AAP Punjab : పంజాబ్‌లో కొత్త చరిత్ర సృష్టించిన ఆప్‌.. జాతీయ పార్టీలను ఊడ్చి పారేసిన ‘చీపురు’

15 యేళ్ల పాటు దేశ రాజధాని ఢిల్లీని ఏకచత్రాధిపత్యంగా ఏలుతున్న కాంగ్రెస్‌ను చీపురు కట్టతో ఊడ్చేసి ఆప్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీకి మంగళం పాడేశారు.

AAP Punjab : పంజాబ్‌లో కొత్త చరిత్ర సృష్టించిన ఆప్‌.. జాతీయ పార్టీలను ఊడ్చి పారేసిన ‘చీపురు’

Kejriwal

Aam Aadmi Party : ఎనిమిదేళ్ల క్రితం నాటి సంగతి…! దేశ రాజకీయాల్లో సమూల మార్పు తీసుకువస్తానంటూ ఓ వ్యక్తి చీపురు కట్ట పట్టుకుని బయలుదేరారు. ఇండియన్ రెవెన్యూ సర్వీస్‌ను వదిలిపెట్టి… ఇండియన్ పొలిటికల్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు…! అప్పుడు ఆయన్ను ఆయన పార్టీని ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు…! తమ గత చరిత్రను చూసి గర్వంగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ అయితే.. ఆ పార్టీని చాలా లైట్ తీసుకుంది. నూట పాతికేళ్ల మా చరిత్ర ఎక్కడా.. నిన్నగాక మొన్న పుట్టుకొచ్చిన మీ చరిత్ర ఎక్కడా అంటూ ఆమ్‌ ఆద్మీ పార్టీని కేర్ చేయలేదు. కానీ కామన్ మ్యాన్‌ను నమ్ముకున్న పార్టీ పవర్ ఎలా ఉంటుందో ఆమ్‌ ఆద్మీ పార్టీ కాంగ్రెస్‌కు రుచి చూపించింది.

15 యేళ్ల పాటు దేశ రాజధాని ఢిల్లీని ఏకచత్రాధిపత్యంగా ఏలుతున్న కాంగ్రెస్‌ను చీపురు కట్టతో ఊడ్చేసి ఆప్ అధికారంలోకి వచ్చింది..ఇది 2013 నాటి సంగతి.. అప్పుడు ఢిల్లీలో ఏం జరిగిందో.. ఇప్పుడు పంజాబ్‌లో అదే చరిత్ర రిపీట్ అయ్యింది. అయితే కాంగ్రెస్ లేదా బాదల్‌ 70 ఏళ్లుగా.. పంజాబ్‌ అంటేనే ఈ రెండు పార్టీలకు అడ్డాగా మారింది. ఇప్పుడా ఇమేజ్‌ను కేజ్రీవాల్ మార్చేశారు. నాడు ఢిల్లీలో కాంగ్రెస్‌ను ఇంటి దారి పట్టించిన కేజ్రీవాల్ ఇప్పుడు పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీకి మంగళం పాడేశారు.
AAP in Punjab: పంజాబ్ ను కైవసం చేసుకున్న “ఆమ్ ఆద్మీ”: సక్సెస్ సీక్రెట్

ఓ వైపు కాంగ్రెస్‌.. మరోవైపు బీజేపీ.. సిగపట్లు పట్టుకుంటుంటే సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటూ పోయింది ఆప్‌. పనికిరాని పంచాయితీలు కాదు.. అభివృద్ధే మా నినాదమంటూ పంజాబ్‌ ప్రజల మనసుల దోచుకునే పని ప్రారంభించింది. తాము రాజకీయాలు చేయము.. ఢిల్లీ అభివృద్ధిని చూడండి.. అదే ఇక్కడ రిపీట్‌ చేస్తామంటూ సౌండ్ రాకుండా సైలెంట్‌ ప్రచారం చేసింది.. ఈ వ్యూహాలే పంజాబ్‌లో ఆప్‌ పాగా వేయడానికి కారణమయ్యాయి. పంజాబ్‌లో కాంగ్రెస్ తన కొంప తానే కూల్చుకునే పనిలో ఉంటే.. ఢిల్లీలో కేజ్రీవాల్‌ పాలనను శాంపిల్‌గా చూపించి పంజాబ్‌ను కైవసంచేసుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ.

పంజాబ్‌లో ఆప్ అధికారంలోకి రావడానికి ఎన్నో కారణాలు.. అందులో మొదటిది పంజాబ్‌ ప్రజలు మార్పును కోరుకోవడం. ఇప్పటి వరకు పంజాబ్‌ను పాలించింది బీజేపీతో దోస్తి కట్టిన బాదల్‌ కుటుంబం నేతృత్వంలోని అకాలీదళ్‌.. లేదంటే గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీ కాంగ్రెస్‌ మాత్రమే. కానీ ఈ రెండు పార్టీలు ఒకే నాణానికి రెండు వైపులాంటివని పంజాబ్ ప్రజలు గుర్తించారు. వీరిద్దరి పాలనలో పంజాబ్‌కు ఓరిగిందేమి లేదని తెలుసుకున్నారు. మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేమంటూ ఆప్‌ ఇచ్చిన నినాదానికి ప్రజలు ప్రభావితమయ్యారు. ఈ నినాదమే ఆప్‌కు ఓట్ల వర్షం కురిపించింది. అందుకే ప్రజలు మార్పుకు ఓటేశారు. ముఖ్యంగా మాల్వా ప్రాంతం ప్రజలు గంప గుత్తగా ఆప్‌కు ఓటేశారు.

Punjab : పంజాబ్‌కా షాన్‌.. పంజాబ్‌కా షేర్.. హాస్యనటుడు నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రస్థానం

ఓటర్లను తనవైపు తిప్పుకునేలా చేసిన మరో మంత్రం ఢిల్లీ మోడల్‌. అందుబాటులో విద్య, వైద్యం, విద్యుత్, తాగునీరు.. ఇదే ఢిల్లీ మోడల్. తాము అధికారంలోకి వస్తే వీటన్నింటిని ప్రజల వద్దకే తీసుకొస్తామని ఆప్‌ విస్తృత ప్రచారం చేసింది. 5 లక్షల వరకు క్యాష్ లెస్‌ హెల్త్ ఇన్సూరెన్స్, ఉచితంగా వైద్యం, మందులు, టెస్ట్‌లు, ప్రతి గ్రామంలో ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది ఆప్‌. ప్రజలకు అందని ద్రాక్షగా మారుతున్న విద్య, వైద్యాన్ని తమ చెంతకు తీసుకోస్తామన్న ఆప్‌ ప్రచారానికి కూడా ప్రజలు ఆకర్షితులై ఓట్ల వర్షం కురిపించారు.

ఇక మహిళలు, యువతను ఆప్‌ నేతలు ముందు నుంచే టార్గెట్ చేశారని చెప్పాలి. తమకు ఒక్క ఛాన్స్‌ ఇవ్వాలంటూ చేసిన ప్రచారం.. అధికారంలోకి రాగానే అవినీతిని అంతం చేస్తామన్న హామీ.. యువతలో ఓ కొత్త ఆశను చిగురించేలా చేసింది. మహిళలకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తామని చెప్పడం, 400 యూనిట్ల వరకు ఇళ్లకు ఉచిత విద్యుత్‌, ప్రాపర్టీ ట్యాక్స్‌ రద్దు వంటి హామీలు మహిళలను ఆప్‌ వైపు చూసేలా చేశాయి. అదే సమయంలో భగవంత్ మాన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందే ప్రకటించడం కూడా ఆమ్‌ ఆద్మీకి కలిసి వచ్చింది. పార్టీ గెలిస్తే సీఎంగా స్థానిక వ్యక్తినే నియమిస్తామని.. కేజ్రీవాల్‌ ఇచ్చిన హామీ కూడా ఆప్‌కు కలిసి వచ్చింది.

AAP Bhagwant Mann : భగత్ సింగ్ పుట్టిన గ్రామంలోనే సీఎంగా ప్రమాణం చేస్తా.. రాజ్ భవన్‌లో కాదు..!

కేంద్రం తీసుకొచ్చి, రద్దు చేసిన నూతన వ్యవసాయ చట్టాలు కూడా ఆప్‌కి బాగా కలిసివచ్చాయి. ఈ సమయంలో అటు కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్‌ పార్టీపై పంజాబ్‌ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిపోయింది. ఈ అంశాలన్ని ఆప్‌ గెలుపుకు దోహదపడటమే గాకుండా.. పంజాబ్‌లో ఓ కొత్త చరిత్రను సృష్టించడానికి కారణమైందనే చెప్పాలి. వీటన్నింటికీ మించి.. ఆమ్ ఆద్మీ పార్టీ గురించి మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశం ఒకటుంది. అదే కేజ్రీవాల్ క్లీన్ ఇమేజ్.. అవినీతి మరకలు అంటని పాలన.. ఢిల్లీలో కనిపిస్తున్న అభివృద్ధి.. ఇవన్నీ ఆప్‌ను పంజాబ్‌లో తిరుగులేని పార్టీగా నిలిపాయి.