సీఎం సోదరుడి కిడ్నాప్

  • Published By: chvmurthy ,Published On : December 14, 2019 / 02:46 PM IST
సీఎం సోదరుడి కిడ్నాప్

సీబీఐ ఆఫీసర్లమని చెప్పి ఒక వ్యక్తిని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఇందులో కిడ్నాప్ కు గురైన వ్యక్తి మణిపూర్ సీఎం సోదరుడు ఎన్ బిరెన్ సింగ్ కావటం గమనార్హం. పోలీసులు అందించిన వివరాల ప్రకారం. బిరెన్ సింగ్ సోదరుడు టోంగ్‌బ్రామ్ లుఖోయ్ సింగ్ కోల్‌కతాలో నివాసముంటున్నారు. కాగా డిసెంబర్13, శుక్రవారం ఐదుగురు వ్యక్తులు న్యూటౌన్‌లో లుఖోయ్‌ సింగ్‌ కొత్తగా తీసుకున్న ఇంటికి వచ్చారు. తాము సీబీఐ ఆఫీసర్లమని చెప్పి ఇంట్లోకి చొరబడి లుఖోయ్‌ సింగ్‌తో పాటు మరొకరిని కిడ్నాప్‌ చేసి తీసుకువెళ్లారు.

తర్వాత సింగ్‌ భార్యకు ఫోన్‌ చేసి రూ. 15 లక్షలని డిమాండ్‌ చేశారు. దీంతో సింగ్‌ భార్య వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాప్ చేసిన ఐదుగురిలో ఇద్దరిని శుక్రవారం సాయంత్రమే అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించి మిగతా ముగ్గురిని కూడా శనివారం ఉదయం సెంట్రల్‌ కోల్‌కతాలోని బేనియాపుకుర్‌లో అరెస్టు చేసారు. వారి వద్ద నుంచి రెండు వాహనాలు, మూడు నకిలీ తుపాకులు, రూ. 2లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టైన వారిలో ఇద్దరు మణిపూర్‌, మరో ఇద్దరు కోల్‌కతా, ఒకరు పంజాబ్‌కు చెందిన వారిగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, వీరిపై గతంలో కూడా పలు క్రిమినల్‌ రికార్డులు ఉన్నాయని, కేవలం డబ్బు కోసమే ఈ పనికి పాల్పడినట్లు విచారణలో తేలిందని పోలీసులు పేర్కొన్నారు.