Bacrtian treasure : తాలిబన్ల రాజ్యంలో ‘బ్యాక్ట్రియన్ ఖజానా’.. 2000 ఏళ్లనాటి బంగారు నిధి.. సినిమాను తలపించే స్టోరీ

తాలిబన్ల రాజ్యంలో ఉన్న అఫ్గాన్ బంగారు నిధిపై పురావస్తు అధికారులు ఆందోళన చేస్తున్నారు. 2000 ఏళ్ల క్రితం తవ్వకాల్లో బయటపడి దాచి పెట్టిన బంగారు నిధి తాలిబన్లు హస్తగతం అవుతుందనే ఆందోళన

10TV Telugu News

Afghanistan golden reserves ‘Bacrtian treasure’ : అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ముఖ్యంగా మహిళల జీవితాలు తిరిగి చీకటిలో మగ్గిపోతున్నాయి. అఫ్గాన్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. దీంతో వివిధ దేశాల్లో ఉన్న అఫ్గాన్‌ రిజర్వులు, బంగారాన్ని ఆయా దేశాలు స్తంభింపజేశాయి.

Read more : Gold-Mines: ఆంధ్రప్రదేశ్‌లో బంగారు గనులు.. తవ్వకాలకు అనుమతులు

దీంతో భవిష్యత్తులో తాలిబన్లు పాలనకు నిధులు లేక కటకటలాడిపోతున్నారు. అర్థిక పరిస్థితులు అగమ్యగోచరంగా మారాయి. ఈ క్రమంలో తాలిబ్లు డబ్బు కోసం ఆవురావురు మంటున్నారు. విదేశీ సాయం రూపంలో నిధుల కోసం తాము మారిపోయామని ప్రజలకు మంచి చేసే పాలన అందిస్తామని దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా సూక్తులు చెబుతున్నారు.

ఈ పరిస్థితుల్లో అత్యంత పురాతన స్వర్ణ నిధి ‘బ్యాక్ట్రియన్‌ ట్రెజరీ’గురించి పురావస్తు నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 2000 ఏళ్లనాటి ‘బ్యాక్ట్రియన్‌ ట్రెజరీ’ ఒకటి తాలిబన్ల రాజ్యంలోనే చిక్కుకుపోయింది. అఫ్గాన్‌లో పరిస్థితుల తీరు చూసి కొందరు నాయకులు దానిని తరలించాలని చూసినా అది సాధ్యం కాలేదు. అఫ్గాన్‌ కేంద్ర బ్యాంక్‌ ఆధీనంలో ఉన్న ఆ ఖజానాను తాలిబన్లు ఏం చేస్తారో అని పురావస్తు ప్రేమికులు,అఫ్గాన్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read more : యూపీలో రూ.12లక్షల కోట్ల బంగారపు గనులు

ఏమిటీ బ్యాక్ట్రియన్‌ ఖజానా..!
సోవియట్‌ యూనియన్‌ ఆక్రమించడానికి కొన్ని సంవత్సరాల క్రితం గ్రీక్‌-రష్యన్‌ పురావస్తు శాస్త్రవేత్త విక్టోర్‌ సరియాందీ నేతృత్వంలో సోవియట్‌-అఫ్గాన్‌ పురావస్తు పరిశోధన బృందం ఉత్తర అఫ్గాన్‌లో జ్వాజియన్‌ ప్రావిన్స్‌లోని తిల్యా తెపే (గోల్డెన్‌ హిల్‌)అనే ప్రాంతంలో తవ్వకాలు జరిపింది. అక్కడ వారికి ఓ భారీ ఖజానా లభ్యమైంది. దీనిలో 20,600 వస్తువులు లభించాయి. దాంట్లో బంగారు ఆభరణాలు, బంగారు నాణేలు, బొమ్మలు, పలు రకాల వస్తువులు ఉన్నాయి. ఇవి క్రీస్తుపూర్వం 1వ శ‌తాబ్ధ‌కాలానికి చెందిన‌విగా అప్ప‌టి పురావ‌స్తు శాస్త్ర‌వేత్త‌లు అంచనా వేశారు. భారత్‌లో ఏనుగు దంతాలతో తయారైన కళాఖండాలు కూడా వాటిల్లో ఉన్నాయి. ఈ తవ్వకాల్లో ఆరు సమాధులను కూడా కనుగొన్నారు పురావస్తు సైంటిస్టులు.ఈ తవ్వకాల బృందానికి నేతృత్వం వహంచిన విక్టోర్‌ బ్యాక్ట్రియన్‌ నాగరికతపై మంచి అవగాహన ఉన్న వ్యక్తి. ఆ ప్రాంతం పురావస్తు సంపదకు గని వంటిదిగా భావించారు. కాగా..4వ శతాబ్దంలో అలెగ్జాండర్‌ ది గ్రేట్‌ బ్యాక్ట్రియన్‌ను ఆక్రమించాడు. ఆ తర్వాత నుంచి ఆ ప్రాంతం పలు దండయాత్రలకు గురైంది. ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొంది. దీంతో పలు సంస్కృతులకు సంబంధించిన ఆనవాళ్లు అక్కడ నిక్షిప్తమైపోయాయి.

సోవియట్‌ ఆక్రమణ..మొదలైన పతనం..
తవ్వకాల నుంచి సేకరించిన ఖజానాను కాబుల్‌లోని నేషనల్‌ మ్యూజియానికి తరలించి అక్కడ భద్రపరిచారు. ఆ తర్వాత సోవియట్‌ దురాక్రమణ జరిగిన తరువాత అప్పటి నుంచి ఈ మ్యూజియంపై ఎన్నోసార్లు దాడులు జరిగాయి. ఈ దాడుల్లో మ్యూజియంలోని 70శాతం సంపద దోపిడీకి గురైంది. వీటిల్లో బ్యాక్ట్రియన్‌ నిధి వస్తువులు కూడా ఉన్నాయి.

1988లో అఫ్గాన్‌ నుంచి సోవియట్‌ విరమించుకొన్నా.. వారు ఏర్పాటు చేసిన నజీబుల్లా ప్రభుత్వం బ్యాక్ట్రియన్‌ సంపద భద్రపర్చేందుకు మ్యూజియం సరైన ప్రదేశం కాదని భావించి..దాన్ని 1989లో అఫ్గాన్‌ అధ్యక్ష భవనంలోని కేంద్ర బ్యాంక్‌ వాలెట్‌కు తరలించినట్లుగా ఓ ప్రముఖ ఛానల్‌ పేర్కొంది..ఈ నిధి తెరవాలంటే ఐదు తాళాలు కావాలని పేర్కొంది. కానీ మరో ప్రముఖ వార్తా కథనంలో మాత్రం ఐదు తాళాలు అవసరం లేదని పేర్కొంది. ఇదంతా సినిమా స్టోరీ మాదిరిగా ఉంది.

ఈ ఖజానా తెరవాలంటే ఐదు తాళాలు కావాల్సిందేనా?
ఆ నిధి తెరవాలంటే ఐదు తాళాలు కావాలనే వార్త హల్ చల్ చేస్తోంది.ఈ ఐదు తాళాల్లో మ్యూజియం డైరెక్టర్‌ ఒమర్‌ వద్ద ఒక తాళం ఉండగా మిగిలినవి వేర్వేరు వ్యక్తుల వద్ద ఉన్నాయి. వారు ఆ తాళాలు అఫ్గాన్‌ ముఠానాయకులు, తాలిబన్ల చేతిలో పడకుండా కాపాడారని వార్తా కథనాలున్నాయి. 1996లో అధికారం చేపట్టిన తాలిబన్లకు ఈ విషయం తెలియకుండా సదరు వ్యక్తులు జాగ్రత్త పడ్డారు.

Read more : Water gold : నీటిని బంగారంగా మార్చిన సైంటిస్టులు

సినిమాను తలపించే తాళాల స్టోరీ..

మరి ఇంత విలువ కలిగిన ఆ బంగారు నిధి గురించి తెలిసినవారు..ఆ తాళం ఉన్నవారు మరణిస్తే పరిస్థితి ఏంటీ? ఇక ఆ నిధి ఎవ్వరికి చెందకుండా పోతుందా? అలా జరుగకుండానే ఓ ఐడియా. ఇదికూడా సినిమాను తలపించేదిగానే ఉంది. నిధి తాళం ఉన్న వ్యక్తి మరణిస్తే.. దానిని అతని సంతానంలో పెద్దవారికి అందజేయాలనేది నిబంధన పెట్టుకున్నారట. 2003లో అమెరికా తాలిబన్లను పూర్తిగా తరిమికొట్టాక ఈ నిధి సురక్షితంగా ఉందన్న విషయాన్ని పౌర ప్రభుత్వం బయటకు వెల్లడించింది.

పేద దేశానికి ఆదాయ వనరుగా..బంగారు నిధి..

పేద దేశమైన అఫ్గాన్ కు బంగారు ఖజానా ఉన్నా దాన్ని వినియోగించుకోలేని పరిస్థితిలో ఉంది. ఖజానా ప్రదర్శనతోనే డబ్బులు అందుకుంది. ఖజానా విషయం బయటకు వెల్లడించిన పౌర ప్రభుత్వం దీనిని 2006 నుంచి 13 సార్లు విదేశాల్లో ప్రదర్శనలకు పెట్టింది. పారిస్‌లో తొలిసారి ప్రదర్శించారు. చివరిసారిగా 2020లో హాంకాంగ్‌లో ప్రదర్శనకు ఉంచారు. ఈ ప్రదర్శనల ద్వారా అఫ్గాన్‌ ప్రభుత్వానికి 4.5 మిలియన్‌ డాలర్ల ఆదాయం లభించింది.

ఖజానా భద్రత గురించి చర్చ..

అఫ్గానిస్థాన్‌లోని అవినీతి బ్యాక్ట్రియన్‌ సంపదకు ప్రమాదంగా మారుతుందని ఆనాటి దేశ దిగువ సభ సభ్యుడు మిర్‌ రహ్మన్‌ రెహ్మానీ ఈ ఏడాది జనవరిలో పార్లమెంట్‌లో ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో నమ్మకమైన దేశం వద్ద ఆ నిధిని భద్రపర్చాలని కోరారు. కానీ, సాంస్కృతిక శాఖ మంత్రి సానుకూలంగా స్పందించకపోవడంతో ఆ ప్రతిపాదన ముందుకు పోలేదు. అలాగే ఉండిపోవాల్సి వచ్చింది. అలా ఆ బంగారు నిధి తాలిబన్లు హస్తగతం చేసుకున్న ప్రాంతంలో ఉండిపోయింది. ఇప్పుడు ఆ వారసత్వ సంపద తాలిబన్ల చెరలో ఉంది. అది వారి కంట పడినా..వారికి దాని ఆచూకీ తెలిసిన మరుక్షణమే దోచేస్తారు. ఎటువంటి ఆలోచనా ఉండదిక. దీంతో ఆ బంగారునిధిని తాలిబన్లు ఏం చేస్తారోనని పురావస్తు ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు.