K Keshava Rao : భవిష్యత్తు ప్రాంతీయ పార్టీలదే, రాహుల్‌కు నాయకత్వ లక్షణాలు లేవు- కేకే
K Keshava Rao : రాహుల్ గాంధీ తన ప్రసంగంలో అన్నీ అబద్ధాలే చెప్పారు. బీజేపీ వ్యతిరేక కూటమికి నాయకత్వం వహించే లక్షణాలు లేవు.

K Keshava Rao (Photo : Google)
K Keshava Rao – Rahul Gandhi : దేశ రాజకీయాల్లో భవిష్యత్తు ప్రాంతీయ పార్టీలదే అన్నారు బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు. దేశంలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయని ఆయన చెప్పారు. జాతీయ పార్టీలు పట్టు కోల్పోయినా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయని స్పష్టం చేశారు. రాజకీయాల్లో పరిస్థితులు నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయని కేకే అన్నారు.
ఖమ్మం కాంగ్రెస్ సభలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేకే తీవ్రంగా స్పందించారు. రాహుల్ విమర్శలు, ఆరోపణలకు ధీటుగా బదులిచ్చారు. రాహుల్ గాంధీ తన స్పీచ్ లో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.
పార్లమెంటులో వ్యవసాయ బిల్లును మేము వ్యతిరేకించాము, ప్రభుత్వ తీరును నిరసిస్తూ బహిష్కరించాము అని కేకే గుర్తు చేశారు. బీఆర్ఎస్ కారణంగానే కేంద్రం వ్యవసాయ బిల్లును ఉపసంహరించిందన్నారు. కానీ, సమర్ధించినట్లు ఓ జాతీయ నేత చెప్పడం హాస్యాస్పదం అని విమర్శించారు. రాహుల్ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలి వేస్తానన్నారు కేకే.
రాహుల్ గాంధీ తన ప్రసంగంలో అన్నీ అబద్ధాలే చెప్పారని కే కేశవరావు మండిపడ్డారు. బీజేపీతో జాతీయ స్థాయిలో మాలా(బీఆర్ఎస్) ఏ పార్టీ పోరాడడం లేదన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కలుస్తున్న పార్టీలకు బీఆర్ఎస్ ముందు ఉంటుందన్నారు. బీఆర్ఎస్ వస్తే మేము రాము అని రాహుల్ చెప్పారు.. ఈ మాట గతంలో ఎందుకు చెప్పలేదు? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ వ్యతిరేక కూటమికి నాయకత్వం వహించే లక్షణాలు రాహుల్ కు లేవన్నారు కేకే. రాజ్యాంగాన్ని అవమానపరిచిన తమిళనాడు గవర్నర్ ను తొలగించాలని కేకే డిమాండ్ చేశారు.
ఖమ్మం కాంగ్రెస్ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. బీఆర్ఎస్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం ధ్వంసం చేసిందన్నారు. పేదల కలలను కేసీఆర్ నాశనం చేశారని మండిపడ్డారు. భూములను దోచుకోవడానికే ధరణిని తెచ్చారని, కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని, మిషన్ భగీరథలో వేల కోట్లు దోచుకున్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు రాహుల్ గాంధీ.