తెల్లకోటుకు సలాం: గాంధీలో కరోనా యోధులపై హెలికాప్టర్లతో పూలవర్షం

  • Published By: srihari ,Published On : May 3, 2020 / 02:10 AM IST
తెల్లకోటుకు సలాం: గాంధీలో కరోనా యోధులపై హెలికాప్టర్లతో పూలవర్షం

దేశవ్యాప్తంగా కరోనా యోధులపై పూలవర్షం కురుస్తోంది. తెల్లకోటుకు సలాం అంటూ ఆస్పత్రుల్లో హెలికాప్టర్ల ద్వారా వాయుసేన పూలవర్షం కురిపించింది. ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. కోవిడ్ చికిత్స అందిస్తున్న డాక్టర్లకు ఎయిర్ ఫోర్స్ పూలవర్షంతో సంఘీభావం తెలిపింది. హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రితో పాటు విశాఖలోని కోవిడ్ ఆస్పత్రిపై కూడా హెలికాప్టర్ల ద్వారా పూలవర్షం కురిపించాయి. 

భారతదేశాన్ని పట్టిపీడుస్తున్న కరోనా వైరస్ మహమ్మారిపై దేశవ్యాప్తంగా ప్రాణాలకు తెగించి పోరాడుతున్నవారికి అరుదైన గౌరవం దక్కింది. ముందుండి నిలబడి కరోనాతో యుద్ధం చేస్తున్న కరోనా వారియర్స్ పై ఆకాశంలో నుంచి పూల వర్షం కురిసింది. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో హెలికాప్టర్ ద్వారా కరోనా యోధులపై పూలవర్షం కురిపించింది భారత వాయుసేన.

ఆదివారం (మే 3, 2020) ఉదయం 9.30 గంటలకు గాంధీ ఆస్పత్రిలో హెలికాప్టర్ ద్వారా వాయుసేన పూలవర్షం కురిపంచింది. దీనికి సంబంధించి శనివారమే ఆస్పత్రి పరిసరాల్లో ట్రయల్ రన్ జరిగింది. కరోనా యోధులు చేస్తున్న కృషికి సంఘీభావాన్ని ప్రకటిస్తూ పూలవర్షం కురిపించాలని త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ పిలుపునిచ్చారు. 

ప్రత్యేక శిక్షణ పొందిన వాయుసేన దళాలు ఆకాశం నుంచి పూలవర్షం కురిపిస్తాయి. గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలోని జయశంకర్‌ విగ్రహం వద్ద వాయుసేన హెలికాప్టర్‌ ద్వారా పూలవర్షం కురిపించింది. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి వైద్యులు, స్టాఫ్‌నర్సులు, పారిశుధ్యం, పారామెడికల్, పోలీస్, నాల్గవ తరగతి ఉద్యోగులు భారీ సంఖ్యలో గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో క్యూలో నిలబడ్డారు. కొవిడ్ బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, సిబ్బందిపై వాయుసేన పూలవాన కురిపించింది.