Bhogapuram : స్కూల్ నుంచి సస్పెండ్ చేశారని మనస్తాపంతో విద్యార్ధి ఆత్మహత్య

విజయనగరం జిల్లా భోగాపురంలోని మోడల్ స్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతున్న చుక్క యోగేందర్ రెడ్డి అనే విద్యార్థి స్కూల్ సమీపంలో శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు.

Bhogapuram : స్కూల్ నుంచి సస్పెండ్ చేశారని మనస్తాపంతో విద్యార్ధి ఆత్మహత్య

Student Suicide

Bhogapuram : విజయనగరం జిల్లా భోగాపురంలోని మోడల్ స్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతున్న చుక్క యోగేందర్ రెడ్డి అనే విద్యార్థి స్కూల్ సమీపంలో శుక్రవారం రాత్రి మామిడి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

పోలీసులు అందించిన వివరాల ప్రకారం దల్లిపేట పంచాయతీ గాలిపేటకు చెందిన యోగేందర్ రెడ్డి మోడల్ స్కూల్ లో 9వ తరగతి చదువుతున్నాడు. యోగి తో పాటు కొంతమంది విద్యార్థులు ఇటీవల తరగతి గదిలో సెల్‌ఫోన్‌తో సెల్ఫీ‌లు తీసుకొని స్టేటస్‌లో పెట్టుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్ సంధ్యారాణి శుక్రవారం మధ్యాహ్నం యోగితో పాటు కొంతమంది విద్యార్థులను మందలించింది. అంతేకాక వారి తల్లిదండ్రులను కూడా స్కూలుకు పిలిపించింది.

దీనిలో భాగంగా యోగి తండ్రి రాము పాఠశాలకు వచ్చాడు. మీ అబ్బాయి వలన పాఠశాల పరువు పోతోందని.. అందుకు టి.సి ఇచ్చి పంపించేస్తానని హెచ్చరించింది. అయితే మొదటి తప్పుగా భావించి వదిలేయాలని విద్యార్థి తండ్రి రాము ప్రిన్సిపాల్‌ను కోరారు. అయినప్పటికీ ఆమె వినకుండా మీ అబ్బాయిని ఇంటికి  తీసుకుని వెళ్లిపోవాలని చెప్పింది.

దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన తండ్రి కుమారుడ్ని గట్టిగా మందలించి ఇంటికి తీసుకెళ్తుండగా పాఠశాల వద్దనే తప్పించుకొని పారిపోయాడు. అప్పటి నుంచి యోగి కోసం కుటుంబ సభ్యులు అంతా వెతుకుతున్నారు. శనివారం ఉదయం పాఠశాల సమీపంలోనే మామిడి చెట్టుకు ఉరివేసుకొని కనిపించాడు. దీనిపై విద్యార్థి తండ్రి రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయితే పాఠశాల ప్రిన్సిపల్ తీరుపై సర్వత్రా విమర్శలు వినపడుతున్నాయి. సెల్‌ఫోన్‌తో   తరగతి గదిలో ఫోటోలు తీసుకొని వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటే టీసి ఇచ్చి పంపించేస్తాను అనడం సరి కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Also Read : Tirumala : తిరుమలలో 5 రోజుల పాటు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు
అదే రోజు విద్యార్థి తండ్రి క్షమాపణ కోరినప్పటికీ అంతటితో ఆగకుండా తండ్రితో పంపించడం వలనే మనస్థాపానికి గురై పారిపోయి ఆత్మహత్య చేసుకున్నాడని పలువురు అంటున్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.