జై..శ్రీరామ్ అనలేదని ముస్లిం ఆటో డ్రైవర్ పై దాడి..పాకిస్థాన్ పొమ్మంటూ దుర్భాషలు

  • Published By: nagamani ,Published On : August 9, 2020 / 11:20 AM IST
జై..శ్రీరామ్ అనలేదని ముస్లిం ఆటో డ్రైవర్ పై దాడి..పాకిస్థాన్ పొమ్మంటూ దుర్భాషలు

రాజస్థాన్ లోని శిఖర్ జిల్లాలో ‘జై శ్రీ రామ్’, ‘మోడీ జిందాబాద్’ అని అనలేదని ఓ ముస్లిం ఆటో డ్రైవర్ పై కొందరు దుండగులు దాడి చేశారు. 52 ఏళ్ల వయస్సున్న ఆ ఆటో డ్రైవర్ గడ్డం లాగి..చెంపలు వాయించి..ఇష్టానుసారంగా కొట్టారు. జైశ్రీరామ్ అనలేనివాడికి ఇక్కడెందుకుంటావ్..పాకిస్థాన్ కు పో..అంటూ దారుణంగా దాడి చేశారు.

ప్రతీరోజులాగే శుక్ర‌వారం (ఆగస్టు 7,2020) ఉద‌యం 4 గంట‌ల‌కు ఆటో తీసుకుని రోడ్డుపైకి వచ్చాడు 52 ఏళ్ల గఫర్ అహ్మద్. కళ్యాణ్ సర్కిల్ ప్రాంతం నుండి జిగ్రి చోటి గ్రామానికి ప్రయాణికులను తీసుకెళ్లి తిరిగి వచ్చిన గఫర్ అహ్మద్ ను మహీంద్రా బొలెరో పిక్-అప్ నుండి దిగిన దుండగులు అతన్ని అటకాయించారు. అతని వద్దకు వచ్చిన దుండగులు “జై శ్రీ రామ్””మోడీ జిందాబాద్” అని అన్నమన్నారు. కానీ అతను వారి నుంచి తప్పించుకోవటానికి తన ఆటోను స్ట్రార్ట్ చేశాడు. కానీ వాళ్లు ఆటోను బలవంతంగా ఆపేశారు. తరువాత మేం చెప్పినట్లుగా చెప్పాల్సిందే..లేదంటే పాకిస్థాన్ పో అంటూ దాడికి పాల్పడ్డారు. తరువాత పరారయ్యారు.

తనపై జరిగిన దాడిపై గఫర్ అహ్మద్ సికార్‌లోని సదర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కొంతమంది దుండగులు నా ఆటోను ఆపి శ్రీరామ్ జిందాబాద్, మోడీ జిందాబాద్ అనమన్నారని..నాపై దాడి చేసి నా గడ్డం పట్టుకుని లాగుతూ..చెంపలు వాయించి నానా దుర్భాషలాడారని తరువాత నాపై చేయడం ప్రారంభించారు..దీంతో నేను స్మృహ తప్పిపడిపోయానని తరువాత కొంతమంది దుండగుల నుంచి నన్ను రక్షించారని తరువాత పోలీస్ స్టేషన్ కు వచ్చానని గఫర్ అహ్మద్ తన ఫిర్యాదులో పోలీసులకు చెప్పాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిందితులు రాజేంద్ర, శంభు దయాల్ లను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.వీరిద్దరూ..జగదల్పూర్ పౌరులుగా గుర్తించారు.

దీనిపై సదర్ పోలీస్ స్టేషన్ అధికారి పుష్పేంద్ర సింగ్ మాట్లాడుతూ..నిందితులపై భౌతిక దాడులు, దోపిడీ,ఎస్సీ / ఎస్టీ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేశామని..ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసిన ఆరుగంటల్లోనే నిందుతులను అదుపులోకి తీసుకున్నామనీ..వారి వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.