హైదరాబాద్ శివారులో దొంగలు హల్ చల్

  • Published By: chvmurthy ,Published On : September 23, 2019 / 03:26 PM IST
హైదరాబాద్ శివారులో దొంగలు హల్ చల్

హైదరాబాద్‌ పేట్‌ బషీరాబాద్‌లో  ఆదివారం అర్దరాత్రి దొంగలు హల్‌చల్‌ చేశారు.  ఒక జ్యూయలరీ షాపులో  దోపిడీకి ప్రయత్నిస్తుండగా…అడ్డుకోబోయిన ఎస్సై పైకి కారు ఎక్కించి పరారయ్యారు. ఈ ఘటనలో దుండిగల్‌ ఎస్సై తృటిలో తప్పించుకున్నారు. అనంతరం పారిపోతున్న దొంగలను వెంబడించారు. దొంగలు దూలపల్లి ఫారెస్ట్‌లోకి పారిపోయారు. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. మహారాష్ట్ర దొంగల ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. 

వివరాల్లోకి వెళితే…. నగర శివారు కుత్బుల్లా పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు రెండున్నర గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. దూలపల్లి మెయిన్ రోడ్డులో  పోలీసు వాహనంలో నైట్ పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు ఒక జ్యూయలరీ షాప్ వద్ద అనుమానస్పదంగా ఆపి ఉన్న కారు కనిపించింది.  అందులో ఉన్నవారు మంకీ క్యాప్ లు ధరించి ఉన్నారు. ఇది గమనించిన పెట్రోలింగ్ వాహానంలోని ఎస్సై శేఖర్ రెడ్డి తన వాహనం దిగి అనుమానిత కారు వద్దకు వెళ్ల బోయారు. ఎస్సై రావటం చూసిన కారులోని డ్రయివర్ వెంటనే కారును వేగంగా ఎస్సై మీదుగా ముందుకు దూకించాడు. ప్రమాదాన్ని పసిగట్టిన ఎస్సై రెప్పపాటులో పక్కకు తప్పుకుని ప్రాణాలు రక్షించుకున్నారు. కారు దూలపల్లి ఫారెస్టు ఏరియా వైపు దూసుకు వెళ్లింది. ఆకారు వెనుకనే మరోక కారు వేగంగా దూసుకు వెళ్లింది.  వెంటనే ఎస్సై కూడా తన పెట్రోలింగ్ వాహనంలో ఆ కారును వెంబడించారు. కారులోని దుండగులు కారును కొంతదూరం వెళ్లిన తర్వాత రోడ్డు పక్కన వదిలేసి దూలపల్లి  ఫారెస్టులోకి పారిపోయారు. 

కారులో ఇనుమును కత్తిరించేందుకు ఉపయోగించే కట్టర్లు పోలీసులకు లభించాయి. దుండగులు 5గురు కంటే ఎక్కువ ఉన్నట్లు ఎస్సై చెపుతున్నారు. వీరంతా మహారాష్ట్ర్రకు చెందిన ముఠాగా భావిస్తున్నారు. దొంగలను పట్టుకోటానికి  రెండు టీం లను పోలీసులు ఏర్పాటు చేశారు. దుండగులు ఆల్వాల్, పేట్ బషీరాబాద్ ప్రాంతంలో పలు షాపులు, ఏటీఎంలు లూటీ చేసేందుకు యత్నించినట్లు పోలీసులు కనుగొన్నారు. ఎస్సై  శేఖర్ రెడ్డి పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దుండగులు వదలి వెళ్ళిన కారుకూడా చోరీ  చేసినట్లుగా పోలీసులు  గుర్తించారు.