డబ్బు కోసమే, 3 నెలల నుంచే ప్లాన్.. హైదరాబాద్ డాక్టర్ హుస్సేన్ కిడ్నాప్ కేసులో కీలక విషయాలు

  • Published By: naveen ,Published On : October 28, 2020 / 12:19 PM IST
డబ్బు కోసమే, 3 నెలల నుంచే ప్లాన్.. హైదరాబాద్ డాక్టర్ హుస్సేన్ కిడ్నాప్ కేసులో కీలక విషయాలు

doctor hussain kidnap : హైదరాబాద్ లో సంచలనం రేపిన డెంటల్ డాక్టర్ హుస్సేన్ కిడ్నాప్ కేసు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డబ్బు కోసం బంధువే డాక్టర్ హుస్సేన్ ని కిడ్నాప్ చేయించినట్టు పోలీసుల విచారణలో తేలింది. డాక్టర్ హుస్సేన్ బంధువు ముస్తఫా ఈ పని చేయించాడు. డాక్టర్ హుస్సేన్ ఇంటిపైన రెంట్ కి ఉండే ఖలీద్ ద్వారా కిడ్నాప్ చేయించాడు ముస్తఫా. కాగా ముస్తఫా, ఖలీద్ బిట్ కాయిన్ ట్రేడింగ్ బిజినెస్ చేస్తారు. డాక్టర్ హుస్సేన్ బ్యాంకు ఖాతాలో పెద్ద మొత్తంలో నగదు ఉన్నట్టు తెలుసుకున్న ముస్తఫా కిడ్నాప్ చేయాలని నిర్ణయించాడు.

డాక్టర్ ని కిడ్నాప్ చేసి బిట్ కాయిన్ రూపంలో డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని నిందితులు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు. కర్నాటకలో హోటల్ బిజినెస్ చేసే వారితో పరిచయం ఏర్పరచుకున్న ముస్తఫా వారితో కిడ్నాప్ చేయించాడు. కర్నాటక వ్యక్తులతోనే కిడ్నాప్ నకు ప్లాన్ చేశారు ముస్తఫా, ఖలీద్. మూడు నెలల ముందు నుంచే డాక్టర్ హుస్సేన్ కిడ్నాప్ నకు నిందితులు ప్లాన్ చేశారు.

హైదరాబాద్‌లో సంచలనం రేపిన డాక్టర్ కిడ్నాప్‌కు అనంతపురం జిల్లా పోలీసులు పుల్‌స్టాప్ పెట్టారు. డెంటిస్ట్ హుస్సేన్‌ను కిడ్నాపర్ల నుంచి అనంత పోలీసులు రక్షించారు. హైదరాబాద్ ఎక్సైజ్ కాలనీలో దంత వైద్యుడు హుస్సేన్‌ను మంగళవారం(అక్టోబర్ 27,2020) మధ్యాహ్నం కిడ్నాప్ చేసి వెహికల్ లో తీసుకెళ్లారు. ఫోన్ నెంబర్ ఆధారంగా సైబరాబాద్ పోలీసులు వెహికల్ ని ట్రేస్ చేశారు. అనంతపురం మీదుగా వెళ్తున్నట్టు గుర్తించారు. వెంటనే అనంతపురం జిల్లా పోలీసులను అలర్ట్ చేశారు. అనంతపురం ఎస్పీ సత్య యేసుబాబు అన్ని చెక్ పోస్టులను అలర్ట్ చేశారు. అనంతపురం మీదుగా బెంగళూరుకు వెళ్తున్న కిడ్నాప్ గ్యాంగ్‌ను పట్టుకున్నారు. ఒకడిని పోలీసులు పట్టుకోగా.. మరో నలుగురు పరారీలో ఉన్నారు. రాప్తాడు పోలీసుల అదుపులో కిడ్నాపర్ ఉన్నాడు.

హైదరాబాద్‌ శివారులో ఎక్సైజ్‌ అకాడమీ సమీపంలోని ప్రెస్టీజ్‌ విల్లాస్‌లో నివాసం ఉంటున్న దంత వైద్యుడు బెహజత్‌ హుస్సేన్‌ సమీపంలోని మరో బిల్డింగ్‌లో క్లినిక్‌ నిర్వహిస్తున్నారు. రోజులాగే మంగళవారం మధ్యాహ్నం క్లినిక్ నుంచి మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో భోజనం కోసం ఇంటికెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇంతలోనే బురఖాలు ధరించిన గుర్తు తెలియని వ్యక్తులు క్లినిక్‌ లోపలికి వచ్చారు. డాక్టర్ వ్యక్తిగత సహాయకుడు సయ్యద్‌ సల్మాన్‌ను తీవ్రంగా కొట్టి నోటికి ప్లాస్టర్‌ వేశారు. అతడి కాళ్లు, చేతులు కట్టేశారు.

ఆ తర్వాత దుండగులు డాక్టర్‌ను కొట్టి.. క్లినిక్‌ బయటకు లాక్కొచ్చారు. తర్వాత కారులో ఎక్కించుకుని శంకర్‌పల్లి రోడ్డు వైపు వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత డాక్టర్ వ్యక్తిగత సహాయకుడు సయ్యద్ తాళ్లు, ప్లాస్టర్ తీసుకుని తన తండ్రికి ఫోన్‌ చేసి కిడ్నాప్ గురించి చెప్పాడు. వెంటనే డాక్టర్ హుస్సేన్‌ భార్యకు విషయం తెలియడంతో.. 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. టీమ్‌లను రంగంలోకి దించి దర్యాప్తు ప్రారంభించారు. ఇంతలోనే కిడ్నాపర్లు అనంతపురం పోలీసులకు దొరికిపోయారు. హైదరాబాద్ పోలీసులు కిడ్నాపర్ ని అదుపులోకి తీసుకోనున్నారు. డాక్టర్ హుస్సేన్ ని కిడ్నాపర్ల చెర నుంచి పోలీసులు సురక్షితంగా విడిపించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. పోలీసులను అభినందించారు.

డాక్టర్ హుస్సేన్ కిడ్నాప్ కేసులో పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కిడ్నాప్ వెనుక ఉన్నది డాక్టర్ బంధువే అని తేలింది. డాక్టర్ హుస్సేన్ బ్యాంకు అకౌంట్ లో పెద్ద మొత్తంలో నగదు ఉందని అతడి బంధువు ముస్తఫా తెలుసుకున్నాడు. ఎలాగైనా డబ్బు కొట్టేయాలని ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగా హుస్సేన్ కిడ్నాప్ కి స్కెచ్ వేశాడు.

డాక్టర్ హుస్సేన్ ఇంటిపైన రెంట్ కి ఉండే ఖలీద్ అనే వ్యక్తిని సంప్రదించిన ముస్తఫా, అతడి ద్వారా డాక్టర్ ని కిడ్నాప్ చేయించాడు. డాక్టర్ హుస్సేన్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా. డాక్టర్ ని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేయాలని ముస్తఫా ప్లాన్ చేశాడు. డాక్టర్ ని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్లు హుస్సేన్ కుటుంబసభ్యులకు వాట్సాప్ కాల్ చేసి డబ్బు డిమాండ్ చేశారు. డబ్బులు బిట్ కాయిన్ రూపంలోనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.