నిరంకుశత్వం వైపు పయనిస్తోన్న భారత్ : డెమోక్రసీ రిపోర్ట్

నిరంకుశత్వం వైపు పయనిస్తోన్న భారత్ : డెమోక్రసీ రిపోర్ట్

India Now As

INDIA భారతదేశం క్రమంగా ‘నిరంకుశత్వం’ వైపు పయనిస్తుందని స్వీడన్‌కు చెందిన V-DEM(వెరైటీస్‌ ఆఫ్‌ డెమోక్రసీ)ఇన్‌స్టిట్యూట్‌ విడుదల చేసిన నివేదిక తెలిపింది. “విస్తృతమవుతున్న నియంతృత్వం(Autocratisation goes viral)” అనే టైటిల్ తో ఐదవ వార్షిక డెమోక్రసీ రిపోర్ట్ ను వీ-డెమ్ విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా 202 దేశాలలో 1789 నుంచి 2020 వరకు ప్రజాస్వామ్యంపై దాదాపు 30 మిలియన్ల డేటా పాయింట్లను వీ-డెమ్‌ పొందుపర్చింది.

V-DEM నివేదిక ప్రకారం…ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం నుంచి ‘ఎన్నికల నిరంకుశత్వం’ స్థాయికి భారత్ పడిపోయింది. భారత దేశం ప్రస్తుతం.. పాకిస్థాన్‌ తరహా నిరంకుశత్వంలో ఉందని.. ఇక్కడి పరిస్థితి బంగ్లాదేశ్‌ కంటే అధ్వానంగా ఉందని తెలిపింది. భారత్‌లో మీడియాపై ‘అణచివేత’ ఉందని వివరించింది. పరువునష్టం, దేశద్రోహం చట్టాలను మోడీ ప్రభుత్వం అధికంగా వినియోగిస్తుందని రిపోర్ట్ తెలిపింది. కేంద్రంలో మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచే దేశంలో ప్రజాస్వామ్యం తగ్గిపోయి ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించింది. కాగా, భారత్‌ ‘పాక్షిక స్వేచ్ఛ’ స్థాయికి దిగజారిందని అమెరికాకు చెందిన ఫ్రీడమ్‌ హౌస్‌ సంస్థ ఓ నివేదికలో పేర్కొన్న వారం రోజుల్లోనే వి-డెమ్‌ నివేదిక వెల్లడవటం గమనార్హం.

విమర్శలను సహించని మోడీ ప్రభుత్వం

2013లో భారత్‌లో యూపీఏ-2 పాలన ముగిసే సమయానికి ప్రజాస్వామ్యం విషయంలో భారత్‌ స్కోరు 0.57 (0-1 స్కేలుపై ) తో ఆల్‌ టైం హైగా ఉన్నది. అయితే, కేంద్రంలో మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితి మరింత దిగజారింది. 2020 ముగింపునాటికి ఆ స్కోరు 0.34కు పడిపోయిందని వి-డెమ్‌ విశ్లేషించింది. ఇందులో ఎక్కువ శాతం పతనం.. 2014 తర్వాత, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాని హిందుత్వ జాతీయవాద పోకడల కారణంగానే సంభవించిందని వీ-డెమ్‌ తన నివేదికలో పేర్కొంది. ఆంక్షల (సెన్సార్‌షిప్‌) ప్రాతిపదికనే తీసుకుంటే భారత్‌.. పాక్‌ వలే నిరంకుశత్వంలో ఉంది. ఈ విషయంలో పొరుగునున్న బంగ్లాదేశ్‌, నేపాల్‌ కంటే భారత్‌లో పరిస్థితి అధ్వానం అని పేర్కొంది. మోడీ కంటే ముందటి ప్రభుత్వాలు ఆంక్షల అమలును అతి తక్కువగా వినియోగించేవని పేర్కొంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం విమర్శకుల నోళ్లు మూయించేందుకు దేశ ద్రోహం, పరువు నష్టం కేసుల బనాయింపు, ఎదురుదాడిని ఎక్కువగా నమ్ముతోందని వి-డెమ్‌ నివేదికలో ఆరోపించింది. ఇప్పటివరకు 7 వేల మందిపైగా విమర్శకులపై దేశద్రోహం కేసులు నమోదు చేసిందని పేర్కొంది.

జర్నలిస్టులు, పౌర నాయకులపై ఉక్కుపాదం

అలాగే, దేశంలో జర్నలిస్టుల గొంతులు నొక్కడానికి పరువునష్టం, పౌర సమాజాన్ని ఎదుర్కోవడానికి ఉపా(Unlawful Activities Prevention Act) వంటి చట్టాలను మోడీ ప్రభుత్వం ప్రయోగిస్తోందనీ, ఇవన్నీ రాజ్యాంగ సెక్యులరిజం స్ఫూర్తికి వ్యతిరేకమని వీ-డెమ్‌ పేర్కొంది. ఆఖరుకు విద్యార్థుల నిరసనలను అణచివేతకు కూడా ఉపా చట్టాన్ని వాడుకున్నారని ఆరోపించింది. పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న విద్యార్థులను విశ్వవిద్యాలయ వర్గాలు శిక్షించాయని వివరించింది. ఒకపక్క, పౌర సమాజం అణచివేతను ఎదుర్కోంటే..మరోపక్క, హిందూత్వ మూమెంట్ కు సంబంధించిన సంస్థలకు స్వేచ్ఛ లభించిందని వివరించింది. దేశంలో సివిల్‌ సొసైటీ ఆర్గనైజేషన్స్‌ (సీఎస్‌ఓ)లకు అడ్డుకట్ట వేయడానికి విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ)ను బీజేపీ అధికంగా ప్రయోగిస్తోందని పేర్కొంది.

పడిపోతున్న స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశాల సంఖ్య
ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశాల సంఖ్య గడిచిన 10ఏళ్లలో.. 41 దేశాల నుంచి 32 దేశాలకు తగ్గిపోయిందని నివేదిక తెలిపింది. ప్రపంచ జనాభాలో మూడో వంతు అంటే 260 కోట్ల మంది జనాభాను కలిగిన 25 దేశాల్లో నిరంకుశత్వం వేగంగా పెరుగుతున్నదని వీ-డెమ్ రిపోర్ట్ పేర్కొంది.