ఎంసెట్‌ ఫలితాల్లో ర్యాంకు రాలేదని విద్యార్థి వెంకటేశ్ ఆత్మహత్య, జగిత్యాలలో విషాదం

  • Published By: naveen ,Published On : October 7, 2020 / 11:58 AM IST
ఎంసెట్‌ ఫలితాల్లో ర్యాంకు రాలేదని విద్యార్థి వెంకటేశ్ ఆత్మహత్య, జగిత్యాలలో విషాదం

telangana eamcet results: జగిత్యాల జిల్లా హుస్నాబాద్‌లో విషాదం జరిగింది. ఎంసెట్‌ ఫలితాల్లో ర్యాంకు రాలేదని వెంకటేశ్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్‌ చదివిన వెంకటేశ్‌.. ఎంసెట్‌ పరీక్షలో క్వాలిఫై కాకపోవడంతో వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అర్థరాత్రి దాటినా వెంకటేశ్‌ ఇంటికి రాకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు కుటుంబసభ్యులు. బావి దగ్గర వెంకటేశ్‌ చెప్పులు కనిపించడంతో బావిలో నీటిని తోడి వెంకటేశ్‌ మృతదేహాన్ని వెలికితీశారు. వెంకటేశ్‌ మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మార్కులు తక్కువ వచ్చాయని కొందరు, పాస్ కాలేదని మరికొందరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం ఆవేదన కలిగిస్తోంది. ర్యాంకులు, మార్కులే పరమావధి కాదు. ఎంసెట్‌లో ర్యాంకు రానంత మాత్రాన జీవితం ముగిసిపోదు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు, టీచర్లు పిల్లలకు చెప్పాలి.

మార్కులు, ర్యాంకులే ముఖ్యం కాదు:
కాగా, ఈ విషయాన్ని విద్యార్థులకు తెలియజేయడంలో ఇటు తల్లిదండ్రులు.. అటు ఉపాధ్యాయులు కూడా ఫెయిల్ అవుతున్నారని మానసిక నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా పాఠశాల, కళాశాల విద్యార్థుల్లో ఆత్మనూన్యత భావం కలగడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి విద్యాలయ పరిస్థితులు తమకు అనువుగా ఉండకపోవడం.. రెండవది క్రమశిక్షణ పేరుతో విధించే శిక్షలు. అయితే.. అన్ని పాఠశాలల్లోనూ అదే పరిస్థితి ఉందని చెప్పలేం. కాకపోతే, ఎక్కువ శాతం పాఠశాలల్లో లేదా విద్యాలయాల్లో ఆ పరిస్థితి కనిపించడం గమనార్హం. తోటి విద్యార్థుల ముందు చిన్నబుచ్చడం, తక్కువ చేసి మాట్లాడడం, శిక్షల పేరుతో విపరీతంగా కొట్టడం లాంటి విషయాలు కూడా ఇలాంటి సంఘటనలకు ప్రధాన కారణంగా సైకాలజిస్టులు చెబుతున్నారు.

మెడికల్, ఇంజినీరింగ్ విద్యార్థులకూ తప్పని ఒత్తిడి:
పాఠశాలలు, కళాశాల విద్యార్థుల సంగతి ఇలా ఉంటే.. మెడికల్, ఇంజినీరింగ్ లాంటి ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల తీరు కూడా కొంతలో కొంత ఇదే స్థాయి ఒత్తిళ్లతో సాగడం గమనార్హం. ముఖ్యంగా ఇంజినీరింగ్ ఆఖరి సంవత్సరంలో ప్రాజెక్టు వర్క్, సెమినార్లు, ప్రాంగణాల నియామకాల పేరుతో కొందరు విద్యార్థులు పడే మానసిక వేదన అంతా ఇంతా కాదు. చదువును వారు ఎంజాయ్ చేయలేకపోవడమే అందుకు ప్రధాన కారణమంటున్నారు మానసిక నిపుణులు.

ఇలా చేస్తే విద్యార్థుల చావులు తగ్గుముఖం పట్టగలవు:
ముఖ్యంగా చెప్పాల్సిందేమిటంటే.. ఏ స్థాయి విద్యార్థులకైనా తమ చదువులపై ఆసక్తి కలగడం అనేది ముఖ్యం. సమయాన్ని ఉపయోగించుకోకుండా, పరీక్షలు ఇంకా రెండు, మూడు నెలల్లో వస్తున్నాయి అనగా.. పుస్తకాలు తీస్తున్నారు. ఇవన్నీ ఒత్తిడిని పెంచే విషయాలే. ఈ సమస్య తగ్గాలంటే.. ప్రతీ కళాశాలల్లో విద్యార్థుల మానసిక స్థైర్యాన్ని పెంచే కౌన్సిలింగ్ సెల్స్ కూడా ఉండాలని కోరుతున్నారు.

ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూడా విద్యార్థుల్లో ప్రేరణను కలిగించే మాటలే మాట్లాడాలి. వారిలో ప్రతికూల ఆలోచనలు పెంచే మాటలకి స్వస్తి చెప్పాలి. ఇతరులో పోల్చి చూడటం మానేయాలి. ర్యాంకుల ఒత్తిడి చేయకూడదు. అప్పుడే అనుకున్నంత మేరకైనా విద్యార్థుల చావులు తగ్గుముఖం పట్టగలవు.

సెప్టెంబర్‌లో జరిగిన ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ ఫలితాలు నిన్న(అక్టోబర్ 6,2020) విడుదల అయ్యాయి. JNTUలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎంసెట్ ఫలితాలను రిలీజ్ చేశారు. ఎంసెట్ ఇంజనీరింగ్‌లో 75.29 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి తెలిపారు. లక్షా 19వేల 183 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా…89వేల 734 మంది ఉత్తీర్ణులైనట్లు వెల్లడించారు. కరోనా వల్ల హాజరుకాని విద్యార్థులకు ఈ నెల 8న పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంసెట్ ఇంజినీరింగ్ ఫలితాల్లో తొలి పది ర్యాంకులు అబ్బాయిలే కైవసం చేసుకున్నారు.