దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్…లక్ష మంది వాలంటీర్లు రెడీ

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్…లక్ష మంది వాలంటీర్లు రెడీ

Central government ready for corona vaccination : కరోనా వ్యాక్సిన్‌ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోన్న భారతీయులకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌ ఇవ్వడానికి కేంద్రం రెడీ అయింది. కరోనాతో 2020 సంవత్సరం అంతా విసిగిపోయిన ప్రజలకు గుడ్ న్యూస్‌ చెప్పబోతోంది. అన్ని అనుకున్నట్లే జరిగితే రెండు కరోనా వ్యాక్సిన్లకు ఈరోజే కేంద్రం గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చే అవకాశలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ -కొవాగ్జిన్‌, ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌లకు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ పచ్చజెండా ఊపొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. ఆక్స్‌ఫర్డ్‌ -ఆస్ట్రాజెనెకా టీకా అత్యవసర వినియోగానికి యునైటెడ్‌ కింగ్‌డమ్‌తో పాటు అర్జెంటినా ఇప్పటికే ఆమోదం తెలిపాయి.

వ్యాక్సిన్ ఆర్మీ రెడీ అయింది. ఈ జనవరిలోనే వ్యాక్సినేషన్‌ స్టార్ట్ అవుతుండడంతో దాదాపు లక్ష మంది వాలంటీర్లు తమ ట్రైనింగ్‌ను పూర్తి చేసుకున్నారు. ఈ మేరకు సంబంధిత రాష్ట్రాలు తమ వాలంటీర్ల లిస్ట్‌ను ఇప్పటికే సిద్ధం చేసుకున్నాయి. సూమారు 130 కోట్ల జనాభా ఉన్న భారత్‌లో వ్యాక్సినేషన్‌ కోసం వాలంటీర్లను రెడీ చేయడం మాములు విషయం కాదు. మిగిలిన దేశాల్లో జనాభా తక్కువ ఉంటుంది. కంట్రోల్ చేయడం ఈజీ అవుతుంది. ఇండియాలో అలా కాదు. టీకా వేయించుకోవడానికి వచ్చిన వారికి ఒక క్రమ పద్ధతిలో వ్యాక్సిన్‌ ఇవ్వడం అంతా తేలిక కాదు. గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వీటిని తట్టుకొని విధులు నిర్వర్తించడం కష్టంతో కూడుకున్న పని.

వ్యాక్సిన్‌ ఆర్మీలో వైద్య సిబ్బంది, మున్సిపల్ వర్కర్లు, పోలీసులు, ఇంకా స్వచ్ఛందంగా ముందుకొచ్చిన ప్రజలు ఉంటారు. సాధారణంగా వ్యాక్సినేషన్‌ సెంటర్లలో వైరస్‌ రిస్క్‌ ఎక్కువగా ఉంటుంది. టీకా కోసం వచ్చిన వారిలో ఎవరకీ కరోనా ఉందో తెలుసుకోవడం వీలు కాదు. తమ ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిసినా కూడా చాలా మంది ప్రజలు.. అందులోనూ యువతీ, యువకులు వాలంటీర్లగా ముందుకొచ్చారు. సంబంధిత సెంటర్లలో విజయవంతంగా ట్రైనింగ్‌ కూడా పూర్తి చేసుకున్నారు. ప్రజలకు సేవ చేయడానికి సిద్ధమయ్యారు.

వ్యాక్సిన్‌ సెంటర్లుకు వచ్చిన దగ్గర నుంచి ప్రజలు బయటకు వెళ్లేవరకు వారికి సాయం చేయడానికి వాలంటీర్లు ఉంటారు. ఐటీ నిపుణుల సైతం ఈ లిస్ట్‌లో ఉన్నారు. వ్యాక్సిన్ వేసుకున్న వారి డేటాను స్టోర్ చేయడంతో పాటు..వ్యాక్సిన్‌ డోస్‌ల వివరాలను వీరు భద్రపరుస్తారు. వ్యాక్సిన్‌ వినియోగానికి ఈరోజే డీసీజీఐ అనుమతిస్తుందని తెలుస్తోంది. రేపటి నుంచి అన్ని రాష్ట్రాల్లో డ్రై రన్ ప్రారంభమవుతుంది. డ్రై రన్ ముగిశాక వ్యాక్సినేషన్‌ మొదలవుతుంది. ఈ నెలలోనే టీకా పడడం గ్యారంటీ కానుంది. ఈ జనవరి నుంచి జూన్ నాటికి 30 కోట్ల మందికి వ్యాక్సిన్‌ డోస్‌ ఇవ్వాలని కేంద్రం టార్గెట్‌గా పెట్టుకుంది. దీని కోసం అవసరమైన వాలంటీర్లను సిద్ధం చేసుకుంది.