ఎలా ఉంటదో మరి….ఆ సినిమాలో 85ఏళ్ల బామ్మగా కాజల్

  • Published By: venkaiahnaidu ,Published On : January 17, 2020 / 04:26 AM IST
ఎలా ఉంటదో మరి….ఆ సినిమాలో  85ఏళ్ల బామ్మగా కాజల్

శంకర్ డైరక్షన్ లో భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా రూపొందుతున్న ఇండియన్-2 సినిమాలో తన పాత్ర గురించిన సీక్రెట్స్ బయటకు చెప్పేసింది అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. ఈ సినిమాకు సంబంధించిన ఏ విషయాన్నీ డైరక్టర్ శంకర్‌ బయట పెట్టరాదని కండిషన్‌ పెట్టారని చెబుతూనే తన పాత్ర గురించి స్పష్టంగా చెప్పేశారు. దక్షిణాదిలో అగ్ర నటిగా వెలిగిన కాజల్‌కు ప్రస్తుతం అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. అయితే తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఒక్కో చిత్రం చేస్తున్న ఈ బ్యూటీ ఎంతో ఆశలు పెట్టుకున్న చిత్రం ఇండియన్‌–2. కారణం కమలహాసన్‌తో తొలిసారిగా జత కట్టడం. దీన్ని స్టార్‌ దర్శకుడు శంకర్‌ తెరకెక్కించడం.

ఇండియన్‌–2 చిత్రంలో ఎప్పుడెప్పుడు నటిద్దామా..? అని ఎదురు చూసిన కాజల్‌ ఇటీవల ఆ చిత్ర షూటింగ్‌లో పాల్గొన్నారు. ఆ అనుభవాలను చెబుతూ ఇండియన్‌–2 చిత్రం విడుదలైన తరువాత తన ఇమేజ్‌ వేరే లెవల్‌కు చేరుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో నటించాలని దర్శకుడు శంకర్‌ తనను సంప్రదించినప్పుడు ఎలాంటి పాత్రను ఇస్తారోనని బయపడినట్లు తెలిపారు. ఆ తరువాత ఇండియన్‌–2 చిత్రంలో తన పాత్ర 85 ఏళ్ల బామ్మదని తెలిసిందన్నారు. ఈ పాత్రకు తాను న్యాయం చేయగలనా అన్న సందేహం కలిగిందని, ఇప్పుడు సందేహం పటాపంచలైపోయిందని తెలిపింది. 

ఇండియన్‌–2 చిత్రంలో కమలహాసన్‌ పోషిస్తున్న పాత్ర తరువాత అంతగా చెప్పుకోదగ్గ పాత్ర తనదేనని కాజల్ తెలిపారు. అందుకే ఈ పాత్ర కోసం చాలా ప్రత్యేక శ్రద్ధ పెట్టి నటిస్తున్నట్లు చెప్పారు. ఈ పాత్రకు మేకప్‌ కోసమే అనేక గంటలు పడుతోందని తెలిపింది. ఈ మూవీ షూటింగ్‌ తదుపరి షెడ్యూల్‌ పిబ్రవరిలో మొదలవుతుందన్నారు.మరోవైపు మలయాళ యువ నటుడు దుల్కర్‌ సల్మాన్‌తో జత కట్టడానికి కాజల్ సిద్ధమవుతోందని టాక్‌. తమిళం, మలయాళం భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు సమాచారం.