ఆస్తమాకు కొత్త మెడిసిన్ : స్వీడన్ సైంటిస్టుల కృషి

  • Published By: madhu ,Published On : February 10, 2019 / 10:54 AM IST
ఆస్తమాకు కొత్త మెడిసిన్ : స్వీడన్ సైంటిస్టుల కృషి

వాతావరణం చల్లబడిందంటే చాలు..పాపం.. ఉబ్బసవ్యాధి ఉన్నవాళ్లు ఊపిరితీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి ఆస్తమా పేషెంట్లకు ఇప్పుడు మంచి మెడిసిన్ రాబోతున్నది. స్వీడన్ దేశ పరిశోధకులు ఈ ఉబ్బస వ్యాధికి కొత్త మందు కనిపెట్టారు. కేవలం ఆస్తమా లేదా ఉబ్బసానికే కాదు… సీఓపీడీ లాంటి ఊపిరితిత్తులకు సంబంధించిన ఇతర సమస్యలకు కూడా ఈ మందు చక్కని పరిష్కారాన్ని చూపబోతున్నది. 

ఆస్తమా వ్యాధికి ఎన్నో రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పటివరకు ఆస్తమా పేషంట్లకు ఇన్ హేలర్లే ది బెస్ట్ మెడిసిన్. కాని ఇన్ హేలర్లు రెగ్యులర్ గా వాడితే అలవాటవుతుందని ఎక్కువ మంది వాడడం ఆపేస్తారు. ఇన్ హేలర్లలో స్టిరాయిడ్స్ ఉంటాయని వాడడానికి భయపడతారు. ఇక భయపడాల్సిన అవసరం లేదు. ఒక కొత్త ప్రొటీన్ నుంచి ఇంకో మెడిసిన్ తయారుచేయబోతున్నారు.

ఒక్కోసారి దేని కోసమో వెతుకుతుంటే మరేదో దొరుకుతుంది. స్వీడన్ సైంటిస్టుల పని కూడా అంతే అయింది. కెరోలిన్ స్కా ఇనిస్టిట్యూట్ కి చెందిన సైంటిస్టులు స్టాక్ హామ్ యూనివర్సిటీ, టెక్సాస్ మెడికల్ బ్రాంచ్‌తో కలిసి చేసిన పరిశోధనలో ఇలాంటి ఫలితమే ఎదురైంది. క్యాన్సర్ చికత్సల కోసం చేస్తున్న పరిశోధనలో క్యాన్సర్ మందు పక్కన పెడితే ఆస్తమాకు కొత్త మందు తెలిసింది. క్యాన్సర్ కణాలను దెబ్బతీసే ప్రొటీన్ పదార్థం నుంచే ఉబ్బస వ్యాధి మందు కూడా రూపొందించొచ్చని తేలింది. వాపు, ఎరుపుదనాన్ని ప్రేరేపించే ఇన్ ఫ్లమేటరీ చర్యలను ఈ కొత్త ప్రొటీన్ పదార్థం నిరోధిస్తున్నట్టు కనిపెట్టారు. ఈ కొత్త మందును ఎలుకలపై పరీక్షించారు. అది సక్సెస్ అయింది. మనుషుల్లో కూడా దీన్ని టెస్ట్ చేయాల్సి ఉంది. ఇక ఆస్తమా, సీవోపీడీ పేషెంట్లకు కూడా అందుబాటులోకి రావాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.