UP Covid Test : కోవిడ్ టెస్ట్….కొంగు తీయమన్నందుకు కొట్టారు

UP Covid Test : కోవిడ్ టెస్ట్….కొంగు తీయమన్నందుకు కొట్టారు

Up Covid Test

UP Covid Test : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం కరోనా టెస్ట్ లు చేయటం.. వ్యాక్సిన్లు వేసే ప్రక్రియ పెద్ద ఎత్తున చేపట్టిన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్ లో కరోనా పరీక్షలు నిర్వహించటానికి వచ్చిన వైద్యాధికారులపై గ్రామస్తులు దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది.

ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌ జిల్లా షాహ్‌నగర్‌ సరౌలా గ్రామంలో మంగళవారం ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వచ్చారు.
గ్రామంలోని ఒక కార్యాలయంలో ఉండి గ్రామస్తులు అందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అప్పటికీ 37 మంది దాకా పరీక్షలు నిర్వహించారు.

ఈక్రమంలో ఒక నవవధువు కరోనా పరీక్ష చేయించుకోటానికి వచ్చింది. వైద్యాధికారులు ఆమెకు కుడా పరీక్ష చేయబోయారు. కరోనా పరీక్ష చేయించుకునేందుకు ఆమె సిగ్గు పడింది. తలపై కొంగుతోనే అధికారుల ముందుకు వద్దకు వచ్చింది.

కరోనా పరీక్ష చేసేందుకు ఆమెను తలపై కప్పుకున్న చీర కొంగు తీసేయమని అధికారులు కోరారు. అయితే ఆమె సిగ్గుతో కొంగు తీయకుండా అలానే ఉండిపోయింది. ఎందుకంటే ఆ గదిలో గ్రామానికి చెందిన పలువురు పురుషులు, పిల్లలు ఆమెనే చూస్తూ ఉన్నారు.

దాంతో ఆమె ఇబ్బందిని గమనించిన వైద్యాధికారులు …అక్కడ ఉన్న పురుషులను, పిల్లలను గది వదిలి పెట్టి వెళ్లమని కోరారు. ఆగ్రహించిన గ్రామస్తులు వైద్య అధికారులపై దాడి చేశారు. వారి కాగితాలు చించి పడేశారు. కరోనా పరీక్ష సామాగ్రిని ధ్వంసం చేశారు.

వారి దాడి నుంచి తప్పించుకోటానికి పారిపోబోయిన వైద్య సిబ్బందిని గ్రామస్తులు వెంబడించి కొట్టారు. వీరి దాడిలో ఇద్దరు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.