రైతుల ట్రాక్టర్ ర్యాలీకి అనుమతి

రైతుల ట్రాక్టర్ ర్యాలీకి అనుమతి

tractor-rally-delhi

Delhi Police gave Permission for farmers’ tractor rally on Republic Day : కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు రెండు నెలలుగా ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జనవరి 26 రిపబ్లిక్ డే నాడు తలపెట్టిన రైతుల ట్రాక్టర్ ర్యాలీకి అనుమతి లభించింది. అన్నదాతల ట్రాక్టర్ ర్యాలీకి ఢిల్లీ పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. ఢిల్లీ రింగ్ రోడ్ పరిధిలో ర్యాలీ నిర్వహించుకోవాలని సూచించారు. కమిటీ సూచనలు పాటించాలని రైతు సంఘాలు విజ్ఞప్తి చేశాయి. కాసేపట్లో రైతు సంఘాల నేతలు విధివిధానాలు ప్రకటించనున్నారు.

అంతకముందు రిపబ్లిక్ డే రోజు రైతులు నిర్వహించ తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీకి ఢిల్లీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. భద్రతా కారణాల రీత్యా ఢిల్లీ ఔటర్ రింగ్‌ రోడ్డుపై ట్రాక్టర్ ర్యాలీ నిర్వహణకు పోలీసులు అంగీకరించలేదు. రైతులతో ర్యాలీపై చర్చించిన పోలీసులు రిపబ్లిక్ డే భద్రతను దృష్టిలో ఉంచుకుని అనుమతి ఇవ్వడం లేదని తెలిపారు.

అయితే పోలీసులు అనుమతించకపోయినప్పటికీ ట్రాక్టర్ పరేడ్ నిర్వహించి తీరుతామని రైతులు స్పష్టం చేశారు. ర్యాలీ శాంతియుతంగా జరుగుతుందని, సెంట్రల్ ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌కు ఆటంకం కలగబోదని రైతులు పోలీసులకు వివరించారు.

రైతులు నిర్వహించ తలపెట్టిన ట్రాక్టర్ల పరేడ్‌కు అనుమతి నిరాకరించాలని కోరుతూ ఢిల్లీ పోలీసులు, కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అయితే ఆ అంశం తమ పరిధిలోనిది కాదని, అనుమతి ఇవ్వాలా..లేదా అన్నది ఢిల్లీ పోలీసులు తేల్చుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు రైతుల ట్రాక్టర్ ర్యాలీకి షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు.