ఆర్ధిక ఇబ్బందులతో తల్లీ,కూతురు ఆత్మహత్య

  • Published By: murthy ,Published On : May 26, 2020 / 07:15 AM IST
ఆర్ధిక ఇబ్బందులతో తల్లీ,కూతురు ఆత్మహత్య

ఇంటి నిర్మాణం కోసం చేసిన  అప్పులు పెరిగి పోవటం, పెళ్ళీడు కొచ్చిన కూతురు, కొడుకు చదువు కోసం డబ్బులు అవసరం కావటంతో  మానసికంగా బాధపడిన ఆ ఇల్లాలు కూతురుతో సహా వ్యవసాయ బావిలో దూకి ఆత్మ హత్య చేసుకుంది. 

తెలంగాణలోని కామారెడ్డి జిల్లా తడ్వాయి మండలం ఎర్ర పహాడ్ గ్రామానికి చెందిన బద్దం లక్ష్మారెడ్డి, లింగమణి దంపతులకు ఒక కొడుకు కుమార్తె ఉన్నారు. ఉన్న రెండెకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కొడుకు, కూతురును చదివిస్తూ ఆ దంపతులు జీవనం సాగిస్తున్నారు. ఇటీవల ఇంటి నిర్మాణం కోసం రెండు లక్షల రూపాయలు అప్పు చేశారు.  

కొడుకు రణదీప్ రెడ్డి  హైదరాబాద్ లో హోటల్ మేనేజ్ మెంట్ కోర్సు చేస్తుండగా, కూతురు శిరీష(18) కామారెడ్డిలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుకుంటోంది. ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న అప్పులకు కట్టాల్సిన వడ్డీలు,  కొడుకు చదువుకు పంపించాల్సిన డబ్బులు, కూతురు పెళ్ళి విషయమై  ఆదివారం రాత్రి మాట్లాడుకున్న భార్యాభర్తలకు…  పెద్ద ఘర్షణే జరిగింది. దీంతో ఇద్దరూ భోజనం చేయకుండానే పడుకున్నారు. 
 

సోమవారం పొద్దున్న లక్ష్మారెడ్డి యాధావిధిగా పొలానికి వెళ్లిపోయాడు. ఆదివారం రాత్రి ఆర్ధిక విషయాలపై జరిగిన ఘర్షణలో లింగమణి మానసికంగా కుంగిపోయింది. దీంతో తల్లీ కూతుళ్లు ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ కలిసి తమ పోలంలోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. లక్ష్మారెడ్డి తాగునీటికోసం సమీపంలోని మరో బావి వద్దకు వెళ్లగానే తల్లి తన చీర కొంగును కూతురు నడుముకు కట్టింది. ఇద్దరూ కలిసి ఒకేసారి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. 
 

నీళ్లు తాగి తిరిగి వచ్చిన లక్ష్మారెడ్డికి భార్యాకూతుళ్లు కనిపించకపోవడంతో చుట్టూ చూశాడు. బావిలోకి తొంగిచూడగా ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు సీఐ వెంకట్, ఎస్‌ఐ కృష్ణమూర్తి సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను వెలికితీసి, పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి గ్రామానికి వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. 

Read: ఇద్దరు చిన్నారుల్ని ఇటుకతో కొట్టి చంపిన తండ్రి..