ప్రభుత్వాన్ని రెండుసార్లు అలర్ట్ చేశాం…స్పైవేర్ పై కేంద్రానికి వాట్సాప్ రిపోర్ట్

  • Published By: veegamteam ,Published On : November 3, 2019 / 01:08 PM IST
ప్రభుత్వాన్ని రెండుసార్లు అలర్ట్ చేశాం…స్పైవేర్ పై కేంద్రానికి వాట్సాప్ రిపోర్ట్

ఇజ్రాయెల్​ స్పైవేర్​ ‘పెగాసస్’పై కేంద్రానికి వాట్సాప్ నివేదిక సమర్పించింది. 121 మంది భారతీయ వినియోగదారులను ఇజ్రాయెల్ స్పైవేర్ పెగసాస్ లక్ష్యంగా చేసుకున్నట్లు సెప్టెంబర్‌లోనే కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు వాట్సాప్ స్పష్టం చేసింది. తాజా వివరణపై  వాట్సాప్​ పూర్తి వివరాలు వెలువరించలేదు. అయితే మే నెలలోనే స్పైవేర్​పై సమాచారం అందించామని, అనంతరం సెప్టెంబర్​లో రెండోసారి ప్రభుత్వ అధికారులను అలర్ట్ చేసినట్టు తెలిపింది. సుమారు 121 మంది భారతీయ వినియోగదారుల వ్యక్తిగత గోప్యతకు ముప్పు వాటిల్లిందని అధికార వర్గాల దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపింది.

అయితే వాట్సాప్ నివేదికపై స్పందించిన ఐటీ శాఖ…గతంలో వాట్సాప్ అందించిన సమాచారం పూర్తి అసంపూర్ణంగా ఉందని, అది సాంకేతిక పరిభాషతో ఉందని తెలిపింది. వాట్సాప్ నివేదికపై పూర్తిస్థాయిలో పరిశీలన చేసి.. తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపింది.

ఇజ్రాయెల్‌కు చెందిన నిఘా సంస్థ ఎన్‌ఎస్‌వో పెగాసస్ అనే స్పైవేర్ టూల్ సాయంతో 20 దేశాల్లోని 1,400 మంది వాట్సాప్ యూజర్లను లక్ష్యంగా చేసుకుని వారి అకౌంట్లను హ్యాక్ చేసినట్టు వాట్సాప్ కంపెనీ గురువారం ఆరోపించిన విషయం తెలిసిందే. ఇందులో భారతీయ వాట్సాప్ యూజర్లు కూడా ఉన్నట్టు మెసేజింగ్ సంస్థ వెల్లడించింది. స్పైవేర్ టూల్ ద్వారా యూజర్ల మొబైల్ ఫోన్లకు మిస్స్ డ్ కాల్స్ ఇచ్చి బాధితులను టార్గెట్ చేసినట్టు వాట్సాప్ ఆరోపించింది. ఇండియాలో స్పైవేర్ తో ప్రభావితమైన బాధిత యూజర్లను ఒక్కొక్కరిని వాట్సాప్ సంప్రదించి వారిని అప్రమత్తం చేసింది. అందులో ఎకడామిక్స్, లాయర్లు, సామాజికవేత్తలు, జర్నలిస్టులు ఉన్నట్టు వాట్సాప్ తెలిపింది. భారత్ లో సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏప్రిల్‌లో రెండు వారాల పాటు గూఢచర్యానికి పాల్పడ్డారని వాట్సాప్ మాతృసంస్థ ఫేస్ బుక్ తెలిపిన విషయం తెలిసిందే.