CoronaVirus India : భారత్‌లో మళ్లీ భయానక పరిస్థితులు.. 24గంటల్లో 97వేల కరోనా కొత్త కేసులు, 446 మరణాలు

దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కంటిన్యూ అవుతోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. సోమవారం(ఏప్రిల్ 5,2021) 96వేల 982 మంది వైరస్ బారినపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 1,29,12,090కి చేరింది. ప్రస్తుతం దేశంలో గతేడాది(2020) సెప్టెంబర్ నాటి కొవిడ్ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొత్తగా 446 మంది కరోనాకు బలయ్యారు. మొత్తం మరణాల సంఖ్య 1,65,547కి చేరింది.

CoronaVirus India : భారత్‌లో మళ్లీ భయానక పరిస్థితులు.. 24గంటల్లో 97వేల కరోనా కొత్త కేసులు, 446 మరణాలు

India Corona

Coronavirus India Live Updates : దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కంటిన్యూ అవుతోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. సోమవారం(ఏప్రిల్ 5,2021) 96వేల 982 మంది వైరస్ బారినపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 1,29,12,090కి చేరింది. ప్రస్తుతం దేశంలో గతేడాది(2020) సెప్టెంబర్ నాటి కొవిడ్ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొత్తగా 446 మంది కరోనాకు బలయ్యారు. మొత్తం మరణాల సంఖ్య 1,65,547కి చేరింది.

కేసుల్లో భారీ పెరుగుదల కారణంగా.. యాక్టివ్ కేసుల సంఖ్యా పెరుగుతోంది. నిన్నటికి 7లక్షల 88వేల 223 యాక్టివ్ కేసులుండగా.. ఆ రేటు 5.89 శాతానికి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం(ఏప్రిల్ 6,2021) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 50వేల 143 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు కోటీ 17 లక్షల పైచిలుకు మంది ఈ మహమ్మారిని జయించగా..రికవరీ రేటు 92.80 శాతానికి పడిపోయింది.

మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కంటిన్యూ:
మహారాష్ట్రలో కరోనా విజృంభణ తీవ్ర స్థాయిలో ఉంది. గడిచిన 24 గంటల్లో 47వేల 288 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలగా..155 మంది చనిపోయారు. మొత్తం పాజిటివ్ కేసులు 30లక్షల 57వేల 885 కి చేరగా..25లక్షల 49వేల 075 మంది కోలుకున్నారు. 4లక్షల 52వేల 777 మంది వైరస్‌తో బాధపడుతున్నారు.

25కోట్ల మార్క్ దాటిన కరోనా పరీక్షలు:
దేశవ్యాప్తంగా కొవిడ్ నిర్ధారణ పరీక్షలు 25కోట్ల మార్కును దాటినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. నిన్న 12,11,612 మంది నమూనాలను సేకరించినట్లు తెలిపింది.

8కోట్ల మార్క్ దాటిన వ్యాక్సిన్ డోసుల పంపిణీ:
దేశవ్యాప్తంగా మూడు దశల్లో భాగంగా నడుస్తోన్న టీకా కార్యక్రమం కింద ఏప్రిల్ 5 నాటికి 8కోట్ల 31లక్షల 10వేల 926 మందికి కరోనా వ్యాక్సిన్ అందింది. నిన్న 43,00,966 మందికి కేంద్రం టీకా పంపిణీ చేసింది. కొవిడ్ ఉద్ధృతి తీవ్రంగా ఉండటంతో.. వ్యాక్సిన్ కార్యక్రమ పరిధిని విస్తృతం చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అభ్యర్థిస్తున్నాయి.

తెలంగాణలో 1500కి చేరువలో కరోనా కేసులు:
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా 15వందలకు చేరువలో కొత్త కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. నిన్న(ఏప్రిల్ 5,2021) రాత్రి 8గంటల వరకు 62వేల 350 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 1,498 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనాతో మరో ఆరుగురు మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,729కి చేరింది.

కరోనా బారి నుంచి నిన్న 2452 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,03,013కి చేరింది. ప్రస్తుతం 9,993 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వారిలో 5వేల 323 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 313 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం(ఏప్రిల్ 6,2021) ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది.

ఏపీలో కరోనా ఉగ్రరూపం:
ఏపీలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. కేసుల తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. తాజాగా 24 గంటల వ్యవధిలో 30వేల 678 నమూనాలను టెస్ట్ చేయగా 1,326 మందికి కరోనా సోకినట్లు తేలింది. తాజా సంఖ్యతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,09,002 కి చేరింది. కరోనాతో మరో ఐదుగురు మరణించారు. కృష్ణా జిల్లాలో ఇద్దరు, అనంతపురం, చిత్తూరు, గుంటూరులో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాతపడ్డారు. తాజా మరణాలతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 7వేల 244కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 911 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 10వేల 710 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,52,39,114 నమూనాలను పరీక్షించారు.

చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 282 మందికి వైరస్ పాజిటివ్ అని తేలింది. గుంటూరు జిల్లాలో 271, విశాఖ జిల్లాలో 222, నెల్లూరు జిల్లాలో 171 కరోనా కేసులు వెలుగుచూశాయి. కృష్ణా జిల్లాలో 138, ప్రకాశం జిల్లాలో 54, శ్రీకాకుళం జిల్లాలో 52, కడప జిల్లాలో 31, తూర్పుగోదావరి జిల్లాలో 29, అనంతపురం జిల్లాలో 23 మందికి వైరస్ సోకింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం(ఏప్రిల్ 5,2021) బులెటిన్‌ రిలీజ్ చేసింది.