EPF వడ్డీ రేటులో కోత ?

EPF వడ్డీ రేటులో కోత ?

EPFO : ఉద్యోగుల భవిష్య నిధి (EPF) డిపాజిట్లపై వడ్డీని మార్చి 04వ తేదీన ప్రకటించే అవకాశం ఉంది. ఈ దఫా వడ్డీ రేటును తగ్గించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. సంస్థకు చెందిన కేంద్ర ధర్మకర్తల బోర్డు శ్రీనగర్ లో సమావేశం కానుంది. కేంద్ర ధర్మకర్తల బోర్డుకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఛైర్మన్ గా వ్యవహరిస్తారు. కొవిడ్ 19 మహమ్మారితో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా చందాదారులు భారీగా నగదును ఉపసంహరించుకోవడం, అదే సమయంలో డిపాజిట్లు తగ్గిపోవడం వంటి కారణాల వల్ల ఈపీఎఫ్ వో ఈ చర్యను చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. గత ఏడాది డిసెంబర్ వరకు దాదాపు రెండు కోట్ల మంది ఈపీఎఫ్ వో వినియోగదారులు రూ. 73 వేల కోట్లను వెనక్కి తీసుకున్నారని తెలుస్తోంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మార్చి 31 ఇది మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. 2018 – 19లో రూ. 81 వేల కోట్లను చందాదారులు వెనక్కి తీసుకోగా..2020 – 21లో అంతకుమించిన స్థాయిలో ఉపసంహరణలు ఉండొచ్చని అంచనా. 2019 – 20 సంవత్సరానికి వడ్డీ రేటును 8.5 శాతంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 2018 – 19లో అది 8.65 శాతంగా ఉండేది. EPF లో ఉద్యోగుల వాటా ఏడాదికి రూ. 2.5 లక్షలు దాటితే..వడ్డీపై పన్ను విధించడాన్ని అధికవర్గాలు సమర్థిస్తున్నాయి. 8.5 శాతం వరకు వడ్డీకి హామీ ఉండడంతో అధిక సంఖ్యలో ఉద్యోగులు కోట్ల రూపాయలు ఈపీఎఫ్ లో ఉంచేస్తున్నట్లు వెల్లడించాయి. ఈపీఎఫ్ అనేది కార్మికులకు, వారిపై ఆధారపడే వారి కోసమని..కొందరు నికరంగా లభించే వడ్డీ కోసం ఏటా రూ. కోటి, రూ. 2 కోట్లు సైతం భవిష్య నిధిలో పెడుతున్నారని తెలిపాయి.