మయన్మార్‌లో తిరుగుబాటు.. ఆర్మీ చేతుల్లోకి ప్రభుత్వం

మయన్మార్‌లో తిరుగుబాటు.. ఆర్మీ చేతుల్లోకి ప్రభుత్వం

మయన్మార్‌ దేశంలో ప్రభుత్వంపై సైన్యం తిరుగుబాటు చేసింది. ఏడాది పాటు పాలనను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నట్లుగా సైన్యం ప్రకటన చేసింది. సోమవారం తెల్లవారుజామున మిలటరీ నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమోక్రసీ (ఎన్‌ఎల్‌డీ) నాయకురాలు, స్టేట్‌ కౌన్సిలర్‌ ఆంగ్‌ సాన్‌‌ సూకీతో పాటు దేశ అధ్యక్షుడు యు విన్‌మైంట్‌ను అదుపులోకి తీసుకుంది.

మాయన్మార్ దేశ పార్లమెంట్‌ సమావేశాల ప్రారంభానికి కొద్ది గంటల ముందు సైన్యం తిరుగుబాటు చేయగా.. మయన్మార్‌ రాజధానిలో ముందస్తుగా సైన్యం మొబైల్‌ సేవలను, ఇంటర్‌నెట్‌ను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఎప్పుడు అధికారాన్ని లాక్కుందామా? ఎప్పుడు అంగ్ సాన్ సూకీని పదవి నుంచి లాగేద్దామా? అని ఎదరుచూసే సైన్యం.. అన్నంత పని చేశారని, సైనిక చర్య జరిపి తిరుగులేని నేతగా ఉన్న అంగ్ సాన్ సూకీని బంధించేసినట్లుగా పాలకవర్గాలు చెబుతున్నాయి. దేశం తమ పాలనలోకి వచ్చేసిందని ఆర్మీ ప్రకటించగా.. ఏడాది పాటూ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. నవంబర్‌లో నిర్వహించిన ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని సైన్యం ఆరోపిస్తోంది.

ఈ ఆరోపణలను ప్రస్తుత అంగ్ సాన్ సూకీ ప్రభుత్వం ఖండించగా.. కొన్ని వారాలుగా ఈ అంశంపై ప్రభుత్వం, ఆర్మీ మధ్య వాదనలు జరుగుతున్నాయి. చివరకు సైన్యం ఎదురుతిరిగి ప్రభుత్వాని తమ చేతుల్లోకి తీసుకుంది. 50 ఏళ్లుగా సైన్యం చేతిలోనే ఆ దేశం ఉండగా.. ఇప్పుడు సూకీ పుణ్యమా అని తమకు స్వేచ్ఛ వచ్చిందని ప్రజలు భావించారు.

అయితే మళ్లీ సైన్యం చేతిల్లోకి ప్రభుత్వం వెళ్లిపోయి ప్రజాస్వామ్యం చచ్చిపోయింది అని అభిప్రాయపడుతున్నారు.

సైన్యం మాత్రం.. అధికారాన్ని లాక్కోవడం తమ ఉద్దేశం కాదని, ఎన్నికల్లో జరిగిన అక్రమాల అంతు చూసేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది. ఆ ఎన్నికల్లో సూకీ పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (NLD) గెలిచింది. అది ఇష్టం లేని సైన్యం ఎలాగైనా ఆమెను పదవి నుంచి దించేయాలని కుట్రకు పాల్పడినట్లుగా విమర్శలు వస్తున్నాయి. తాజా పరిణామాలపై అగ్రరాజ్యం అమెరికాతో పాటు ఆస్ట్రేలియా ఆందోళన వ్యక్తం చేశాయి.