ఢిల్లీలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైంది…కేజ్రీవాల్

  • Published By: venkaiahnaidu ,Published On : September 24, 2020 / 08:39 PM IST
ఢిల్లీలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైంది…కేజ్రీవాల్

ఢిల్లీలో కరోనా వైరస్ రెండోసారి విజృంభిస్తోందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఈ నెల ప్రారంభం నుంచి ఒక్కసారిగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని, ఇది కచ్చితంగా వైరస్ రెండోసారి విజృంభించిందనడానికి సంకేతమన్నారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఢిల్లీలో కరోనా రెండో దశ ఉచ్ఛ స్థితికి చేరుకుందన్నారు.


సెప్టెంబర్ నెల ప్రారంభంలో అనూహ్యంగా రోజుకు 4 వేల కేసులు దాటడం సెకండ్ వేవ్ కు ఉదాహరణగా కేజ్రీవాల్ చెప్పారు. కరోనా వైరస్ రెండో దశ ప్రారంభమైందని ప్రకటించిన తొలి రాష్ట్రం ఢిల్లీ కావడం విశేషం. దేశ రాజధానిలో ఇంతలా కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గించే పరిణామమని ఆయన చెప్పారు.ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, మాస్క్ ధరించి, భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అత్యవసరమైతే తప్పా అనవసరంగా బయటకు రావద్దని చెప్పారు.

సెప్టెంబరు 16న రికార్డుస్థాయిలో దాదాపు 4,473 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యిందని, తర్వాత నుంచి పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయని అన్నారు. .అయితే గత 24 గంటల్లో మళ్లీ 3 వేల 7 వందల కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో సెప్టెంబర్ 9వ తేదీన తొలిసారి 4 వేల కేసులు దాటాయి. అదే రోజు 20 మంది మరణించారు.


ఇప్పటి వరకు ఢిల్లీలో సెప్టెంబరు 16న నిర్ధారణ అయిన 4,473 కేసులే అత్యధికం. సెప్టెంబరు 15 నుంచి 19 వరకు ఢిల్లీలో కరోనా కేసులు, మరణాలు వరుసగా 4,263 (36 మరణాలు), 4,473 (33), 4,432 (38), 4,127 (30), 4,071 (38) నమోదయ్యాయి. టెస్టింగ్ సామర్థ్యం పెంచడవల్లే పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు.

కాగా, ఇప్పటి వరకు ఢిల్లీలో మొత్తం కేసులు 2 లక్షలు దాటగా.. 4,638 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఇప్పటివరకూ 57 లక్షల కేసులు దాటాయి. 91 వేల మంది మృతి చెందారు. గత 24 గంటల్లో అయితే 1129 మంది ప్రాణాలు కోల్పోయారు.