తస్మాత్ జాగ్రత్త: పెళ్లిళ్లకు అతిథుల్లా వస్తున్న దొంగల గ్రూప్

తస్మాత్ జాగ్రత్త: పెళ్లిళ్లకు అతిథుల్లా వస్తున్న దొంగల గ్రూప్

దర్జాగా పెళ్లికి గెస్ట్‌ల గెటప్‌లో వచ్చి నగలు కాజేసిపోతున్న ఏడుగురు దొంగలను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ట్రూప్ మొత్తానికి బ్యాండ్ బజా బారత్ అనే పేరు కూడా ఉంది. అతి పెద్ద పెళ్లి వేడుకలను మాత్రమే టార్గెట్ చేసి నగలు దొంగిలిస్తుంటారు. ఈ పనికోసం వివరాలు తెలుసుకుని ముందుగానే పేర్లు మార్చుకుని కొన్ని రోజులు ట్రైనింగ్ కూడా తీసుకుంటారు.

వెడ్డింగ్ సీజన్లో ఈ గ్యాంగ్ ఢిల్లీ, ఎన్సీఆర్ మరికొన్ని నార్త్ ఇండియా నగరాల్లో చేతివాటం చూపించారని పోలీసులు చెప్తున్నారు. ఈ పనుల కోసం పిల్లలను కూడా అద్దెకు తీసుకుంటారట. వాళ్లకు ముట్టజెప్పేది కూడా ఎక్కువే. గ్రామాల నుంచి తీసుకొచ్చిన వారికి రూ.10నుంచి రూ.12లక్షల వరకూ చెల్లిస్తారు.



డిసెంబర్ 2న ఈ గ్యాంగ్ లోని ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నగలు దొంగిలించి ఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్ లోని వారి గ్రామానికి వెళ్తుండగా దొరికిపోయారు. రాజ్‌ఘడ్‌లోని జిల్లాలోని గుల్ఖేరీకి చెందిన వారిగా గుర్తించారు. విచారణలో చాలా పెళ్లి వేడుకల్లో వీరు దొంగతనానికి పాల్పడినట్లు తెలిసింది.

పెళ్లి వేడుకల్లోని సీసీ టీవీ ఫుటేజిల ద్వారా.. దొంగతనాలను గుర్తిస్తున్నారు. బ్యాంకెట్ హాల్స్, ఫామ్ హౌజ్ లు, ఇతర పెద్ద వేడుకలల్లో నిందితులు కనిపించినట్లు ఏసీపీ శిబేష్ సింగ్ చెబుతున్నారు. దొంగతనం చేయడానికి ముందు వారంతా పలుమార్లు వేదికలకు వచ్చి వెళ్తుండారు. దీంతో బంధువుల్లో ఓ కంఫర్టబుల్ ఫీలింగ్ తీసుకొస్తారు.

చాలా బాగా డ్రెస్సింగ్ చేసుకోవడంతో గెస్ట్ లతో కలిసిపోయి డిన్నర్ చేస్తూ సమయం కోసం ఎదురుచూస్తుంటారు. జ్యూయలరీ ఉన్న గిఫ్ట్ బ్యాగులను, నగదు సంచులను దొంగిలించి అక్కడి నుంచి మాయం అవుతారు. ఇంటరాగేషన్ లో నిందితులు గ్రామాల నుంచి 9-15సంవత్సరాల మధ్య వయస్సున్న పిల్లలను లీజ్ కు తీసుకున్నట్లుగా తెలిసింది.

వారికి ఉన్న స్కిల్స్ ను బట్టి రూ.10నుంచి రూ.12లక్షల వరకూ చెల్లిస్తారట. ‘ఒకసారి పిల్లవాడ్ని సెలక్ట్ చేసుకుంటే వాళ్లు ఢిల్లీకి తీసుకొచ్చి ఒక నెల పాటు పెళ్లిళ్లలో దొంగతనాలు ఎలా చేయాలో ట్రైనింగ్ ఇస్తారు. వేడుకలలో కొత్తవారితో ఎలా కలిసిపోవాలో నేర్పిస్తారు. ఏ నిమిషంలోనూ, ఒక వేళ దొరికిపోయినా తామెవరో చెప్పకూడదని ముందుగానే ట్రైన్ చేస్తారు’ అని పోలీసులు వెల్లడించారు.

నిందితులను సందీప్(26), హంసరాజ్(21), సంత్ కుమార్(32), కిషన్ (22), బిషాల్(20)గా గుర్తించారు. ఈ గ్రూపుపై ఇప్పటి వరకూ ఎనిమిది కేసులు నమోదైఉన్నాయి. వారి నుంచి రూ.4లక్షల క్యాష్, నగలు, మొబైల్ ఫోన్లు రికవరీ చేసుకున్నారు.