2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పోటీ

2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పోటీ

arvind-kejriwal

AAP to contest 2022 UP assembly elections ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత,ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. 2022లో జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయనున్నట్లు మంగళవారం(డిసెంబర్-15,2020)అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.

ఉత్తరప్రదేశ్ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మారాలని కేజ్రీవాల్ తెలిపారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో మంచి స్కూళ్లు,హాస్పిటల్స్ లేవని కేజ్రీవాల్ తెలిపారు. యూపీ ప్రజలు కరెంట్ కష్టాలను కూడా ఎదుర్కొంటున్నారని అన్నారు. యూపీ ప్రజలు ప్రస్తుత ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారని కేజ్రీ అన్నారు. ఢిల్లీలో ఉన్న చాలామంది యూపీ ప్రజలు…ఉత్తర్​ప్రదేశ్​ లోనూ పోటీ చేయమని సలహాలు ఇచ్చారని… ప్రస్తుత ప్రభుత్వంపై తాము అసంతృప్తితో ఉన్నామని వారు తెలిపారని కేజ్రీవాల్ చెప్పారు.

2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘనవిజయం సాధించి ఈ ఏడాది ప్రారంభంలో మూడవసారి ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని కేజ్రీవాల్ తెలిపారు. 8 ఏళ్లలో ఆప్​ పార్టీ ఢిల్లీలో మూడు సార్లు అధికారంలోకి వచ్చింది. పంజాబ్​లో ప్రధాన ప్రతిపక్షంగా పనిచేసింది. రానున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

మరోవైపు యూపీ ఎన్నికల్లో తాము చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకోవటానికి సిద్ధంగా ఉన్నామని సమాజ్​వాదీ పార్టీ అధినేత అఖిలేశ్​ యాదవ్ అన్నారు. కాగా, మొత్తం 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో 2017 ఎన్నికల్లో బీజేపీ-309, ఎస్పీ-49, బీఎస్పీ-18, కాంగ్రెస్​-7, ఆప్నాదళ్-9 సీట్లు సాధించాయి. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-ఎస్పీ కూటమిగా కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే.