Satya Pal Malik : బీజేపీ మళ్లీ అధికారంలోకి రాదు..గవర్నర్ సంచలన వ్యాఖ్యలు

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తోన్న రైతులకు అనుకూలంగా మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల ఉద్యమంపై మొదటినుంచి సానుకూల వ్యాఖ్యలు

Satya Pal Malik : బీజేపీ మళ్లీ అధికారంలోకి రాదు..గవర్నర్ సంచలన వ్యాఖ్యలు

Gov2

Satya Pal Malik నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తోన్న రైతులకు అనుకూలంగా మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల ఉద్యమంపై మొదటినుంచి సానుకూల వ్యాఖ్యలు చేస్తున్న సత్యపాల్ మాలిక్..చర్చల విషయంలో కేంద్రం తీరును విమర్శించారు.

రాజస్తాన్ లోని ఝుంఝును జిల్లాలో సోమవారం ఒక కార్యక్రమానికి హాజరైన సత్యపాల్ మాలిక్ మీడియాతో మాట్లాడుతూ..రైతుల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని, రైతుల డిమాండ్లు నెరవేర్చకపోతే భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి రాలేదని సత్యపాల్ మాలిక్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం కొందరి మాటలు విని రైతు సమస్యను సాగదీస్తోందని.. ఇలాంటి వారి వల్లే మోదీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు.

రైతుల డిమాండ్లు నెరవేర్చకుంటే ఎన్నికలకు సిద్ధమవుతున్న ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని గ్రామాల్లోకి బీజేపీ నాయకులు ప్రవేశించలేరన్నారు. తాను మీరట్‌కు చెందిన వాడినని..తన ప్రాంతంలోని ఏ గ్రామంలోకి కూడా బీజేపీ నేతలు అడుగుపెట్టలేకపోతున్నారని, మీరట్‌, ముజఫర్‌నగర్‌, బాఘ్‌పట్‌లో ఈ పరిస్థితి ఉందని ఆయన తెలిపారు. రైతులు 10 నెలలుగా ఇళ్లు, కుటుంబాలను వదిలి వీధుల్లో కూర్చున్నారని.. వారి పరిస్థితిని అర్ధం చేసుకోవాలని కోరారు.

రైతులకు దన్నుగా నిలబడేందుకు మీ పదవిని వదులుకుంటారా అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. రైతులకు తాను అండగా ఉంటానన్నారు. పదవిని వదులుకోవాల్సిన అవసరం లేదని, అవసరమైతే ఆ పని చేస్తానని తెలిపారు. రైతు నిరసనల విషయంలో తాను అనేక మందితో గట్టిగా వాదించానని సత్యపాల్ మాలిక్ తెలిపారు. రైతుల కోసం ప్రధాని, హోం మంత్రితో పోరాడానంటూ పేర్కొన్నారు. ఉద్యమంలో మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా ఎవరైనా కోరితే, అందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ సత్యపాల్‌ మాలిక్ స్పష్టంచేశారు. కనీస మద్ధతు ధరకు చటబద్ధమైన హామీ కల్పిస్తే ఆటోమేటిక్‌గా రైతు ఉద్యమం ముగుస్తుందంటూ సత్యపాల్ మాలిక్ సలహా ఇచ్చారు.

లఖింపూర్‌ ఖేరీ ఘటనపై ప్రశ్నించగా.. ఘటన జరిగిన మరుసటి రోజునే అజయ్‌ మిశ్రా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి ఉండాల్సిందని, ఆయన కేంద్ర మంత్రి పదవికి పనికిరారంటూ వ్యాఖ్యానించారు.

సత్యపాల్ మాలిక్ జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా కూడా పనిచేశారు. ఆగస్టు 2018 నుండి అక్టోబర్ 2019 వరకు జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా కూడా పనిచేసిన సత్యపాల్ మాలిక్.. కశ్మీర్ లో తాజా పరిణామాలపై స్పందించారు. తాను జమ్మూ కాశ్మీర్ గవర్నర్‌గా ఉన్న సమయంలో, శ్రీనగర్‌కు 50-100 కిలోమీటర్ల పరిధిలో ఉగ్రవాదులు ఎవరూ ప్రవేశించలేకపోయేవారని, అయితే ఇప్పుడు, శ్రీనగర్‌లో ఉగ్రవాదులు పేద ప్రజలను చంపుతున్నారని.. ఇది నిజంగా బాధాకరం అని సత్యపాల్ మాలిక్ అన్నారు.

ALSO READ CM Burns Power Bills : కరెంట్ బిల్లులు తగులబెట్టిన పంజాబ్ సీఎం