకు పాకిస్తాన్‌ ఐఎస్‌ఐ, తాలిబన్లు కుట్ర పన్నాయి. టెర్రరిస్టులకు ఫండింగ్‌ కోసం భారత్‌లో భారీగా డ్రగ్స్‌ దందాకి తెరలేపాయి.

గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో డీఆర్‌ఐ అధికారులు గతవారం భారీ ఎత్తున రెండు కంటైనర్ల డ్రగ్స్‌ సీజ్‌ చేశారు. మొత్తం 3 వేల కేజీల హెరాయిన్‌ను పట్టుకున్నారు. పట్టుబడ్డ హెరాయిన్‌ విలువ రూ.21 వేల కోట్లకు పైగా ఉన్నట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. తీగ లాగితే డొంక కదిలినట్లు…. ఈ డ్రగ్స్‌ సరఫరా వెనక ఉగ్రవాద కోణం బయటపడింది. ఈ డబ్బుతో పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్‌ఐ, తాలిబన్లు ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించనున్నట్లు నిఘా వర్గాల సమాచారం. ఐఎస్‌ఐకి పరోక్షంగా డ్రగ్స్‌ స్మగర్లతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. విచారణ తర్వాతే మరిన్ని విషయాలు వెలుగులోకి రానున్నాయని అధికారవర్గాలు వెల్లడించాయి.

అఫ్ఘానిస్తాన్‌ నుంచి డ్రగ్స్ దిగుమతి చేసుకొని, టాల్కం పౌడర్‌ పేరుతో గుజరాత్ ముంద్రా పోర్టు ద్వారా రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. చెన్నైకి చెందిన కపుల్ గోవిందరాజు దుర్గాపురన్ వైశాలి ఆమె భర్త మాచవరం సుధాకర్- విజయవాడకు చెందిన ఆశీ ట్రేడింగ్‌ కంపెనీ పేరిట కంటైనర్లు దిగుమతి అయ్యాయి. అఫ్ఘానిస్తాన్‌లోని కాందహార్‌కు చెందిన ‘హసన్ హుసేన్‌ లిమిటెడ్‌ కంపెనీ’ వీటిని ఎగుమతి చేసింది. డ్రగ్స్‌ ఇరాన్‌లోని అబ్బాస్‌ పోర్టు నుంచి గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు తరలించారు.

ఈ డ్రగ్స్‌ కేసులో చెన్నైకి చెందిన దంపతులను అరెస్ట్‌ చేశారు. వీరికి భుజ్‌ కోర్టు 10 రోజుల రిమాండ్‌ విధించింది. అఫ్ఘాన్‌ పౌరులతో పాటు మరికొంతమందిని విచారణ జరుపుతున్నారు. మరో ముగ్గురిని ముంబైలో అరెస్ట్‌ చేశారు. వీరిలో ఇద్దరు అఫ్ఘాన్‌ పౌరులున్నట్లు తెలుస్తోంది. డీఆర్‌ఐ అధికారులు అహ్మదాబాద్‌, ముంద్రా, చెన్నై, విజయవాడ, ఢిల్లీలో దాడులు నిర్వహిస్తున్నారు. ఇలాంటి కంటైనర్లు మరిన్ని తరలించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.