కాచిగూడ రైలు ప్రమాదంపై విచారణకు హై లెవల్ కమిటీ

  • Published By: chvmurthy ,Published On : November 12, 2019 / 09:43 AM IST
కాచిగూడ రైలు ప్రమాదంపై విచారణకు హై లెవల్ కమిటీ

కాచిగూడ రైల్వేస్టేషన్లో ఎంఎంటీఎస్ రైలు హంద్రీ-నీవా ఎక్స్ ప్రెస్ ను ఢీకొట్టిన ఘటనపై  దక్షణ మధ్యరైల్వే ముగ్గురు సభ్యులతో ఒక హై లెవల్ కమిటీని వేసింది. కమిటీ బుధవారం కాచిగూడ ప్రమాద స్ధలిని సందర్శించి ప్రమాదం జరగటానికి గల కారణాలను పరిశీలిస్తుంది. 

కాచిగూడ స్టేషన్‌లో  సోమవారం ఉదయం 2  రెండు రైళ్లు ఢీకొనడంతో దెబ్బతిన్న ట్రాక్‌ మరమ్మతు పనులు వేగంగా సాగుతున్నాయి. 3వందల మంది సిబ్బందితో ట్రాక్‌, కేబులింగ్ వ్యవస్థను పునరుధ్దరిస్తున్నారు. ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్ శాఖలు సంయుక్తంగా పనులు నిర్వహిస్తున్నాయి. 3 వందల మంది ఈ పనుల్లో నిమగ్నమయ్యారు.

కాచిగూడ రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఎంఎంటీఎస్ లోకో పైలట్ చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. రెండు రైళ్ల మధ్యలో చిక్కుకున్న చంద్రశేఖర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడ్ని దాదాపు 8గంటలకు పైగా శ్రమించి రెస్క్యూటీం కాపాడింది.  చికిత్స నిమిత్తం నిన్న రాత్రి అతడ్ని కేర్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. చంద్రశేఖర్‌ కు తీవ్రగాయాలయ్యాయని తెలిపారు. అతడి రెండు కాళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. శరీరంలో ఇంటర్నల్ బ్లీడింగ్ జరుగుతుందని ప్రకటించిన కేర్‌ ఆసుపత్రి వైద్యులు.. మంగళవారం ఉదయం సర్జరీ ప్రారంభించారు.