లేటెస్ట్ కరోనా రిపోర్ట్ : మరణాల రేటు అంచనాల కంటే తక్కువగా ఉంటుంది

  • Published By: venkaiahnaidu ,Published On : April 1, 2020 / 03:51 PM IST
లేటెస్ట్ కరోనా రిపోర్ట్ : మరణాల రేటు అంచనాల కంటే తక్కువగా ఉంటుంది

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 9లక్షల కరోనా వైరస్(COVID-19)కేసులు నమోదయ్యాయి. ఇక మరణాల సంఖ్య 43వేలు దాటింది. అయితే రోజురోజుకీ విపరీతంగా పెరుగుతూ ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ మహమ్మారితో ముందుగా అంచనా వేసిన స్ధాయిలో ప్రాణాలకు ముప్పు ఉండదని  తాజా సర్వేలో వెల్లడైంది.

భారత్ లో కూడా కరోనా కేసుల సంఖ్య 1600 దాటింది. మరణాల సంఖ్య కూడా 50దాటింది. బుధవారం(ఏప్రిల్-1,2020) ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 152కి చేరింది. గడిచిన 24గంట్లలోనే 32మందకి కరోనా వచ్చినట్లు నిర్థారణ అయింది. ఇక తమిళనాడులో ఇవాళ ఒక్కరోజే 110 కేసులు నమోదయ్యాయి. అయితే ఇవాళ తమిళనాడు,ఢిల్లీ సహా పలురాష్ట్రాల్లో నమోదైన కేసుల్లో 90శాతం వరకు ఢిల్లీలోని నిజాముద్దీన్ లో జరిగిన తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి హాజరైనవారే.

అయితే COVID-19 మరణాల రేటు ఇప్పటివరకూ వేసిన అంచనాల కంటే చాలా తక్కువగా ఉంటుందని లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురితమైన తాజా అథ్యయనం తెలిపింది. చైనాలో కరోనా వైరస్‌ బారిన పడిన వారితో పాటు ఈ మహమ్మారికి కేంద్ర బిందువుగా మారిన వుహాన్‌లో రాకపోకలు సాగించిన వారిపై  బ్రిటిష్‌ పరిశోధకులు ఈ అథ్యయనం చేపట్టారు. చైనాలో కరోనా వైరస్‌ కేసులను సమగ్రంగా విశ్లేషించిన మీదట పరిశోధకులు ఈ వివరాలు వెల్లడించారు.

కరోనా వైరస్‌ నిర్ధారణ అయిన, నిర్ధారణ కాని కేసులన్నింటిలో మరణాల రేటు కేవలం 0.66 శాతంగా ఈ అథ్యయనం గుర్తించింది. నిర్ధారణైన కరోనా కేసుల్లో మరణాల రేటు 1.38 శాతంగా పేర్కొంది. అయితే కరోనా వైరస్‌ నిర్ధారించిన కేసుల్లో మరణాల రేటును గతంలో అధికారులు 2 నుంచి 8 శాతం మధ్య ఉండవచ్చని అంచనా వేయడం గమనార్హం. ఇక మొత్తం కేసుల్లో మరణాల రేటును 0.2 నుంచి 1.6 శాతంగా అంచనా వేయగా తాజా సర్వేలో ఇది 1.38 శాతంగా వెల్లడైంది.