ICMR: సెకెండ్ కంటే థర్డ్ వేవ్ ప్రమాదం తక్కువే!
కరోనా వైరస్ వ్యాప్తిపై అంచనాలు, లెక్కలు కొనసాగుతూనే ఉన్నాయి. వేవ్‌ల గురించి లెక్కలేనన్ని అంచనాలు వేస్తున్నారు నిపుణులు.

Indian Council of Medical Research: కరోనా వైరస్ వ్యాప్తిపై అంచనాలు, లెక్కలు కొనసాగుతూనే ఉన్నాయి. వేవ్‌ల గురించి లెక్కలేనన్ని అంచనాలు వేస్తున్నారు నిపుణులు. భారత్‌లో థర్డ్ వేవ్ వచ్చిందంటే అల్లకల్లోలమేనని.. పిల్లలు డేంజర్‌లో పడతారని, ఆగస్టులోనే మొదలైపోతుందని.. ముప్పు అధికంగా ఉంటుందని.. ఇలా ఎవరి అంచనాలకు తగ్గట్టు వారు చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు ఐసీఎంఆర్ కొత్త విషయాన్ని చెబుతోంది.
ఇంతకాలం భయపెడుతూ వచ్చిన అంచనాలకు భిన్నంగా.. థర్డ్ వేవ్ అంత తీవ్రంగా ఉండకపోవచ్చని వెల్లడించింది ఐసీఎంఆర్. సెకెండ్ వేవ్‌తో పోల్చుకుంటే వ్యాప్తి తీవ్రత తక్కువగానే ఉండవచ్చని తెలిపారు ఐసీఎంఆర్‌లోని ఈసీడీ విభాగం అధిపతి డాక్టర్ సమిరన్ పండా. థర్డ్ వేవ్ గురించి దేశవ్యాప్తంగా ఎవరూ కచ్చితమైన అంచనాలు వేయలేరని అన్నారు పండా. జిల్లాలు, రాష్ట్రాల నుంచి కచ్చితమైన డేటా సాయంతో అంచనాలు వేస్తేనే ప్రయోజనం ఉంటుందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా ఆంక్షలను సడలిస్తేనే వైరస్ వ్యాప్తి తీవ్రమయ్యే అవకాశం ఉందని చెప్పారు పండా. వ్యాక్సిన్ ద్వారా వచ్చిన ఇమ్యూనిటీ, కొత్త వైరస్ వేరియంట్లు, కొవిడ్ నిబంధనల పరిస్థితులు, వ్యాక్సిన్ కవరేజ్ లాంటి దదఅంశాలెన్నో ఆధారపడి ఉన్నాయి. సెకెండ్ వేవ్ సందర్భంగా తక్కువ కేసులు నమోదైన జిల్లాల్లో థర్డ్ వేవ్‌లో ఎక్కువ కేసులు బయటపడొచ్చని అన్నారు పండా. ఎక్కువ కేసులు బయటపడిన జిల్లాల్లో ఈసారి తక్కువ కేసులు నమోదయ్యే చాన్స్ ఉంటుందని తెలిపారు.