మొసళ్లకు భయపడలేదు : మద్య నిషేధం కోసం నదుల్లోమహిళల జలదీక్ష

  • Published By: veegamteam ,Published On : January 30, 2020 / 05:38 AM IST
మొసళ్లకు భయపడలేదు : మద్య నిషేధం కోసం నదుల్లోమహిళల జలదీక్ష

కర్ణాటకలో మద్యాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ 800 మందికిపైగా మహిళలు గంటల తరబడి జల దీక్ష చేశారు. కృష్ణా, మలప్రభ, ఘటప్రభ నదులు సంగమించే బాగల్కోటె జిల్లా కూడలసంగమలోని పవిత్ర ప్రాంతంలో మహిళలు మంగళవారం (జనవరి 28) సాయంత్రం నుంచి బుధవారం సాయంత్రం వరకు నడుంలోతు నీటిలో నిరసన తెలిపారు. వీరికి 51 మహిళా సంఘాలు మద్దతు పలికాయి. 
రాష్ట్రంలో మద్యం నిషేధం అమలు చేయాలనే డిమాండ్ తో మహిళలు రెండు రోజుల పాటు నిరస కార్యక్రమాలు చేపట్టారు. దీంట్లో భాగంగా మహిళా సంఘాలతో పాటు సోమవారం (జనవరి 23)న సంతకాల సేకరణ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు కూడా పాల్గొన్నారు. మూడు నదుల సంగమం వద్ద భక్తులు..యాత్రీకులకు విషయాన్ని తెలిపటంతో వారు కూడా సంతకాలు చేశారు. 
అనంతరం రెండవ రోజు అంటే మంగళవారం  కృష్ణా, మలప్రభ, ఘటప్రభ నదులు సంగమించే బాగల్కోటె జిల్లా కూడలసంగమలో నడుములోతు నీళ్ల 2 గంటలకుపైగా నిలబడి రాష్ట్రంలో మద్యాన్ని నిషేధించాలని ప్లకార్డులతో డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మరిన్ని బార్లను తెరవడానికి లైసెన్సులు జారీ చేసినందుకు వారు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఆ ప్రాంతంలోని నీటిలో మొసళ్లు ఉంటాయని దయచేసిన బైటకు వచ్చేయమని కొందరు హెచ్చరించినా మహిళలు భయపడలేదు. తమ దీక్షను ఆపకుండా కొనసాగించారు. 

ఈ సందర్భంగా మద్యం నిషేధ ఆందోళన కమిటీ సభ్యురాలు స్వర్ణ భట్ మాట్లాడుతూ..రాష్ట్రంలో మద్యనిషేధాన్ని అమలు చేయాలని ఎంతోకాలం నుంచి పోరాడుతున్నాం. రాష్ట్రవ్యాప్తంగా ఇదే డిమాండ్ తో కార్యక్రమాలు చేస్తున్న సందర్భంగా డిప్యూటీ సీఎం అశ్వత్ నారాయణ మద్యనిషేధం చేస్తామని మాకు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి రెండు నెలలు అయ్యింది కానీ ఇంతవరకూ ఆదిశగా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఉన్న మద్యం షాపులను తీసివేయకపోగా..మరిన్ని షాపులు పెడుతున్నా ఎటువంటి చర్యలు తీసుకోలేదు.  కష్టపడిన డబ్బంతా మద్యంషాపులకు ఇచ్చి అనారోగ్యాలకు గురై పురుషులు చనిపోతున్నారు. ఆ కుటుంబ భారమంతా మహిళలపై పడుతోంది. పిల్లలను చదివించుకోలేని దుస్థితి గ్రామీణ ప్రాంతాల్లో నెలకొంది. పిల్లలకు స్కూల్ ఫీజులు కూడా కట్టలేక వారిని స్కూల్స్ మాన్పించేస్తున్నారు.  దీనిపై ప్రభుత్వం ఎటువంటి దృష్టి పెట్టటంలేదు.  మద్యానికి బానిసలైన పురుషులు ఆస్తులు కూడా అమ్ముకుంటున్నారు. కుటుంబాలకు కుటుంబాలు దుర్భర  దుస్థితులకు నెట్టివేయబడుతున్నాయి. 

రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ శాఖను ఆదాయ లక్ష్యంగా చూస్తోంది. ప్రజల పాట్లు మాత్రం పట్టించుకోవటంలేదు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (నిమ్హాన్స్) నివేదిక ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న మద్యం దుకాణాలు వారి సంపద మొత్తాన్ని కోల్పోయిన కుటుంబాలను వీధుల్లోకి నెట్టివేస్తున్నాయి. మహిళలు శారీరకంగా..మానసికంగా  వేధింపులకు గురవుతారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోకుంటే తమ పోరాటాన్ని ఉదృతం చేస్తామని స్వర్ణ భట్ తెలిపారు. 

రాయ్‌చూర్‌కు చెందిన కరుడి గ్రామంలో నివసిస్తున్న ఓ మహిళ మాట్లాడుతూ..మద్యం తాగి తాగి నా భర్త చనిపోయాడు. కానీ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (పిడిఎస్) కింద ఉచిత బియ్యం ఇవ్వమని ప్రభుత్వాని అడిగినా ఫలితంలేదనీ..ప్రజల కోసం ఆ పథకం ఈ పథకం అంటూ ప్రభుత్వాలు ప్రజల్ని మోసం చేస్తోంది. కానీ మద్యం వల్ల కూలిపోతున్న కుటుంబాల్ని మాత్రం పట్టించుకోవటంలేదు. అలా మద్యానికి బలైపోయిన కుటుంబంలోని ఆడవారిని కూడా ఆదుకోవటంలేదు అంటూ ఆవేదన వ్యక్తంచేశారు.