YS Sharmila : ఢిల్లీలో షర్మిల, కాంగ్రెస్‌లో విలీనం కానున్న వైఎస్ఆర్టిపీ.. ముహూర్తం ఫిక్స్!?

తెలంగాణలో వైఎస్ఆర్టిపి పార్టీ స్థాపించి బీఆర్ఎస్ పై మాటల తూటాలలో విరుచుకు పడ్డ వైఎస్ షర్మిల పార్టీ ప్రస్థానం ఇక ముగియనుంది. కాంగ్రెస్ లో షర్మిల పార్టీ విలీనం చేయనున్నారనే వార్తలకు ఇక తెరపడనుంది.

YS Sharmila : ఢిల్లీలో షర్మిల, కాంగ్రెస్‌లో విలీనం కానున్న వైఎస్ఆర్టిపీ.. ముహూర్తం ఫిక్స్!?

YS Sharmila YSRTP party

YS Sharmila – YSRTP : తెలంగాణలో వైఎస్ఆర్టిపీ స్థాపించి బీఆర్ఎస్ పై మాటల తూటాలలో విరుచుకు పడ్డ వైఎస్ షర్మిల పార్టీ ప్రస్థానం ఇక ముగియనుందా? కాంగ్రెస్ లో షర్మిల పార్టీ విలీనం చేయనున్నారనే వార్తలకు ఇక తెరపడనుందా? తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయటానికి షర్మిల సిద్ధమయినట్టు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. దీని కోసమే షర్మిల గురువారం ఢిల్లీ వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ లో షర్మిల పార్టీని విలీనం చేయటానికి ముహూర్తం ఫిక్స్ అయినట్టు సమాచారం. ఈ ప్రక్రియ కోసం బెంగళూరు వెళ్లిన షర్మిల అక్కడి నుంచే ఢిల్లీకి చేరుకున్నారని అంటున్నారు. కర్ణాటక కాంగ్రెస్ లీడర్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయటానికి మంత్రాంగం నడిపారని వార్తలు వస్తున్నాయి.

దివంగత నేతల వైఎస్ రాజశేఖర్ తో ఆయనకున్న సాన్నిహిత్యంతో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టిపీ విలీనానికి పావులు కదిపారు డీకే శివకుమార్. దీని కోసం పలుమార్లు షర్మిలతో మాట్లాడటమే కాకుండా షర్మిల కూడా కర్ణాటక వెళ్లి శివకుమార్ ను  కలిశారు. అప్పట్లో వీరిద్దరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయటానికి షర్మిల సంసిద్ధత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. దీని కోసం ఆమె కాంగ్రెస్ అధిష్టానికి ఎటువంటి షరతులు విధించారో తెలియాల్సి ఉంది. ఆమెకు కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం కల్పించనున్నట్లుగా సమాచారం.

YS Sharmila: షర్మిల, కాంగ్రెస్ మధ్య రాయబారం నడిపిందెవరు.. విలీనానికి అంతా సిద్ధమా?

ఢిల్లీ చేరుకున్న షర్మిల నేడు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను కలిసే అవకాశం ఉంది. మరి పార్టీ విలీనం తరువాత షర్మిల ఏపీ కాంగ్రెస్ లేదా తెలంగాణ కాంగ్రెస్ కోసం పనిచేస్తారా? అనే విషయంపై ఆసక్తి కొనసాగుతోంది. ఈ క్రమంలో ఏపీ నుంచి ఢిల్లీ బయలుదేరారు పీసీసీ గిడుగు రుద్రరాజు.

కాగా 2021 జులై 8న యువజన శ్రామిక రైతు తెలంగాణ పార్టీని షర్మిల స్థాపించిన విషయం తెలిసిందే. పార్టీ స్థాపించిన షర్మిల పాదయాత్రలు.. పలు కార్యక్రమాలతో బీఆర్ఎస్ పై తీవ్రంగా విరుచుపడేవారు. ఘాటు వ్యాఖ్యలపై అటు సీఎం కేసీఆర్ , ఇటు కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులపై విరుచుపడేవారు. తెలంగాణలో అన్ని సీట్లలోను పోటీ చేస్తాం.. గెలిచి కేసీఆర్ గడీలు బద్దలు కొడతానని పదే పదే వ్యాఖ్యలు చేసిన షర్మిల ఒక్కసారి కూడా ఎన్నికల్లో పోటీ చేయకుండానే కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేయడానికి సిద్ధపడటం గమనించాల్సిన విషయం.