ముంబై పోలీసుల కొత్త ఐడియా: పూరీ జగన్నాధ్‌కి బాగా నచ్చేసింది

  • Published By: vamsi ,Published On : January 31, 2020 / 11:13 PM IST
ముంబై పోలీసుల కొత్త ఐడియా: పూరీ జగన్నాధ్‌కి బాగా నచ్చేసింది

సిగ్నల్‌ ముందు వెయిట్‌ చేసే కార్లన్నీ మోత చేస్తే సిగ్నల్స్‌ గ్రీన్ లోకి మారిపోతాయా? అసలు తోటివాహనాల ఇబ్బందుల్ని గుర్తించకుండా, ట్రాఫిక్‌ రూల్స్‌ని గౌరవించకుండా – మనం ఏదోలా ముందుకి పోవాలనుకోవడం పచ్చి స్వార్థం. అంతేకాదు అనవసరంగా హార్న్‌ కొట్టడం ఎదుటి వాహనాన్ని అవమానపరచడమే! ఏ కారణం లేకుండా వాళ్లు అలా వాహనాన్ని నిలపరు కదా? ఈ మాత్రం ఆలోచన లేకుండా హారన్ సౌండ్లు మ్రోగించేవాళ్లకు ముంబై పోలీసులు చెక్ పెట్టారు. 

అదే డెసిబెల్‌ మీటర్‌ – లింక్డ్‌ ట్రాఫిక్‌ సిగ్నల్స్‌.. ఇప్పుడు ముంబయిలో – ట్రాఫిక్‌లో ఆగిన వాహనాలు సౌండ్‌ చేయకుండా వీలైనంత మౌనంగా ఉండాలి. పదే పదే హార్న్‌ కొట్టకూడదు. కొడితే? ధ్వనికాలుష్యం పెరుగుతుంది. వాహనాలు చేసే ధ్వనికాలుష్యం 85 డెసిబెల్స్‌ దాటిందనుకోండి. సిగ్నల్‌ రిసెట్‌ అయిపోతుంది. అంటే – రెడ్‌ సిగ్నల్‌ 90 సెకన్లు పడాలనుకోండి. రిసెట్‌ అయిపోయి మరో 90 సెకన్ల పాటు… వేచి చూడాల్సిందే! మళ్లీ ధ్వని కాలుష్యం పెరిగితే మళ్లీ రిసెట్‌… ట్రాఫిక్‌ సిగ్నల్‌ గ్రీన్‌లోకి మారడానికి ఇంకా లేట్ అవుతుంది. 
 
ట్రాఫిక్‌లో వాహనాలు నడిపే వ్యక్తులు సహనంగా ఉంటేనే ముందుకు వెళ్లగలరు. ట్రాఫిక్‌‌లో కాస్త ఓపికా సహనం ఉండాలి కదా మరి అంటూ పోలీసులు ఈ ఏర్పాటు చేశారు.  ఈ దెబ్బకి ముంబై ప్రయాణికులు సహనం అలవాటు చేసుకుంటారని పోలీసులు భావిస్తున్నారు. పైగా సిటీలో ధ్వని కాలుష్యం కూడా తగ్గుతుంది. భలే ఐడియా.  ఈ ఐడియా దర్శకుడు పూరి జగన్నాధ్ కి కూడా తెగ నచ్చేసింది. ఈ మేరకు ఓ వీడియోని తన తన ట్విట్టర్ లో విడుదల చేశాడు. ముంబై పోలీసులను పొగుడుతూ.