అందుబాటులోకి రాని కోవిన్ యాప్, వ్యాక్సిన్ లబ్దిదారుల్లో గందరగోళం

అందుబాటులోకి రాని కోవిన్ యాప్, వ్యాక్సిన్ లబ్దిదారుల్లో గందరగోళం

Cowin app not available : సంక్రాంతి నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభించాలని కేంద్రం భావిస్తోంది. ఇండియాలో తొలి క‌రోనా వైర‌స్ టీకా జ‌న‌వ‌రి 13న వేసే అవ‌కాశం ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యద‌ర్శి రాజేష్ భూష‌ణ్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రై రన్ సక్సెస్ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం..మొదటి దశలో కొంతమందికి టీకా ఇవ్వనున్నారు. కోవిన్ యాప్ లో పేర్లు నమోదు చేసుకోవాలని ప్రభుత్వం గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ..దానిని ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తే..అందుబాటులోకి రాకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు. లబ్దిదారుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. నిర్దేశిత లబ్దిదారులందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినట్లేనని చాలా మంది అనుకుంటున్నారు.

కోవిన్ యాప్ లో పేర్లు నమోదు చేసుకోవాలని అనుకుంటున్నా..యాప్ ప్రజలకు అందుబాటులోకి రాకపోవడంతో పేర్లు ఎలా నమోదు చేసుకోవాలనే విషయంలో లబ్దిదారుల్లో గందరగోళం నెలకొంది. దీనిపై వైద్య ఆరోగ్య శాఖకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్రమంలో..మంగళవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్ గురువారం రాష్ట్రాల వైద్య ఆరోగ్య మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఇందులో ఈ అంశంపై చర్చించాలని భావిస్తున్నారు.

గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ లలోదీని కోసం వెతకవద్దని, కోవిన్ పోలిన పేరిట ఉన్న యాప్ లను డౌన్ లోడ్ చేసుకోవద్దని, వ్యక్తిగత సమాచారాన్ని వాటిల్లో పంచుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. యాప్ అందుబాటులోకి వచ్చాక…విధి విధానాలను కూడా యాప్ సమయంలో వెల్లడిస్తారని తెలియచేస్తున్నారు.