చిన్న వయస్సులోనే సీఎం…ఎవరీ హేమంత్ సోరెన్?

  • Published By: venkaiahnaidu ,Published On : December 23, 2019 / 01:01 PM IST
చిన్న వయస్సులోనే సీఎం…ఎవరీ హేమంత్ సోరెన్?

ఇవాళ విడుదలైన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి ఘన విజయం సాధించింది. సీఎంగా హేమంత్ సోరెన్(44)ను ఇప్పటికే కూటమి ప్రకటించింది. దేశంలో అత్యంత తక్కువ వయస్సులో సీఎంగా ఇప్పటికే పనిచేసిన హేమంత్ సోరెన్ ఇప్పుడు మరోసారి జార్ఖండ్ సీఎంగా ప్రమాణస్వీకారానికి రెడీ అయ్యారు. 2013 జులై నుంచి 2014 డిసెంబర్ వరకు జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ బాధ్యతలు నిర్వహించిన విషయం తెలిసిందే.

అసలు ఎవరీ హేమంత్ సోరెన్?
ఆగస్ట్-10,1975లో సిబు సోరెన్,రూపీ దంపతులకు నీమ్రా గ్రామంలో హేమంత్ సోరెన్ జన్మించారు. హేమంత్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేశాడని ఆయన సన్నిహితులు చెబుతారు. అయితే హేమంత్ మాత్రం తన చదువు ఇంటర్మీడియట్ వరకే సాగిందని 2005,2009 ఎన్నికల సమయంలో దాఖలు చేసిన తన నామినేషన్ పత్రాల్లో హేమంత్ తెలిపారు. కేంద్రమంత్రి,జార్ఖండ్ సీఎం గా పనిచేసిన తండ్రి సిబు సోరెన్ ప్రోత్సాహంత్ 2005లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హేమంత్ తొలి ప్రయత్నంలోనే ఫెయిల్ అయ్యాడు. 2005 అసెంబ్లీ ఎన్నికల్లో దుమ్కా స్థానం నుంచి జేఎంఎం అభ్యర్థిగా పోటీ చేసిన హేమంత్ జేఎంఎం రెబల్ అభ్యర్థి స్టీఫెన్ మరాండి చేతిలో ఓడిపోయాడు. అయితే సిబు సోరెన్ వారసుడిగా అప్పటివరకు ప్రొజెక్ట్ అయిన తన సోదరుడు దుర్గా ఆకస్మిక మరణంతో 2009లో హేమంత్ సోరెన్ జేఎంఎం సీనియర్ లీడర్ షిప్ బాధ్యతలు భుజాన వేసుకున్నాడు.

జూన్-24,2009న రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన హేమంత్ సోరెన్..ఆ తర్వాత జరిగిన కొన్ని రాజకీయ పరిణామాల కారణంగా జనవరి-4,2010న రాజ్యసభ ఎంపీగా తప్పుకున్నారు. 2010 సెప్టెంబర్ లో అర్జున్ ముండా నేతృత్వంలోని బీజేపీ-జేఎంఎం-జేడీయూ సంకీర్ణ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాడు హేమంత్. 2013 జులై లో అత్యంత తక్కువ వయస్సులో జార్ఖండ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన హేమంత్ 2014 డిసెంబర్28 వరకు ఆ పదవిలో కొనసాగారు. జనవరిలో హేమంత్. ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్,జేవీఎం-పీ,ఆర్జేడీతో చర్చలకు నాయకత్వం వహించారు. దేశంలో మొదటిసారిగా మహా ఘట్ బంధన్ ప్లాన్ కి ఉదాహరణ నిలిచింది జార్ఖండ్ అని చెప్పవచ్చు. అయితే 2015లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ జార్ఖండ్ లో 37 సీట్లు గెలిచి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ 2019 ఎన్నికల్లో చతికిలబడిపోయింది. జేఎంఎం,కాంగ్రెస్ కూటమి ఘన విజయంతో హేమంత్ సోరెన్ మరోసారి జార్ఖండ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.