KTR: తెలంగాణలో ఇది ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది: కేటీఆర్

తమ కంటే మంచి ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఉందో చూపిస్తే రాజకీయాలను వదిలేస్తానని సవాలు విసిరారు.

KTR: తెలంగాణలో ఇది ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది: కేటీఆర్

Minister KTR

Updated On : June 29, 2023 / 3:53 PM IST

KTR – Telangana: తెలంగాణలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. 60 ఏళ్లలో జరగని అభివృద్ధి 9 ఏళ్లలో జరగడానికి సీఎం కేసీఆర్ (KCR) నాయకత్వం, ఆయన దృఢ సంకల్పమే కారణమని చెప్పారు.

హైదరాబాద్ శివారులోని నానక్ రామ్ గూడలో ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ లో క్రెడాయ్ తెలంగాణ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన కేటీఆర్… తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి ప్రతిపక్షాలకు క్లారిటీ లేకపోయినప్పటికీ ప్రజలకు క్లారిటీ ఉందని చెప్పుకొచ్చారు. తాము వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 95 నుంచి 100 స్థానాల మధ్య గెలుస్తామని తెలిపారు.

ప్రధాని మోదీతో తమకు పడదని చెప్పారు. తెలంగాణ అంటే ఆయనకు ఇష్టం ఉండదని అన్నారు. పారిశ్రామిక వేత్తల కోట్లాది రూపాయలు మాఫీ చేసిన మోదీ.. రైతు రుణాల మాఫీ పట్ల మాత్రం ఎందుకు అనుకూలంగా లేరని ప్రశ్నించారు. పని చేసే తమ ప్రభుత్వాన్ని ప్రజలు కాపాడుకుంటారని తనకు నమ్మకం ఉందని చెప్పారు.

ఇక్కడ ఎవరమూ శాశ్వతం కాదని, అసలు జీవితమే శాశ్వతం కాదని ఆయన హితవు పలికారు. నరేంద్ర మోదీ తెలంగాణకు ఏమీ ఇవ్వట్లేదని తెలిపారు. పైగా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పారు. అభివృద్ధి కోసం అప్పు చేస్తే తప్పేముందని నిలదీశారు.

హాలీవుడ్ సినిమాను టాలీవుడ్ కాపీ కొట్టినట్లు తెలంగాణ పథకాలను మోదీ కాపీ కొడుతున్నారని చెప్పారు. హైదరాబాద్ నగరం మనది అని అందరు గర్వంగా చెప్పుకుంటున్నారని తెలిపారు. తమ కంటే మంచి ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఉందో చూపిస్తే రాజకీయాలను వదిలేస్తానని సవాలు విసిరారు.

తెలంగాణ లో 24 గంటల కరెంట్ ఇస్తున్నామని అన్నారు. కాగా, ప్రముఖ జానపద గాయకుడు, తెలంగాణ గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ (TSWC Chairman) సాయిచంద్(Sai Chand) మరణ వార్త విని షాక్ అయ్యామని కేటీఆర్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని చెప్పారు.

Hyderabad Huge Scam : హైదరాబాద్ లో మరో భారీ మోసం.. రూ.40 కోట్ల స్కామ్ ను బయటపెట్టిన ఐటీ