Corona Third Wave : థర్డ్ వేవ్.. పిల్లల్లో కనిపించే లక్షణాలు, ఇవ్వాల్సిన మందులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు

థ‌ర్డ్ వేవ్ చిన్న పిల్ల‌ల‌పైనే ప్ర‌భావం చూపుతుందా? ఒక‌వేళ పిల్ల‌ల‌కు క‌రోనా సోకితే వారిలో ఇన్ఫెక్ష‌న్ స్థాయి ఎలా ఉంటుంది? ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

Corona Third Wave : థర్డ్ వేవ్.. పిల్లల్లో కనిపించే లక్షణాలు, ఇవ్వాల్సిన మందులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Corona Third Wave

Corona Third wave : కరోనా థ‌ర్డ్ వేవ్ హెచ్చరికలు అందరిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. కంటి మీద కనుకు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ మూడో వేవ్ తో పిల్ల‌లకు ముప్పు పొంచి ఉందనే వార్త‌లు తల్లిదండ్రులను భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేస్తున్నాయి. ఫస్ట్ వేవ్ వృద్ధుల‌పై ప్ర‌భావం చూపింద‌ని.. రెండో వేవ్‌లో యువ‌కులు బాధితుల‌య్యార‌ని.. ఇక మూడో వేవ్‌లో ఈ క‌రోనా ర‌క్క‌సి చిన్న పిల్ల‌ల‌నే కాటేస్తుంద‌ని ఈ మ‌ధ్య ప్ర‌చారం ఎక్కువైంది. ఇంత‌కీ థ‌ర్డ్ వేవ్ చిన్న పిల్ల‌ల‌పైనే ప్ర‌భావం చూపుతుందా? ఒక‌వేళ పిల్ల‌ల‌కు క‌రోనా సోకితే వారిలో ఇన్ఫెక్ష‌న్ స్థాయి ఎలా ఉంటుంది? ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

భయపెడుతున్న (MIS-C)..
పెద్ద‌ల‌తో పోలిస్తే పిల్ల‌ల్లో కొవిడ్ తీవ్ర‌త త‌క్కువ‌గానే ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. అయితే కొవిడ్-19 అనంత‌రం వ‌చ్చే దుష్ప్ర‌భవాలు మాత్రం పిల్ల‌ల్లో ఎక్కువ‌గా క‌నిపించే అవ‌కాశం ఉందంటున్నారు. ముఖ్యంగా మ‌ల్టీ సిస్టం ఇన్‌ఫ్ల‌మేట‌రీ సిండ్రోమ్ (MIS-C) వ‌చ్చే ఆస్కారం ఉందన్నారు. క‌రోనా సోకిన త‌ర్వాత రెండు నుంచి 4 వారాల‌కు కొంత‌మంది పిల్ల‌ల్లో ఇమ్యూన్‌ డిస్‌రెగ్యులేష‌న్ ఏర్ప‌డ‌వ‌చ్చ‌ని వైద్య‌నిపుణులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇమ్యూన్ డిస్‌రెగ్యులేష‌న్ కార‌ణంగా పిల్ల‌ల్లో రోగ నిరోధ‌క శ‌క్తి త‌గ్గి, ఇత‌ర‌త్రా ఇన్ఫెక్ష‌న్ల‌కు గుర‌య్యే అవ‌కాశం ఉందన్నారు. కానీ ఈ స‌మ‌స్య ఏర్ప‌డే అవ‌కాశాలు చాలా త‌క్కువ అన్నారు‌. ఒక ప‌రిశోధ‌న ప్ర‌కారం.. ల‌క్ష‌మంది పిల్ల‌ల్లో కేవ‌లం 12 కంటే త‌క్కువ మందిలోనే ఇమ్యూన్ డిస్‌రెగ్యులేష‌న్ క‌నిపించింది. అలా అని పిల్ల‌ల విష‌యంలో నిర్ల‌క్ష్యం త‌గ‌దన్నారు. 18 ఏళ్లు నిండిన వారికే ఇప్పుడు క‌రోనా వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఒకవేళ 18 ఏళ్లు నిండిన అంద‌రూ టీకా తీసుకుంటే.. అప్పుడు ర‌క్ష‌ణ వ‌ల‌యం లేని వారు పిల్ల‌లు మాత్ర‌మే అవుతారు. కాబ‌ట్టి వారి విష‌యంలో అప్ర‌మ‌త్త‌త చాలా అవ‌స‌రం అని నిపుణులు చెబుతున్నారు.

దీర్ఘ‌కాలిక వ్యాధుల‌తో బాధ‌ప‌డే పిల్ల‌ల‌ విషయంలో జాగ్రత్త..
దీర్ఘ‌కాలిక వ్యాధుల‌తో బాధ‌ప‌డే పిల్ల‌ల‌పై క‌రోనా తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండొచ్చన్నది నిపుణుల మాట. ముఖ్యంగా ఊపిరితిత్తులు, కిడ్నీలు, కాలేయ సంబంధిత స‌మ‌స్య‌లు, థ‌లసేమియాతో బాధ‌ప‌డే పిల్ల‌లు క‌రోనా బారిన ప‌డే ప్ర‌మాదం ఎక్కువ‌గా ఉందన్నారు. క్యాన్స‌ర్ తో బాధ‌ప‌డే, కీమోథెర‌పీ, రేడియేష‌న్ థెర‌పీ తీసుకుంటున్న పిల్ల‌ల విష‌యంలోనూ అప్ర‌మ‌త్తంగా ఉండాలన్నారు. ఊబ‌కాయం, పోష‌కాహార‌లోపం ఉన్న పిల్ల‌ల విష‌యంలోనూ జాగ్ర‌త్త అవ‌స‌రం అన్నారు.

తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు..
* పెద్ద‌ల‌కు మాదిరిగా పిల్ల‌ల‌కు కూడా నిరంత‌రం మాస్క్ పెట్టే ఉంచాలి.
* వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌త‌, చేతుల్ని ఎప్ప‌టిక‌ప్పుడు శానిటైజ్ చేసుకోవ‌డం, భౌతికదూరం పాటించ‌డం వ‌ల్ల క‌రోనా వైర‌స్ రాకుండా జాగ్ర‌త్త ప‌డొచ్చ‌న్న విష‌యం పిల్ల‌ల‌కు వివ‌రించాలి.
* పిల్ల‌ల‌కు ఇచ్చే ఆహారంలో బీ కాంప్లెక్స్‌, సీ, డీ విట‌మిన్లు, జింక్‌, కాల్షియం, ప్రో బ‌యాటిక్స్‌, ఒమెగా ఫ్యాటీ ఆమ్లాలు వంటి పోష‌కాలు అధికంగా ఉండేలా చూసుకోవాలి.
* పిల్ల‌లు ఆడుకోవ‌డానికి బ‌య‌ట‌కు వెళ్ల‌నివ్వ‌కూడ‌దు. ఇండోర్ గేమ్స్‌కే ప్రాధాన్య‌త ఇవ్వాలి.
* క‌రోనా టీకాలు ఇప్ప‌టివ‌ర‌కు పిల్ల‌ల కోసం అందుబాటులోకి రాలేదు. కాబ‌ట్టి ముందు జాగ్ర‌త్త‌గా సీజ‌న‌ల్ వ్యాధులు రాకుండా ఇన్‌ఫ్లుయెంజా టీకా వేయించ‌డం మంచిది.
* పిల్ల‌ల్లో సాధార‌ణం నుంచి ఓ మోస్త‌రు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే 10 రోజులు, తీవ్ర ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే 20 రోజుల పాటు ఐసోలేష‌న్‌లో ఉంచాలి.
* ఐసోలేష‌న్‌లో ఉంచాల్సి వ‌చ్చిన‌ప్పుడు పిల్ల‌ల‌కు పెద్ద‌ల స‌పోర్ట్ అవ‌స‌రం. కాబ‌ట్టి ఆ స‌మ‌యంలో త‌ల్లిదండ్రులు పిల్ల‌ల ద‌గ్గ‌ర ఉండొచ్చు.
క‌రోనా సోకిన పిల్ల‌లను ఎట్టిప‌రిస్థితుల్లో వ‌య‌సు పైబ‌డిన వారి దగ్గరికి వెళ్ల‌నీవకూడ‌దు.

పిల్లల్లో కరోనా లక్షణాలు..
జ్వరం, దగ్గు, అలసట, ఊపిరిలో ఇబ్బంది, ముక్కుదిబ్బడ, గొంతులో మంట, కండరాల నొప్పులు, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, కడుపులో నొప్పి

ఇవ్వాల్సిన మందులు:
జ్వరం : పారాసిటమాల్‌ 10-15 ఎంజీ/కేజీ/డోసు (ప్రతి 4-6 గంటలకు ఒకసారి ఇవ్వొచ్చు)
గొంతులో మంట, దగ్గు : గోరువెచ్చని నీటిని పుకిలించడం
ఆహారం : నీరు, పండ్ల రసాలతో పాటు పోషకాలతో కూడిన ఆహారం

తేలిక‌పాటి/ ల‌క్ష‌ణాలు లేని పిల్ల‌ల‌కు చికిత్స ఎలా?
కరోనా సోకిన పిల్లల లక్షణాలను బట్టి తేలికపాటి, మధ్యస్థాయి, తీవ్రమైన అని మూడు విభాగాలుగా విభజించారు. జ్వరం, జలుబు వంటి స్వల్ప లక్షణాలు ఉండి ఇతర ఆరోగ్య సమస్యలేమీ లేని పిల్లలకు లేదా లక్షణాలు లేని పిల్లలకు ఇంట్లోనే చికిత్స అందించొచ్చు.

ఆస్ప‌త్రికి ఎప్పుడు తీసుకెళ్లాలి
ఆయాసం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, తరుచుగా విరేచనాలు, వాంతులు, కడుపునొప్పితో పాటు ఊపిరితిత్తులు, గుండెకు సంబంధించిన సమస్యలున్న చిన్నారుల్లో వైరస్‌ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి తరలించాలి. కొందరు పిల్లల్లో కరోనా.. మల్టీసిస్టమ్ ఇన్‌ఫ్ల‌మేట‌రీ సిండ్రోమ్ సమస్యకు దారి తీస్తోంది. కాబట్టి పిల్లలు ఆందోళనతో గందరగోళంగా ప్రవర్తించినా డాక్టర్లను సంప్రదించడం మంచిది. మామూలు జలుబు, జ్వరం ఉంటే పిల్లలు ఒకట్రెండు రోజుల్లో కోలుకుంటారు. రోజుల తరబడి అవే లక్షణాలుంటే మాత్రం ఆసుపత్రికి తీసుకెళ్లాలని నిపుణులు సూచించారు.