దేశవ్యాప్తంగా భగ్గుమంటున్న ఎండలు… ఐదు రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్

  • Published By: srihari ,Published On : May 24, 2020 / 03:53 PM IST
దేశవ్యాప్తంగా భగ్గుమంటున్న ఎండలు… ఐదు రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్

దేశ వ్యాప్తంగా ఎండలు భగ్గుమంటున్నాయి. ఉత్తరభారతంలో ఎండలు మరీ తీవ్రంగా ఉన్నాయి. మండుటెండలకు జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీతో సహా చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదు అయింది. రాజస్థాన్ లోని చురు జిల్లాలో అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. దీంతో వాతావరణ శాఖ ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చంఢీఘర్, రాజస్థాన్ లలో రెడ్ అలర్ట్ జారీ చేసింది. వేడి తీవ్ర అధికంగా ఉండటంతో ఈ ఐదు రాష్ట్రాల్లో రెండు రోజుల కోసం వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. 

ఈ ఏడాది మొదటిసారి వాతావరణ శాఖ ఎండ తీవ్రతలకు సంబంధించి రెడ్ అలర్ట్ జారీ చేసింది. దేశ వ్యాప్తంగా ఎండలు తీవ్ర స్థాయిలో పెరిగిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ల నుంచి బయటికి రావొద్దని ముఖ్యంగా అవసరం అయితేనే బయటకు రావాలని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వడ గాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఇటు యూపీలో కూడా ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. 

ఉత్తరభారత దేశంతోపాటు దక్షిణ భారతదేశం, మధ్యభారత దేశం మీదుగా వీచే వడ గాలులు ముఖ్యంగా వచ్చే ఐదు రోజులపాటు ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. 
రాజస్థాన్, చంఢీఘర్, ఢిల్లీతోపాటు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ, తెలంగాణలో కూడా వడగాలులు ప్రభావం అధికంగా ఉంటుందని, 40 డిగ్రీల ఉష్ణోగ్రతపైన ఎండ తీవ్రత ఉండటంతోపాటు వడగాలుల తీవ్రతతో వడదెబ్బ తగిలే అవకాశముంది కాబట్టి ప్రజలు అప్రమత్తం ఉండాలని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 

చత్తీస్ ఘడ్, ఒడిశా, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ, కర్నాటకలో వచ్చే మూడు నాలుగు రోజులపాటు వడగాలుల ప్రభావం 40 డిగ్రీల ఉష్ణోగ్రతోపాటు ఇక్కడ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. 

ఈశాన్య భారతంలో ముఖ్యంగా మరోరకమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. 
ఉత్తరభారతదేశం, దక్షిణ భారతదేశంలో ఎండల తీవ్రత ఉంటే ఈశాన్య భారతంలో మాత్రం రెండు, మూడు రోజుల్లో నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.