Owaisi : ముస్లింలకే కాదు క్రిస్టియన్లు, గిరిజనులకు కూడా నష్టమే.. దేశంలో కల్లోలం సృష్టించేందుకు బీజేపీ కుట్ర- యూసీసీపై ఒవైసీ సంచలనం
Owaisi : దేశంలో సెక్యులరిజంను చంపేయాలని బీజేపీ చూస్తోంది. చట్టాలపై తప్పుదారి పట్టిస్తోంది.

Asaduddin Owaisi (Photo : Twitter)
Asaduddin Owaisi – Uniform Civil Code : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకురానున్న యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) పై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూనిఫాం సివిల్ కోడ్ తో ముస్లింలకే కాదు క్రిస్టియన్లు, గిరిజనులకు కూడా నష్టమే అని ఒవైసీ ఆరోపించారు. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో అసదుద్దీన్ ఒవైసీ, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు భేటీ అయ్యారు. కేంద్రం తీసుకురానున్న యూనిఫాం సివిల్ కోడ్ పై చర్చించారు.
యూనిఫాం సివిల్ కోడ్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ తో డిస్కషన్ చేసినట్లు ఒవైసీ తెలిపారు. బీజేపీ యూసీసీ తీసుకురావాలని చూస్తోందని, దీన్ని వ్యతిరేకించాలని కేసీఆర్ ను కోరామన్నారు. గతంలో అసెంబ్లీలో NRC, CAA కు వ్యతిరేకంగా ప్రభుత్వం తీర్మానం చేసిందని ఆయన గుర్తు చేశారు.
”యూసీసీపై.. 74 పేజీలతో సీఎం కేసీఆర్ కు ముస్లిం సంఘాల అభిప్రాయాలతో ప్రత్యేకంగా నోట్ అందించాం. యూసీసీతో.. ముస్లింలకే కాదు.. క్రిస్టియన్లు, తెలంగాణ గిరిజనులకు నష్టం జరుగుతుంది. యుసిసితో దేశంలో కల్లోలం సృష్టించాలని బీజేపీ చూస్తోంది. దేశంలోని చట్టాలపై బీజేపీ తప్పుదారి పట్టిస్తోంది.
సీఆర్పీసీలో వివిధ రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉన్నాయి. దేశంలో సెక్యులరిజంను చంపేయాలని బీజేపీ చూస్తోంది. భారత్ అంటేనే.. భిన్నత్వంలో ఏకత్వం. మోదీకి సెక్యులరిజం అంటే అలర్జీ. కేసీఆర్.. యూసీసీని వ్యతిరేకిస్తామని చెప్పారు. మిగతా పార్టీల మద్దతు కూడా కూడగడతామని తెలిపారు.
Also Read..MLA Rajaiah : కడియం శ్రీహరి పెద్ద అవినీతి తిమింగలం.. ఎమ్మెల్యే రాజయ్య సంచలన ఆరోపణలు
పార్లమెంటులో యూసీసీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఓటు వేస్తుందో.. గైర్హాజరు అవుతుందో.. మాకు తెలియదు. అది బీఆర్ఎస్ నే అడగండి. ఏపి సీఎం జగన్ కూడా కలుస్తాం. మద్దతు కోరుతాం. మైనార్టీ ఓవర్సీస్ స్కాలర్ షిప్స్, ఓల్డ్ సిటీ మెట్రో, మైనార్టీ అభివృద్ధికి నిధులపై ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చించాము” అని ఒవైసీ చెప్పారు.